విశాఖపట్నం: టెస్ట్ సిరీస్ ఓటమికి టీమిండియా ప్రతీకారం తీర్చుకుంది. విశాఖపట్నంలో జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో భారత్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బౌలర్లు రాణించగా, తరువాత బ్యాటర్లు అద్భుతం చేశారు. దాంతో దక్షిణాఫ్రికా మీద ODI సిరీస్‌ను 2-1 తేడాతో భారత్ గెలుచుకుంది. యశస్వి జైస్వాల్ అద్భుత సెంచరీ, విరాట్ కోహ్లీ (65 నాటౌట్), రోహిత్ శర్మ (75) అర్ధ సెంచరీలతో రాణించారు.

Continues below advertisement

270 పరుగులు లక్ష్యాన్ని ఏ తడబాటు లేకుండా భారత జట్టు సునాయాసంగా విజయం సాధించింది, కుల్దీప్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ నేతృత్వంలోని బౌలింగ్ విభాగం దక్షిణాఫ్రికాను 47.5 ఓవర్లలో 270 పరుగులకే ఆలౌట్ చేసి పైచేయి సాధించారు. తరువాత బ్యాటింగ్ లోనూ సత్తా చాటారు. తొలి వికెట్ కు ఏకంగా 155 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు జైస్వాల్, రోహిత్ శర్మ. దాదాపు 10 ఏళ్ల తరువాత తొలి వికెట్‌కు శతక భాగస్వామ్యం ఇది.

3 ఫార్మాట్‌లలో సెంచరీలు సాధించిన భారత బ్యాటర్లు-  సురేష్ రైనా-  రోహిత్ శర్మ-  కేఎల్ రాహుల్-  విరాట్ కోహ్లీ-  శుభ్‌మన్ గిల్-  యశస్వి జైస్వాల్

దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్..దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో తొలుత భారత బౌలర్లు రాణించారు. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ 4 వికెట్లు , పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ 4 వికెట్లతో చెలరేగడంతో దక్షిణాఫ్రికా జట్టు 47.5 ఓవర్లలో 270 పరుగులకు ఆలౌట్ అయింది. దక్షిణాఫ్రికా ఓపెనర్ క్వింటన్ డికాక్ (106 పరుగులు) శతకానికి తోడు, కెప్టెన్ టెంబా బవుమా 48 పరుగులతో మరోసారి రాణించాడు. 80 బంతుల్లోనే డికాక్ (89 బంతుల్లో 106, 8 ఫోర్లు, 6 సిక్సులు) శతకం బాదగా, బవుమా (67 బంతుల్లో 48, 5 ఫోర్లు) హాఫ్ సెంచరీ చేజార్చుకున్నాడు. మిగతా బ్యాటర్లు విఫలం కావడంతో దక్షిణాఫ్రికా మరో 13 బంతులుండగానే ఆలౌట్ అయింది. మార్‌క్రమ్ విఫలం కావడంతో సఫారీలు భారీ స్కోరు నమోదు చేయలేదు. బ్రెవిస్ 29 పరుగులు, జాన్సన్ 17 పరుగులు చేయగా.. చివర్లో కేశవ్ మహరాజ్ 20 పరుగులు చేయడంతో సఫారీలు ఆ మాత్రం స్కోరు చేయగలిగారు.

రాణించిన ఓపెనర్లు, తొలి వికెట్ కు శతక భాగస్వామ్యం..

271 పరుగుల మోస్తరు టార్గెట్ కావడంతో భారత్ మొదట కాస్త ఆచితూచి ఆడింది. ఒక్కసారిగా గేర్ మార్చి రోహిత్ శర్మ బ్యాట్ ఝులిపించాడు. వీలు చిక్కిన బంతులను బౌండరీలకు తరలించాడు. మరో ఎండ్ లో జైస్వాల్ సైతం సింగిల్స్ తీసి స్ట్రైక్ రొటేట్ చేస్తూ ఆ తరువాత మంచి షాట్లు ఆడాడు. ఈ క్రమంలో 54 బంతుల్లో రోహిత్ శర్మ 60వ హాఫ్ సెంచరీ సాధించాడు. ఆ తరువాత జైస్వాల్ సైతం అర్ధ శతకం చేశాడు. భారత ఓపెనర్లు సఫారీ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కోవడంతో తొలి వికెట్ కు ఏకంగా 155 పరుగుల భారీ భాగస్వామ్యం లభించింది. వన్డేల్లో దక్షిణాఫ్రికాపై తొలి వికెట్ కు ఇది 10వ సెంచరీ భాగస్వామ్యం. కాగా 2013 చాంపియన్స్ ట్రోఫీ తరువాత ఇదే తొలిసారి. రోహిత్ 75 పరుగుల వద్ద కేశవ్ మహరాజ్ బౌలింగ్ లో క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.

తరువాత జైస్వాల్ 111 బంతుల్లో సెంచరీ చేశాడు. వన్డే ఫార్మాట్లో తనకిది తొలి శతకం. విరాట్ కోహ్లీ ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. బార్ట్‌మాన్ బౌలింగ్‌లో ఫోర్ కొట్టిన విరాట్ కోహ్లీ 40 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. తరువాత బంతికే ఏకంగా 87 మీటర్ల సిక్స్ కొట్టి పాత కోహ్లీని చూపించాడు. కోహ్లీ(45 బంతుల్లో 6 నాటౌట్, 6 ఫోర్లు, 3 సిక్సర్లు) దూకుడుగా ఆడటంతో 39.5 ఓవర్లలో భారత్ 271 టార్గెట్ ఛేదించింది. విశాఖ వన్డే విజయంతో 2-1 తేడాతో దక్షిణాఫ్రికాపై వన్డే సిరీస్ కైవసం చేసుకుని టెస్ట్ సిరీస్ ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. గిల్ గాయంతో దూరం కావడంతో కేఎల్ రాహుల్ వన్డే సిరీస్ కు కెప్టె్న్‌‌గా వ్యవహరించాడని తెలిసిందే.