Pant Health Update:  భారత క్రికెట్, రిషభ్ పంత్ అభిమానులకు శుభవార్త. రోడ్డుప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న టీమిండియా యువ వికెట్ కీపర్- బ్యాటర్ రిషభ్ పంత్ ఈ వారంలో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ కానున్నాడు. డిసెంబర్ 30న జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాల పాలైన పంత్.. దాదాపు నెలరోజుల తర్వాత ఇంటికి వెళ్లనున్నాడు. 


ఇంటికి వెళ్తుండగా ప్రమాదం


డిసెంబర్ 30న పంత్  కారులో ఉత్తరాఖండ్ లోని తన ఇంటికి వెళ్తుండగా రూర్కెలా సమీపంలో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో అతని కారు పూర్తిగా కాలిపోయింది. అయితే అదృష్టవశాత్తూ కారులో నుంచి దూకిన పంత్ ప్రాణాలు కాపాడుకున్నాడు. అప్పటినుంచి అతను ఆసుపత్రిలో ఉన్నాడు. ముంబయిలోని కోకిలాబెన్ హాస్పిటల్ వైద్యులు పంత్ మోకాలి స్నాయువుకి ఒక శస్త్రచికిత్సను చేశారు. ప్రస్తుతం అతను వేగంగా కోలుకుంటున్నాడని.. ఈ వారంలో డిశ్చార్జ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని వైద్యులు తెలిపారు. దీనిపై బీసీసీఐ కూడా స్పందించింది. రిషభ్ పంత్ వేగంగా కోలుకుంటున్నాడు. వైద్య బృందం శుభవార్త తెలిపింది. పంత్ మొదటి సర్జరీ విజయవంతమైంది. ఈ వారంలో డిశ్చార్జ్ అవుతాడు అని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. 


అయితే పంత్ వచ్చే నెలలో మరలా హాస్పిటల్ కు వెళ్లాల్సి ఉంది. అతనికి మరో సర్జరీ అవసరమని వైద్యులు తెలిపారు. రిషభ్ పంత్ కు మరో నెలలో ఇంకో సర్జరీ అవసరం ఉంది. అయితే అది ఎప్పుడు చేస్తారనేది డాక్టర్లు నిర్ణయిస్తారు. బీసీసీఐ వైద్య బృందం డాక్టర్ పార్దివాలా ఇంకా కోకిలాబెన్ ఆసుపత్రి వైద్యులతో నిరంతరం టచ్ లో ఉంది. త్వరలోనే పంత్ మైదానంలోకి రావాలని మేం ఆశిస్తున్నాం. అని బీసీసీఐ అధికారి తెలిపారు. 


పంత్ చికిత్స ఇలా..


డిసెంబర్ 30 న పంత్ కు యాక్సిడెంట్ అయ్యింది. అతని నుదుటిపై, వీపుపై, మణికట్టుకు, మోకాలికి గాయాలయ్యాయి. ప్రథమ చికిత్స తర్వాత పంత్ డెహ్రాడూన్ లోని మాక్స్ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ముంబై లోని కోకిలా బెన్ హాస్పిటల్ కు విమానం ద్వారా తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్ దిన్షా పార్దివాలాతో కలిసి బీసీసీఐ వైద్య బృందం పంత్ మోకాలికి శస్త్రచికిత్స నిర్వహించింది. 


పంత్ ను మిస్ అవుతాం


గతేడాది డిసెంబర్ 30న భారత స్టార్ బ్యాటర్ రిషభ్ పంత్ ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. అయితే అదృష్టవశాత్తూ ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్న పంత్ కోలుకుంటున్నాడు. ఈ యాక్సిడెంట్ కారణంగా పంత్ దాదాపు ఈ ఏడాది క్రికెట్ కు దూరం కానున్నాడు. ఫిబ్రవరిలో ఆస్ట్రేలియాతో జరిగే బోర్డర్- గావస్కర్ ట్రోఫీలోనూ రిషభ్ పంత్ ఆడడంలేడు. దీనిపై ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ మార్కస్ స్టయినిస్ స్పందించాడు. ఈ సిరీస్ లో రిషభ్ పంత్ ను మిస్ అవుతామని అతను అన్నాడు.