Ind vs SA 3rd ODI Visakhapatnam | విశాఖపట్నం: భారత్‌తో జరుగుగుతున్న మూడో వన్డేలో బౌలర్లు రాణించారు. తక్కువ స్కోరుకే దక్షిణాఫ్రికాను కట్టడి చేశారు. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ 4 వికెట్లు , ప్రసిద్ధ్ కృష్ణ 4 వికెట్లతో చెలరేగడంతో దక్షిణాఫ్రికా జట్టు 47.5 ఓవర్లలో 270 పరుగులకు ఆలౌట్ అయింది. దక్షిణాఫ్రికా ఓపెనర్ క్వింటన్ డికాక్ (106 పరుగులు) శతకంతో చెలరేగగా, కెప్టెన్ టెంబా బవుమా 48 పరుగులతో మరోసారి రాణించాడు. మిగతా బ్యాటర్లు విఫలం కావడంతో దక్షిణాఫ్రికా మరో 13 బంతులుండగానే ఆలౌట్ అయింది.

Continues below advertisement

ఎట్టకేలకు టాస్ గెలిచిన టీమిండియా

2023 వన్డే వరల్డ్ కప్ తరువాత భారత్ తొలిసారి టాస్ నెగ్గింది. కెప్టెన్లు వరుసగా 20 మ్యాచులలో టీమిండియా టాస్ ఓడిపోయింది. అయితే దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్2లో నిర్ణయాత్మక మూడో వన్డేలో మాత్రం భారత కెప్టెన్ రాహుల్ టాస్ గెలిచాడు. రైట్ హ్యాండ్ తో కాయిన్ స్పిన్ చేస్తే పని కావడం లేదని, విశాఖ వన్డేలో ఎడమ చేతితో కాయిన్ ఎగరేసి ఫలితం రాబట్టాడు రాహుల్. 

Continues below advertisement

టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ తీసుకుంది. అనుకున్నట్లుగానే సఫారీలకు ఆదిలోనే ఎదురుదెబ్బ తాకింది. అర్షదీప్ బౌలింగ్ లో రికెల్టన్ డకౌట్ అయ్యాడు. రెండో, మూడో ఓవర్లు మెయిడిన్ ఓవర్లు కావడంతో దక్షిణాఫ్రికాపై ఒత్తిడి పెరిగినా కెప్టెన్ బవుమా (67 బంతుల్లో 48, 5 ఫోర్లు) రాణించాడు. బవుమాతో కలిసి ఓపెనర్ డికాక్ ఇన్నింగ్స్ నడిపించాడు. 80 బంతుల్లోనే డికాక్ (89 బంతుల్లో 106, 8 ఫోర్లు, 6 సిక్సులు) శతకం బాదేశాడు. వేగంగా పరుగులు రాబట్టే క్రమంలో ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్ లో వికెట్ సమర్పించుకున్నాడు. తరువాత మార్‌క్రమ్ విఫలం కావడంతో భారీ స్కోరు నమోదు కాలేదు. బ్రెవిస్ 29 పరుగులు, జాన్సన్ 17 పరుగులు చేశారు. చివర్లో కేశవ్ మహరాజ్ 20 పరుగులతో నాటౌట్ గా నిలవడంతో సఫారీలు ఆ మాత్రం స్కోరు చేయగలిగారు.

భారత్‌పై డికాక్ రికార్డుల మోత..

క్వింటన్ డి కాక్ తన తాజా సెంచరీతో చరిత్ర సృష్టించాడు. విశాఖపట్నం వేదికగా జరుగుతున్న వన్డేలో ఈ దక్షిణాఫ్రికా ఓపెనర్ శతకం బాదగా, వన్డే కెరీర్‌లో అతిడికిది 23వ సెంచరీ. ఈ మ్యాచ్‌లో కీపర్ బ్యాటర్ కేవలం 80 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. భారతదేశంపై ODIలలో అత్యంత వేగంగా 7 సెంచరీలు పూర్తి చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. ఈ అద్భుతమైన ప్రదర్శనతో, డి కాక్ వన్డే క్రికెట్ చరిత్రలో వికెట్ కీపర్‌గా అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్‌గానూ రికార్డు నమోదు చేశాడు.

శ్రీలంక దిగ్గజం సరసన డికాక్..వన్డే క్రికెట్ చరిత్రలో వికెట్ కీపర్‌గా అత్యధిక సెంచరీలు సాధించిన వారిలో క్వింటన్ డి కాక్, శ్రీలంక దిగ్గజం కుమార సంగక్కరతో సమానంగా నిలిచాడు. వన్డే ఫార్మాట్‌లో వీరు ఇద్దరూ చెరి 23 సెంచరీలు సాధించారు. ఈ జాబితాలో వెస్టిండీస్ ఆటగాడు షై హోప్ 19 సెంచరీలతో 3వ స్థానంలో ఉన్నాడు. వీరితో పాటు, ఆడమ్ గిల్‌క్రిస్ట్ 16 సెంచరీలతో, జోస్ బట్లర్ 11 సెంచరీలతో, మరియు MS ధోని వికెట్ కీపర్‌గా 10 వన్డే సెంచరీలతో టాప్ 6లో ఉన్నారు.