India vs Pakistan, ICC Under 19 World Cup 2024:  అండర్‌ 19 ప్రపంచకప్‌లో నేడు రెండో సెమీస్‌ జరగనుంది. రెండో సెమీస్‌లో ఆస్ట్రేలియా-పాకిస్థాన్‌ తలపడనున్నాయి. ఇప్పటికే భారత్‌ తుది పోరుకు దూసుకెళ్లగా.. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టు ఫైనల్లో యువ భారత్‌తో తలపడనుంది. ఫైనల్‌కు చేరే రెండో జట్టేదో నేడు తేలిపోనుంది. అయితే పటిష్టమైన ఆస్ట్రేలియాపై పాకిస్థాన్‌ విజయం సాధిస్తే అండర్‌ 19 ప్రపంచకప్‌ ఫైనల్లో దాయాదుల పోరు చూసే అవకాశం.. క్రికెట్‌ అభిమానులకు లభిస్తుంది. వరుసగా ఐదుసార్లు అండర్ 19 వరల్డ్‌ కప్‌ ఫైనల్‌కు టీమ్‌ఇండియా చేరుకుంది. ఇప్పటివరకు మొత్తం 15 ఎడిషన్లు ఈ మెగా టోర్నీ జరగగా.. భారత్ 9 సార్లు టైటిల్‌ పోరుకు దూసుకెళ్లి ఐదుసార్లు విజేతగా నిలిచింది. భారత్-పాక్‌ జట్లు కేవలం ఒక్కసారి మాత్రమే ఫైనల్‌లో తలపడ్డాయి. 2006 ఎడిషన్‌లో పాకిస్థాన్‌ విజయం సాధించి టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. ఒకవేళ ఇప్పుడు దాయాది దేశం ఫైనల్‌కు వస్తే మాత్రం బదులు తీర్చుకోవాలని భారత్‌ అభిమానులు కోరుకుంటున్నారు. 


తొమ్మిదోసారి ఫైనల్‌కు....
అండర్ 19 ప్రపంచకప్ లో వరుసగా ఐదోసారి ఫైనల్ చేరిన భారత జట్టు రికార్డు సృష్టించింది. మొత్తం మీద తొమ్మిదో సారి అండర్ 19 ప్రపంచకప్ తుదిపోరుకు అర్హత సాధించి కొత్త చరిత్ర లిఖించింది. 2016, 2018, 2020, 2022, 2024, అండర్-19 ప్రపంచ కప్ టోర్నీల్లో వరుసగా టీమిండియా ఫైనల్‌ చేరింది. 2016, 2020, టోర్నీలో రన్నర్ అప్ గా నిలిచిన భారత్.... 2018 2022 టోర్నీల్లో విజేతగా నిలిచి సత్తా చాటింది. ఇప్పటివరకు మొత్తం ఐదుసార్లు అండర్ 19 ప్రపంచకప్ గెలుచుకున్న టీమిండియా... ఆరో కప్పుపై కన్నేసింది.


ఫైనల్‌ చేరిందిలా....
అండర్‌-19 ప్రపంచకప్‌( U19 World Cup 2024)లో యువ భారత్ ఫైనల్ లోకి దూసుకు వెళ్ళింది. తొలుత దక్షిణాఫ్రికాను తక్కువ పరుగులకే కట్టడి చేసిన టీం ఇండియా మరో 7 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన దక్షిణాఫ్రికా (South Africa U19 Team) నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 244 పరుగులు చేయగా టీం ఇండియా 8 వికెట్లు కోల్పోయి 7 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. భారత్ కెప్టెన్ (Team India Captain) ఉదయ్ సహారన్ , సచిన్ దాస్ కీలక ఇన్నింగ్స్ ఆడి భారత్ కు చీర స్మరణీయ విజయాన్ని అందించారు. అండర్‌ 19 ప్రపంచకప్‌ ఫైనల్‌ చేరడం ద్వారా టీమిండియా కొత్త చరిత్ర సృష్టించింది. 245 పరుగుల లక్ష్యం తో బరిలోకి దిగిన భారత్ కు ఇన్నింగ్స్ మొదటిలోనే దిమ్మ దిరిగే షాక్ తగిలింది. ఆదర్శ్ సింగ్ ఎదుర్కొన్న తొలి బంతికే అవుట్ అయ్యాడు. మంచి ఫాం లో ఉన్న ముషీర్ ఖాన్ కూడా 4 పరుగులకే వెనుతిరగడంతోటీం ఇండియా 8 పరుగులకే 2 వికెట్లు  కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తరువాత కూడా వికెట్ల పతనం కొనసాగింది. భారత జట్టు 32 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో సచిన్ దాస్, ఉదయ్ సహారల్ కీలక ఇన్నింగ్స్ ఆడారు. సచిన్ దాస్ 95 బంతుల్లో 96 పరుగులు, ఉదయ్ సహారల్ 124 బంతుల్లో 81 పరుగులు చేసి భారత్ ను విజయ తీరాలకు చేర్చారు. సారధి ఉదయ్ సహరాన్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ దక్కింది.