Virat Kohli Records:
పరుగుల రారాజు విరాట్ కోహ్లీకి (Virat Kohli) రికార్డులు సృష్టించడం.. వాటిని బద్దలు కొట్టడం కొత్తేమీ కాదు! ఆడిన ప్రతి సిరీసులో ఏదో ఒక ప్రత్యేకత చాటుకుంటాడు. దిగ్గజాల ఘనతను చెరిపివేయడమో.. తన పేరుతో లిఖించుకోవడమో చేస్తుంటాడు. ఆసియాకప్‌లోనూ అంతే! టీమ్‌ఇండియా సాధించిన 300 విజయాల్లో భాగమైన ఘనత అందుకున్నాడు. పనిలో పనిగా తాను ఆరాధించే సచిన్ తెందూల్కర్ (Sachin Tendulkar) ఘనతకు ఎసరు పెట్టాడు!
భారత్ తరఫున 300 విజయాల్లో పాలుపంచుకున్న జాబితాలో మొన్నటి వరకు సచిన్ తెందూల్కర్ మాత్రమే ఉన్నాడు. తాజాగా విరాట్ కోహ్లీ ఆ క్లబ్‌లోకి అడుగుపెట్టాడు. 300 విజయాల్లో భాగమైన రెండో ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. శ్రీలంకపై టీమ్‌ఇండియా సాధించిన విజయంతో అతడి ఖాతాలో ఈ ఘనత చేరిపోయింది. ఇక సచిన్ 307 విజయాల రికార్డుకు అతడు అత్యంత చేరువలో ఉన్నారు. ఐసీసీ వన్డే ప్రపంచకప్‌లో దానినీ తిరగరాయడం ఖాయమే.
ప్రపంచ వ్యాప్తంగా 300 విజయాల రికార్డు కేవలం ఆరుగురికే ఉంది. 37 విజయాలతో రికీ పాంటింగ్ అగ్రస్థానంలో ఉన్నాడు. మహేళా జయవర్దనె (336), సచిన్ తెందూల్కర్ (307), జాక్వెస్ కలిస్ (305), కుమార సంగక్కర (305), విరాట్ కోహ్లీ (300*) అతడి తర్వాత ఉన్నారు. టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ 298 విజయాలతో ఆగిపోయాడు.
విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు 111 టెస్టులు ఆడాడు. 49.29 సగటు, 55.23 స్ట్రైక్‌రేట్‌తో 8676 పరుగులు చేశాడు. ఇక 279 వన్డేల్లో 47.38 సగటు, 93.79 స్ట్రైక్‌రేట్‌తో 13,027 పరుగులు సాధించాడు. 115 టీ20ల్లో 52.73 సగటు, 137.96 స్ట్రైక్‌రేట్‌తో 4008 పరుగులు అందుకున్నాడు. టెస్టుల్లో 29, వన్డేల్లో 47, టీ20ల్లో ఒక సెంచరీ బాదేశాడు. ఇక ఫస్ట్‌క్లాస్, లిస్ట్-ఏలో అతడు చేసిన పరుగులు, సెంచరీలు, హాఫ్ సెంచరీలకు లెక్కేలేదు.
Asia Cup 2023: ఈ ఏడాది జూన్ నుంచి వన్డేలలో ఓటమెరుగని జట్టుగా ఉన్న శ్రీలంకకు ఆసియా కప్‌లో భారత్ ఓటమి రుచి చూపించింది. వరుసగా 13 వన్డేలు గెలిచిన శ్రీలంకను ఓడించి ఆసియా కప్ - 2023లో ఫైనల్ చేరిన తొలి జట్టుగా నిలిచింది. శ్రీలంక స్పిన్నర్లు రాణించి భారత్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేసినా ఆ తర్వాత లంక బ్యాటర్ల వైఫల్యంతో ఆ జట్టుకు పరాజయం తప్పలేదు. బ్యాటింగ్‌లో రోహిత్ శర్మ, బౌలింగ్‌లో స్టార్ స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్‌లు రాణించి భారత్‌ను లో స్కోరింగ్ థ్రిల్లర్‌లో గెలుపు అందుకుంది.
భారత్‌తో సూపర్ - 4 మ్యాచ్‌కు ముందు లంక గత మూడు నెలలుగా వన్డేలలో ఓటమెరుగని జట్టుగా బరిలోకి దిగింది. 2023 జూన్ నుంచి మొన్న బంగ్లాదేశ్‌తో ఆడిన 13 వన్డేలలో ఓటమనేదే లేకుండా సాగింది ఆ జట్టు జైత్రయాత్ర. అఫ్గాన్, యూఏఈ, ఓమన్, ఐర్లాండ్, నెదర్లాండ్స్, జింబాబ్వే, వెస్టిండీస్, బంగ్లాదేశ్‌లపై ఆ జట్టు విజయాలు సాధించింది. భారత్‌తో పోరులోనూ ఆ జట్టు విజయం సాధించే అవకాశాలు ఉన్నా వాటిని వృథా చేసుకుంది.