Virat Kohli viral tweet after India's series win: రాంచీ (ranchi)వేదికగా జరిగిన నాలుగో టెస్టులో టీమిండియా(Team India) ఘన విజయం సాధించి... మరో మ్యాచ్ మిగిలి వుండగానే సిరీస్ కైవసం చేసుకుంది. లక్ష్య సాధనలో ఇంగ్లాండ్ స్పిన్నర్ బషీర్ కాస్త కంగారుపెట్టినా తొలి ఇన్నింగ్స్ హీరో జురెల్ గిల్ భారత్ ను విజయ తీరాలకు చేర్చారు. ఆరంభంలో సారధి రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ భారత్ కు బలమైన పునాది వేశారు. కానీ బషీర్ వరుసగా రెండు వికెట్లు తీయడంతో ఉత్కంఠ రేగింది.  కానీ గిల్... జురెల్ మిగితా పనిని ఎలాంటి ఒతిడి లేకుండా పూర్తి చేశారు. ఈ విజయంతో ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో భారత్‌ 3-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. నాలుగో టెస్టులో ఐదు వికెట్ల తేడాతో ఇంగ్లాండ్‌పై టీమ్‌ఇండియా విజయం సాధించింది. టీమ్‌ఇండియా సిరీస్‌ విజయంపై విరాట్ కోహ్లీ స్పందించాడు. యువ జట్టు అద్భుతం చేసిందని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. సిరీస్‌ను కైవసం చేసుకున్న యంగ్‌ టీంకు శుభాకాంక్షలు తెలిపిన కోహ్లీ.. పట్టుదల, సంకల్పం, కఠిన పరిస్థితులను ఎదుర్కొనే దృఢత్వాన్ని కుర్రాళ్లు ప్రదర్శించారని కొనియాడాడు. 


రెండోసారి తండ్రైన కోహ్లీ
స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లి(Virat Kohli) రెండోసారి తండ్రయ్యాడు. తన భార్య అనుష్క శర్మ(Anshuka Sharma) ఈ నెల 15న మగబిడ్డకు జన్మనిచ్చిందని కోహ్లి ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌లో తెలిపాడు. కొడుకు పేరు అకాయ్‌(Akaay) అని పేర్కొన్నాడు. కోహ్లి, అనుష్కలకు ఇప్పటికే మూడేళ్ల కుమార్తె వామిక ఉంది. ఫిబ్రవరి 15న వామిక తమ్ముడు అకాయ్‌ని ఈ ప్రపంచంలోకి ఆహ్వానించామని కోహ్లీ తెలిపాడు. ఈ విషయం అందరికీ చెప్పడానికి సంతోషిస్తున్నామని... ఈ అందమైన సమయంలో అందరీ ఆశీర్వాదాలు కావాలంటూ కోహ్లీ ఇన్‌ స్టాలో పోస్ట్ చేశాడు. తమ ఏకాంతాన్ని గౌరవించమని విజ్ఞప్తి చేస్తున్నామన్నాడు. కోహ్లీ ప్రకటనతో క్రికెట్‌ ప్రపంచం విరుష్క దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతోంది.


సచిన్‌ శుభాకాంక్షలు
ఈ వార్త తెలిసిన వెంటనే ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుత, మాజీ క్రికెటర్లు విరుష్క జంటను అభినందిస్తున్నారు. సచిన్ టెండూల్కర్ కూడా సోషల్ మీడియా వేదికగా కోహ్లీ, అనుష్కలకు శుభాకాంక్షలు తెలియజేశాడు. మీ అందమైన కుటుంబంలోకి అమూల్యమైన అకాయ్ వచ్చినందుకు విరాట్, అనుష్కలకు అభినందనలంటూ సచిన్‌ పోస్ట్ చేశాడు. అకాయ్ అనే పేరులోనే నిండుచంద్రుడు ఉన్నాడని.. అతడు మీ ఇంట్లో ఇక వెలుగులు నింపినట్టే అని సచిన్‌ అన్నాడు. అతను మీ ప్రపంచాన్ని అంతులేని ఆనందం, నవ్వుతో నింపుతాడని అన్నాడు. మీరు ఎప్పటికీ ఆదరించే జ్ఞాపకాలు మీ వెంటే ఉంటాయని ఆశిస్తున్నాను. ప్రపంచానికి స్వాగతం.. లిటిల్ ఛాంప్!’ అంటూ సచిన్ ట్వీట్ చేశాడు. ఇప్పటికే రషీద్ ఖాన్, యుజ్వేంద్ర చాహల్, వీరేంద్ర సెహ్వాగ్, హర్భజన్ సింగ్, వరుణ్ చక్రవర్తి క్రికెటర్లు విరాట్, అనుష్కలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ విషయాన్ని అనుష్క స్వయంగా ప్రకటించింది. అయితే అయిదు రోజులు ఆలస్యంగా ఆమె ఈ గుడ్‌న్యూస్‌ను పంచుకుంది. ఈ సందర్భంగా ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ షేర్‌ చేసింది.