Ind Vs Eng ODI Series Updates: టీమిండియాలోకి మిస్టరీ స్పిన్నర్.. ట్రైనింగ్ సెషన్లో ప్రత్యక్షం..
టీ20ల్లో వరుణ్ ను ఆడలేక బ్యాటర్లు బోల్తా పడ్డారు. ఈ సిరీస్ లో 14 వికెట్లు సాధించి సత్తా చాటాడు. ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ తో పాటు ఒక ద్వైపాక్షిక సిరీస్ లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్ గా నిలిచాడు.

Varun Chakravarthy: ఇంగ్లాండ్ తో ఈనెల 6 నుంచి ప్రారంభమయ్యే వన్డే సిరీస్ లో భారత్ పెద్ద మార్పే చేసినట్లు కనిపిస్తోంది. 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ లో విశేషంగా రాణించిన మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని జట్టులోకి తీసుకునే అవకాశమున్నట్లు తెలుస్తోంది. నాగపూర్ లో ఈనెల 6 నుంచి వన్డే సిరీస్ ప్రారంభమవుతున్న సంగతి తెలిసిందే. అయితే తొలుత ప్రకటించిన జట్టులో వరుణ్ లేడు. అయితే తను తాజాగా జట్టు ట్రైనింగ్ సెషన్లో కనిపించడంతో పలు ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఇక టీ20 సిరీస్ లో వరుణ్ ని ఆడలేక ఇంగ్లీష్ బ్యాటర్లు బోల్తా పడ్డారు. ఈ సిరీస్ లో 14 వికెట్లు సాధించి సత్తా చాటాడు. దీంతో ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ తో పాటు ఒక ద్వైపాక్షిక సిరీస్ లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్ గా తన పేరిటే ఉన్న రికార్డు (12 వికెట్లు, సౌతాఫ్రికాపై 2024)ను తిరగరాశాడు. తాజా ప్రదర్శనతో తనను జట్టులోకి తీసుకున్నారా..? అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.
నలుగురు స్పిన్నర్లు..
ఇంగ్లాండ్ తో వన్డే సిరీస్ తోపాటు ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి ప్రకటించిన భారత జట్టులో ఇప్పటికే నలుగురు స్పిన్నర్లు ఉన్నారు. కులదీప్ యాదవ్ స్పెషలిస్టు స్పిన్నర్ కాగా, అక్షర్ పటేల్, రవీంద్ జడేజా, వాషింగ్టన్ సుందర్లు.. బ్యాటింగ్ స్పిన్ ఆల్ రౌండర్లు కావడం విశేషం. ఇక తాజాగా వరుణ్ జట్టుతో చేరడంతో ఇంగ్లాండ్ తో వన్డే సిరీస్ లో తనను ఏమైనా ఆడిస్తారా..? అనే ప్రశ్నలు అభిమానుల మదిని తొలుస్తున్నాయి. వరుణ్ గత ప్రదర్శనలను చూసిన మాజీ ప్లేయర్లు అతడిని ప్రతిష్టాత్మక ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేయాలని డిమాండ్ చేశారు. దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా మెగాటోర్నీ జరిగే దుబాయ్ కి వెళతాడని ధీమాగా చెప్పాడు. అతని ప్రదర్శనతో కచ్చితంగా జట్టులో చోటు దక్కించుకుంటాడని పేర్కొంది. అయితే టీ20లు ఆడాడు కానీ, ఇప్పటివరకైతే వన్డేల్లో వరుణ్ డెబ్యూ చేయలేదు. అయితే తొలి వన్డేలో అతడిని ఆడిస్తారా..? లేదా అన్నదానిపై స్పష్టత లేదు.
మార్పులకు 11 వరకు అవకాశం..
నిజానికి గతనెలలోనే చాంపియన్స్ టోర్నీకి జట్టును ప్రకటించిన టీమిండియా.. కావాలనుకుంటే ఈనెల 11 వరకు మార్పులు చేసుకోవచ్చు. ఆ లోగా ఇంగ్లాండ్ తో రెండు వన్డేలు పూర్తవుతాయి. ఈ నేపథ్యంలో రెండు వన్డేల్లో వరుణ్ ను ఆడించి, పరీక్షిస్తుందా..? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా ఉంది. ఏదేమైనా 2021 టీ20 ప్రపంచకప్ తర్వాత కనుమరుగై, తిరిగి బౌన్స్ బాక్ అయ్యి, సత్తా చాటుతున్న వరుణ్ వన్డేలు కూడా ఆడాలని అతని అభిమానులు కోరుకుంటున్నారు. ఇక వన్డే సిరీస్లో వెటరన్ స్టార్లు.. విరాట్ కోహ్లీ, కెప్టెన్ రోహిత్ శర్మ, రవీంద్ర జాడేజా, స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఆడనున్నారు.
వన్డే సిరీస్ కు భారత జట్టు : రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమాన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, అర్షదీప్ సింగ్, యశస్వి జైస్వాల్, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా
Also Read: Shivam Dube World Record: దూబే ధనాధన్ రికార్డు.. అజేయంగా 30 మ్యాచ్ లు గెలిచిన జట్టులో..