U-19 Women’s T20 WC:  2023 అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో భారత మహిళల జట్టు విజయం సాధించి చరిత్ర సృష్టించింది. తొలిసారి భారత మహిళల జట్టు ఐసీసీ ట్రోఫీని గెలిచింది. ఈ చరిత్రాత్మక విజయం తర్వాత భారత కెప్టెన్ షెఫాలీ వర్మ తన తర్వాతి ప్రణాళికను వివరించింది.


అండర్- 19 టీ20 ప్రపంచకప్ లో భారత మహిళల జట్టుకు షెఫాలీ వర్మ కెప్టెన్ గా వ్యవహరించింది. ఫైనల్ మ్యాచ్ లో ఇంగ్లండ్ పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించి కప్ ను అందుకుంది. ఈ టోర్నీ మొత్తం షెఫాలీ ప్లేయర్ గా, కెప్టెన్ గా ఆకట్టుకుంది. జట్టును విజయపథంలో నడిపించింది. మ్యాచ్ గెలిచాక షెఫాలీ ఈ ప్రపంచకప్ విజయం గురించి, తన తర్వాతి ప్రణాళికల గురించి వివరించింది. 'ఇది ఆరంభం మాత్రమే. రెండు వారాల తర్వాత జరగనున్న సీనియర్ మహిళల టీ20 ప్రపంచకప్ లోనూ ఇదే ప్రదర్శనను పునరావృతం చేయాలనుకుంటున్నాను' అని భారత కెప్టెన్ తెలిపింది.






ఇప్పుడు అదే మా లక్ష్యం


19 ఏళ్ల షెఫాలీ వర్మ భారత సీనియర్ మహిళల జట్టులోనూ ఉంది. ఫిబ్రవరి 10వ తేదీ నుంచి దక్షిణాఫ్రికా వేదికగా టీ20 మహిళల ప్రపంచకప్ జరగనుంది. ఈ టైటిల్ ను కూడా గెలవడం ద్వారా దక్షిణాఫ్రికా పర్యటనను చిరస్మరణీయం చేయాలని షెఫాలీ కోరుకుంటోంది. 'మేం ఇక్కడకు వచ్చినప్పుడు అండర్- 19 ప్రపంచకప్ మీదే దృష్టి పెట్టాం. దాన్ని గెలుచుకున్నాం. ఇప్పుడు మా దృష్టంతా సీనియర్ టీ20 ప్రపంచకప్ పై ఉంది. ఈ విజయాన్ని మరచిపోయి టీ20 ప్రపంచకప్ ను గెలుచుకోవాలనుకుంటున్నాను' అని షెఫాలీ వర్మ స్పష్టంచేసింది. 


ఈ విజయంతో సంతృప్తి పడం


2020 టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిన భారత జట్టులో షెఫాలీ కూడా భాగం. ఆ ఓటమి బాధ తనలో ఇంకా అలానే ఉందని.. మెల్‌బోర్న్‌లో జరిగిన ఫైనల్ చాలా ఎమోషనల్‌గా సాగిందని షెఫాలీ తెలిపింది. 'మేం అది గెలవలేకపోయాం. ఫైనల్ మ్యాచ్ లో ఓడిపోయాక మేం చాలా బాధపడ్డాం. అయితే ఇప్పుడు మాత్రం సంతోషంతో కన్నీళ్లు వస్తున్నాయి. నేను వాటిని ఆపడానికి చాలా ప్రయత్నించాను. అయితే నావల్ల కాలేదు. భారత్ తరఫున పరుగులు సాధిస్తూనే ఉండాలని అనుకుంటున్నాను. ఈ ప్రపంచకప్ విజయంతో సంతృప్తి పడాలనుకోవడంలేదు. ఇది ప్రారంభం మాత్రమే' అని షెఫాలీ తెలిపింది.