టీ20 ప్రపంచకప్‌(T20 World Cup)లో భారత జట్టు కొత్త చరిత్ర సృష్టించింది. బెంగళూరు(Bangalore) వేదికగా జరిగిన మూడో టీ20లో అఫ్గాన్‌(Afghanistan)ను మట్టికరిపించి... టీ20 చరిత్రలో అత్యధిక వైట్‌వాష్‌లు చేసిన జట్టుగా భారత్‌ అవతరించింది. ఈ మ్యాచ్‌లో తొలి రెండు మ్యాచుల్లో ఒక్క పరుగు చేయకుండానే పెవిలియన్‌కు చేరిన రోహిత్‌ శర్మ(Rohit Sharma) విధ్వంసం సృష్టించాడు. తాను క్రీజులో కుదురుకుంటే ఎంతటి విధ్వంసకర బ్యాట్స్‌మెన్‌నో విమర్శలకులందరికీ చెప్పేశాడు. అఫ్గాన్‌పై విధ్వంసకర సెంచరీతో విమర్శలకు బ్యాట్‌తో సరైన సమాధానం చెప్పాడు. టీ 20 ప్రపంచకప్‌నకు ముందు టీమిండియాకు మిగిలిన ఏకైక టీ 20 మ్యాచ్‌లో హిట్‌మ్యాన్‌ విశ్వరూపం చూపాడు. ఏ రికార్డు అయినా తాను దిగనంత వరకేనని ఈ ఇన్నింగ్స్‌తో కెప్టెన్ రోహిత్ చాటిచెప్పాడు. ఈ ఒక్క ఇన్నింగ్స్‌తో రోహిత్‌ పలు రికార్డులను బద్దలు కొట్టాడు. అయితే సూపర్‌ ఓవర్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సరికొత్త చర్చకు దారితీసింది. 


ఇంతకీ ఏం జరిగింది..?
 తొలి సూపర్‌ ఓవర్‌లో అఫ్గాన్‌ మొదట బ్యాటింగ్‌ చేసి 16 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యఛేదనలో భారత్ 16 పరుగులే చేయగలిగింది. ఇక్కడే రోహిత్ తెలివైన నిర్ణయం తీసుకున్నాడు. రెండు సిక్స్‌లు కొట్టిన తర్వాత సింగిల్‌తో నాన్‌స్ట్రైకింగ్‌కు వెళ్లాడు. అప్పటికి చివరి బంతి మాత్రమే మిగిలి ఉంది. ఇంకా 2 పరుగులు చేయాలి. ఈ సమయంలో రిటైర్డ్ హర్ట్‌(retired hurt) గా వెనుదిరుగుతున్నట్లు అంపైర్‌కు సమాచారం ఇచ్చాడు. తన స్థానంలో రింకును క్రీజ్‌లోకి రమ్మన్నాడు. రింకు వేగంగా పరుగు తీస్తాడనే ఉద్దేశంతో ఆ నిర్ణయం తీసుకున్నాడు. కానీ, ఒక పరుగు మాత్రమే రావడంతో మ్యాచ్‌ రెండో సూపర్‌ ఓవర్‌కు వెళ్లింది. ఆ సమయంలో ఆశ్చర్యపోవడం టీవీల ముందు చూస్తున్న అభిమానులతో పాటు స్టేడియంలో ఉన్న ప్రేక్షకులు, ఇరు జట్ల ఆటగాళ్లు, కోచింగ్‌ సిబ్బంది వంతైంది. అయితే ఇది ‘రిటైర్డ్‌ అవుట్‌’, ‘రిటైర్డ్‌ నాట్‌ అవుట్‌’ అనేది క్లారిటీ లేదు. కానీ రోహిత్‌ మాత్రం రెండోసారీ బ్యాటింగ్‌కు వచ్చాడు. 


రోహిత్‌ అలా ఎందుకు చేశాడంటే..?
ఒకవేళ ఆ చివరి బంతికి రోహిత్ రనౌట్‌ రూపంలో పెవిలియన్‌కు చేరితే.. రెండో సూపర్‌ ఓవర్‌లో రోహిత్‌ శర్మ బ్యాటింగ్‌కు వచ్చే అవకాశం ఉండేది కాదు. ఐసీసీ నిబంధనల ప్రకారం ఫలితం కోసం ఎన్ని సూపర్‌ ఓవర్లైనా ఆడాలి. తొలి సూపర్‌ ఓవర్‌లో ఔటైన బ్యాటర్‌కు మాత్రం రెండో సూపర్‌ ఓవర్‌లో ఆడే అవకాశం ఉండదు. దీంతో తెలివిగా వ్యవహరించిన రోహిత్‌ శర్మ రిటైర్డ్‌ హర్ట్‌గా వెనుదిరిగుతున్నట్లు అంపైర్‌కు చెప్పాడు. ఒక వేళ రిటైర్డ్‌ ఔట్‌(retired out)గా ప్రకటించి ఉంటే ఇబ్బంది తలెత్తేది. చివరికి అంపైర్లు కూడా ఈ విషయంపై స్పష్టత ఇవ్వడంతో అఫ్గాన్‌ ఆటగాళ్లూ అభ్యంతరం వ్యక్తం చేయలేదు. రోహిత్ ‘రిటైర్డ్‌ హర్ట్‌’గానే పెవిలియన్‌కు వెళ్లినట్లు అంపైర్లు ప్రకటించారు. భారత్ 12 పరుగులు నిర్దేశించగా.. అఫ్గాన్‌ కేవలం ఒక్క పరుగుకే రెండు వికెట్లను కోల్పోయి ఓటమిపాలైంది.


నిబంధనలు ఏం చెబుతున్నాయి..?
ఐసీసీ నిబంధనల ప్రకారం.. పురుషుల టీ20లలో ‘ఒక బ్యాటర్‌ సూపర్‌ ఓవర్‌లో అవుట్‌  అయితే అతడు తర్వాతి సూపర్‌ ఓవర్‌లో బ్యాటింగ్‌కు రావడానికి ఆస్కారం లేదు. నిన్నటి మ్యాచ్‌లో రోహిత్‌ను అఫ్గాన్‌ ఔట్‌ చేయలేదు. టీమిండియా హెడ్‌కోచ్‌ ద్రావిడ్‌తో పాటు ఇతర క్రికెట్‌ పండితులు రోహిత్‌ నిర్ణయాన్ని ‘రిటైర్డ్‌ ఔట్‌’గానే పిలుస్తున్నారు. ఐసీసీ నిబంధనల ప్రకారం పురుషుల టీ20లలో ‘ఒక బ్యాటర్‌ గాయం లేదా అస్వస్థత కారణంగా క్రీజును వదిలితే అతడు తిరిగి మరో సూపర్‌ ఓవర్‌లోనూ బ్యాటింగ్‌కు రావొచ్చు.. ఇదే నిబంధనలో రిటైర్డ్‌ అవుట్‌ అయిన బ్యాటర్‌ తిరిగి రెండో సూపర్‌ ఓవర్‌లో బ్యాటింగ్‌కు రావాలంటే ప్రత్యర్థి జట్టు సారథి సమ్మతితో మళ్లీ బ్యాటింగ్‌ చేయొచ్చు అని కూడా ఉంది. దీని ప్రకారం.. నిన్న రోహిత్‌ శర్మ రెండో సూపర్‌ ఓవర్‌లో బ్యాటింగ్‌కు వచ్చింది అఫ్గాన్‌ సారథి ఇబ్రహీం జద్రాన్‌ సమ్మతితోనే బ్యాటింగ్‌కు వచ్చాడు.