దక్షిణాఫ్రికా(South Africa) గడ్డపై నేటి నుంచి అండర్‌ 19 ప్రపంచకప్‌( Under-19 World Cup) ప్రారంభం కానుంది. 15వ ఎడిషన్‌గా జరుగుతున్న ఈ మెగా టోర్నీలో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ హోదాలో భారత్‌(Team India) బరిలోకి దిగుతోంది. ఇవాళ ఐర్లాండ్‌ – యూఎస్‌ఏ మధ్య జరగనున్న పోరుతో అండర్‌ 19 ప్రపంచకప్‌ ప్రారంభం కానుంది. చివరగా 2022లో వెస్టిండీస్‌లో జరిగిన మెగా టోర్నీలో భారత్ విజేతగా నిలిచింది. రికార్డు స్థాయిలో ఐదవసారి టైటిల్‌ను టీమిండియా సొంతం చేసుకుంది. 

మ్యాచ్‌లు జరుగుతాయి ఇలా..

2024 జనవరిలో ప్రారంభమయ్యే ఈ మెగా టోర్నీలో 41 మ్యాచ్‌లు జరగనుండగా, ఫిబ్రవరిలో ఫైనల్ జరగనుంది. జనవరి 19 నుంచి తొలి దశ పోటీలు జరుగుతాయి. ఈనెల 28 వరకు తొలి రౌండ్‌ పోటీలుంటాయి. ప్రతి గ్రూపులో టాప్‌ -3లో ఉన్న జట్లు సూపర్‌ సిక్స్‌ దశకు చేరుతాయి. సూపర్‌ సిక్స్‌లో కూడా మళ్లీ నాలుగు గ్రూపులుగా విడిపోయి తలపడతాయి. ఈ దశలో ప్రతి గ్రూపులో టాప్‌ లో ఉన్న జట్టు సెమీస్‌కు అర్హత సాధిస్తుంది. ఫిబ్రవరి 3 దాకా ఈ పోటీలు సాగుతాయి. ఇక ఫిబ్రవరి 6, 8న రెండు సెమీఫైనల్స్‌ జరుగుతాయి. ఫిబ్రవరి 11న బెనొనిలోని విల్లోమూర్‌ పార్క్‌ వేదికగా తుది పోరు జరుగునుంది. ఈసారి గ్రూప్ స్టేజీ తరువాత సూపర్ సిక్స్ విధానాన్ని తీసుకొస్తుంది ఐసీసీ. సూపర్ సిక్స్ మ్యాచ్ ఫలితాలతో సెమీ ఫైనల్ టీమ్స్ ను నిర్ణయిస్తారు. 

 

ఏ గ్రూప్‌లో ఎవరంటే..?

అండర్ 19 వరల్డ్ కప్ లో పాల్గొనే 16 జట్లను 4 గ్రూపులుగా విభజించారు. గ్రూప్ Aలో డిఫెండింగ్ ఛాంపియన్‌ భారత్‌తో పాటు బంగ్లాదేశ్, ఐర్లాండ్, అమెరికాలు ఉన్నాయి. గ్రూప్ Bలో ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, స్కాట్లాండ్ ఉన్నాయి. గ్రూప్ Cలో ఆస్ట్రేలియా, శ్రీలంక, జింబాబ్వే, నమీబియా ఉన్నాయి. ఇక గ్రూప్ Dలో ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, న్యూజిలాండ్, నేపాల్ టీమ్స్ సూపర్ సిక్స్ కోసం పోటీ పడనున్నాయి. 

 

దక్షిణాఫ్రికాకు అవకాశం

2024లో నిర్వహించనున్న ఐసీసీ మెన్స్ అండర్ 19 వరల్డ్ కప్ (Under19 Mens World Cup 2024) హోస్టింగ్ బాధ్యతల నుంచి లంకను తప్పించింది. ఆ అవకాశాన్ని దక్షిణాఫ్రికాకు కల్పిస్తూ ఐసీసీ బోర్డు తాజాగా నిర్ణయం తీసుకుంది. దాంతో వచ్చే ఏడాది జనవరిలో జరగనున్న అండర్ 19 వరల్డ్ కప్ ను దక్షిణాఫ్రికా నిర్వహించనుందని బోర్డు స్పష్టం చేసింది. లంక క్రికెట్ కి నిధులు ఐసీసీ తన ఆధీనంలోకి తీసుకుంది. ఈ కారణంగా వచ్చే జనవరిలో జరగాల్సిన మెన్స్ అండర్ 19 ప్రపంచ కప్ నిర్వహణ నుంచి లంకను తప్పించి దక్షిణాఫ్రికాకు బాధ్యతల్ని అప్పగించింది. ఈ ఏడాది మహిళల U19 T20 ప్రపంచ కప్ నిర్వహించిన దక్షిణాఫ్రికా పురుషుల అండర్ 19 అవకాశాన్ని దక్కించుకుంది. 

 

భారత్‌ మ్యాచ్‌ల తేదీలు..

జూనియర్ల ప్రపంచకప్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్న భారత్‌ తొలి మ్యాచ్‌ను ఈనెల 20న బంగ్లాదేశ్‌తో ఆడనుంది. గ్రూప్‌ దశలో భారత్‌ మూడు మ్యాచ్‌లు ఆడనుంది.

జనవరి 20 : బంగ్లాదేశ్‌తో

జనవరి 25 : ఐర్లాండ్‌తో

జనవరి 28 : అమెరికాతో మ్యాచ్‌లు ఉన్నాయి.

భారత జట్టు: ఉదయ్‌ సహారన్‌ (కెప్టెన్‌), సౌమీ కుమార్‌ పాండే, అర్షిన్‌ కులకర్ణి, ఆదర్శ్‌ సింగ్‌, రుద్ర మయూర్‌ పటేల్‌, సచిన్‌ దాస్‌, ప్రియాంశు మోలియా, ముషీర్‌ఖాన్‌, మురుగన్‌ అభిషేక్‌, అవనీశ్‌ రావు, ఇనీశ్‌ మహాజన్‌, ధనుశ్‌ గౌడ, ఆరాధ్య శుక్లా, రాజ్‌ లింబాని, నమన్‌ తివారి; స్టాండ్‌బై: ప్రేమ్‌ దేవ్‌కర్‌, అన్ష్‌ గొసాయ్‌, మహ్మద్‌ అమన్‌