Shivam Dube World Record: దూబే ధనాధన్ రికార్డు.. అజేయంగా 30 మ్యాచ్ లు గెలిచిన జట్టులో..
ఐదో టీ20 ద్వారా అజేయంగా 30 మ్యాచ్ లు గెలిచిన జట్టులో సభ్యునిగా దూబే రికార్డుల్లోకి ఎక్కాడు. తను ఆడిన గత 30 టీ20ల్లో భారత్ గెలిచింది. దీంతో ఈ ఘనత సాధించిన తొలి ప్లేయర్ గా తను రికార్డుల్లోకి ఎక్కాడు.

Ind Vs Eng T20 Series Updates: భారత స్టార్ ఆల్ రౌండర్ శివమ్ దూబే అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంగ్లాండ్ తో గత ఆదివారం జరిగిన ఐదో టీ20లో భారత్ 150 పరుగులతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ ద్వారా అజేయంగా 30 మ్యాచ్ లు గెలిచిన జట్టులో సభ్యునిగా దూబే రికార్డుల్లోకి ఎక్కాడు. అంటే తను ఆడిన గత 30 టీ20ల్లో భారత్ విజయం సాధించింది. దీంతో ఈ ఘనత సాధించిన తొలి ప్లేయర్ గా తను రికార్డుల్లోకి ఎక్కాడు. ఇప్పటివరకు ఇలాంటి అరుదైన ఘనతను ఎవరూ సాధించలేక పోయారు. చివరిసారిగా బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో భారత్ తరపున దూబే బరిలోకి దిగగా అప్పుడు ఇండియా ఓడిపోయింది. ఆ తర్వాత అంటే 2019 నుంచి కూడా దూబే తుదిజట్టులో ఉన్నప్పుడు ఇండియా ఇప్పటివరకు ఒక్క టీ20 మ్యాచ్ ఓడిపోకపోవడం విశేషం.
అనుకోకుండా వచ్చి..
నిజానికి ఈ సిరీస్ తొలుత ప్రకటించినప్పుడు శివమ్ దూబే పేరు లేదు. తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి గాయంతో సిరీస్ కు దూరం అవడంతో అతని స్థానంలో తను జట్టులోకి వచ్చాడు. ఈక్రమంలో నాలుగు, ఐదు టీ20ల్లో తను తుది జట్టులో స్థానం సంపాదించుకుని, జట్టులో విజయాల్లో పాత్ర పోషించాడు. నాలుగో టీ20లో కీలకమైన భాగస్వామ్యాన్ని హార్దిక్ పాండ్యాతో నెలకొల్పాడు. ఇక ఐదో టీ20లో మెరుపు వేగంతో 30 పరుగులు చేయడమే కాకుండా, రెండు వికెట్లు కూడా పడగొట్టాడు. తాజాగా ఈ రికార్డును ప్రస్తావిస్తూ ఐపీఎల్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ సూపర్బ్ పోస్టు పెట్టింది. 30-0 అనే కాప్షన్ తగిలించి, దూబే గురించి గొప్పగా పొగిడింది. తను ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.
6 నుంచి వన్డే సిరీస్..
ఇంగ్లాండ్, ఇండియా జట్ల మధ్య ఐదు టీ20ల సిరీస్ అయిపోవడంతో ఇప్పుడు వన్డే పోరు నెలకొననుంది. ఈనెల 6 నుంచి నాగపూర్ లో జరిగే తొలి వన్డేతో సిరీస్ ప్రారంభం అవుతుంది. 9, 12వ తేదీల్లో మరో రెండు వన్డేలు జరుగుతాయి. ఈనెల 19 నుంచి ప్రారంభమయ్యే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి సన్నాహకంగా ఈ సిరీస్ ఆడుతున్నారు. భారత మ్యాచ్ లు దుబాయ్ లో జరుగుతాయి. ఈనెల 20న బంగ్లాదేశ్, 23న పాకిస్థాన్, వచ్చేనెల 2న న్యూజిలాండ్ తో భారత్ తలపడనుంది. లీగ్ దశలో గ్రూపులో టాప్ 2లో నిలిచిన జట్లు నేరుగా సెమీస్ కు అర్హత సాధిస్తాయి. 2002, 2013లో టోర్నీ సాధించిన భారత్, 2017లో జరిగిన చివరి ఎడిషన్ లో రన్నరప్ గా నిలిచింది. దీంతో ఈసారి కప్పు గెలవాలని బరిలోకి దిగుతోంది.
Also Read: Gongadi Trisha Grand Welcome: హైదరాబాద్ చేరుకున్న త్రిష.. తనకు స్ఫూర్తి ఎవరంటే..?