U19 Cricket World Cup 2024 Semi Final: అండర్‌-19 ప్రపంచకప్‌‌లో కీలకమైన సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాను భారత బౌలర్లు తక్కువ పరుగులకే కట్టడి చేశారు. బెనోని లోని విల్లోమోర్‌ పార్క్‌ వేదికగా జరగుతున్న మ్యాచ్‌లో టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 244 పరుగులు చేసింది. సౌతాఫ్రికా జట్టులో ప్రిటోరియస్‌ 76, రిచర్డ్‌ సెలెట్స్వేన్‌ 64 పరుగులతో  రాణించారు. భారత బౌలర్లలో లింబాని  మూడు వికెట్లు తీశాడు. ఆల్‌రౌండర్‌ ముషీర్‌ ఖాన్‌ 2, స్పిన్నర్‌ సౌమి పాండే ఒక వికెట్‌ తీశారు.

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సఫారీ బ్యాటర్లకు ఆరంభంలోనే షాక్‌ తగిలింది. 14 పరుగులు చేసిన ఓపెనర్‌ స్టీవ్‌ స్టాక్‌.. ఐదో ఓవర్లోనే అవుటయ్యాడు. డేవిడ్‌ టీగర్‌ పరుగులేమీ చేయకుండానే పెవిలియన్‌ చేరాడు. 46 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన దక్షిణాఫ్రికాను ప్రిటోరియస్‌... రిచర్డ్‌ సెలెట్స్వేన్‌ ఆదుకున్నారు. ఆచితూచి ఆడిన వీరిద్దరూ మంచి భాగస్వామ్యంతో ప్రోటీస్‌ను మళ్లీ పోరులోకి తెచ్చారు. ఈ జోడీ మూడో వికెట్‌కు 72 పరుగులు జోడించారు. ఈ జోడీని ముషీర్‌ ఖాన్‌ విడదీశాడు. అర్థ సెంచరీ చేసుకున్నాక రిచర్డ్‌.. నమన్‌ తివారి బౌలింగ్‌లో ప్రియాన్షుకు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. ఆఖర్లో కెప్టెన్‌ జువాన్‌ జేమ్స్‌ 24, ట్రిస్టన్‌ లుస్‌ 23 నాటౌట్‌ దూకుడుగా ఆడటంతో సఫారీ స్కోరుబోర్డు 244లకు చేరింది. 50 ఓవర్లలో భారత్‌.. 245 పరుగులు చేయగలిగితే ఈ టోర్నీలో ఫైనల్‌ చేరే తొలి జట్టుగా భారత జట్టు నిలుస్తుంది.





ఇతడితో జాగ్రత్త

దక్షిణాఫ్రికా బౌలర్‌ సరికొత్త చరిత్ర లిఖించాడు. అండర్‌ 19 ప్రపంచకప్‌ చరిత్రలో ఇప్పటివరకూ ఏ క్రికెటర్‌కు సాధ్యం కాని రికార్డును సౌతాఫ్రికా పేస్‌ బౌలర్ క్వేనా మపాకా(Kwena Maphaka) నెలకొల్పాడు. శ్రీలంకతో జరిగిన జరిగిన మ్యాచ్‌లో మసాకా ఆరు వికెట్లు నేలకూల్చి ఈ ఘనత సాధించాడు. ఈ ప్రపంచకప్‌లో మసాకాకు ఇది మూడోసారి అయిదు వికెట్ల ప్రదర్శన. అండర్‌-19 ప్రపంచకప్‌ చరిత్రలో ఇప్పటివరకు ఏ బౌలర్‌ సింగిల్‌ ఎడిషన్‌లో మూడుసార్లు ఐదు వికెట్ల ప్రదర్శనలు చేయలేదు.

జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో 34 పరుగులు ఇచ్చి అయిదు వికెట్లు తీసిన మసాకా... వెస్టిండీస్‌పై 38 పరుగులు ఇచ్చి అయిదు వికెట్లు తీశాడు. ఈ టోర్నీలో ఇప్పటివరకు ఐదు మ్యాచ్‌లు ఆడిన మపాకా 18 వికెట్లు తీసి లీడింగ్‌ వికెట్‌ టేకర్‌గా కొనసాగుతున్నాడు. 17 ఏళ్ల లెఫ్ట్‌ ఆర్మ్‌ ఫాస్ట్‌ బౌలర్‌ అయిన మపాకా బుల్లెట్‌ వేగంతో నిప్పులు చెరిగే బంతులు సంధిస్తూ ప్రత్యర్ధి బ్యాటర్లను నిశ్రేష్ఠులను చేస్తున్నాడు. ఇటీవలే జస్ప్రీత్‌ బుమ్రా కంటే వేగంగా యార్కర్లు సంధిస్తానని మసాకా సవాల్‌ కూడా చేశాడు.