Richest Cricketers: భారత్‌లో ఓ మతంలా కొలిచే క్రికెట్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పన్లేదు. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలన్న తరహాలో ఈ క్రేజ్‌ను క్రికెటర్లు  రెండు చేతులా అందిపుచ్చుకుని  కోట్లాది రూపాయలను సంపాదిస్తున్నారు.  బీసీసీఐ ఇచ్చే వార్షిక కాంట్రాక్టులు, ఐపీఎల్, యాడ్స్, బ్రాండ్స్ ఎండార్స్‌మెంట్స్, బిజినెస్.. తదితర మార్గాల ద్వారా  ఆదాయాన్ని పెంచుకుంటున్నారు. కొన్నిరోజులుగా భారత క్రికెట్‌లో అత్యంత ధనవంతుల జాబితాలో  సచిన్ టెండూల్కర్, మహేంద్ర సింగ్ ధోని,  విరాట్ కోహ్లీల పేర్లు విరివిగా వినబడుతోంది. వీళ్ల ఆస్తుల విలువ వెయ్యి కోట్లు దాటిందని  పలు రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. కానీ ఆర్యమన్, సమర్‌జిత్ సిన్హా అనే ఇద్దరు మాజీ క్రికెటర్ల ఆస్తులు చూస్తే కళ్లు తిరిగాల్సిందే. వీళ్ల ఆస్తుల ముందు కోహ్లీ, ధోని, సచిన్‌ల ఆస్తులు జుజూబీనే..  ఈ ఇద్దరి ఆస్తుల విలువ ఏకంగా రూ. 90 వేల కోట్ల పైమాటే...!


ఎవరీ ఆర్యమన్..? 


ఆర్యమన్  విక్రమ్ బిర్లా..  పేరు చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది ఇతడు బిర్లా వంశస్తుడని.. అవును, తరతరాలుగా భారత పారిశ్రామిక ప్రగతిలో కీలక పాత్ర పోషిస్తున్న బిర్లాల వారసుడే అతడు. కుమార్ మంగళం బిర్లా కుమారుడు. ఒక నివేదిక ప్రకారం.. ఆదిత్య బిర్లా గ్రూపు ఆస్తుల విలువ రూ. 4.95 లక్షల కోట్లు అని అంచనా.  రిటైల్,  మూలధనం,  ఫ్యాషన్‌తో పాటు మరెన్నో రంగాల్లో వారికి వ్యాపారాలున్నాయి.  సుమారు ఒక లక్షా 40 వేల మంది ఉద్యోగులు ఆ సంస్థలో పనిచేస్తున్నారు.  


 






ఆర్యమన్ బిర్లా  2017లో దేశవాళీలో  మధ్యప్రదేశ్ తరఫున  అరంగేట్రం చేశాడు. మధ్యప్రదేశ్ తరఫున 9 మ్యాచ్‌లు ఆడిన  అతడు.. 414 పరుగులు కూడా చేశాడు.  ఇందులో ఓ సెంచరీ, మరో హాఫ్ సెంచరీ కూడా ఉన్నాయి.  లక్షల కోట్లకు అధిపతి అయిన ఆర్యమన్‌ను ఐపీఎల్ - 2018 వేలంలో రాజస్తాన్ రాయల్స్  రూ. 30 లక్షలు వెచ్చించి  దక్కించుకుంది.  కానీ ఒక్క మ్యాచ్ కూడా ఆడించలేదు. రెండేండ్ల తర్వాత  ఆర్యమన్.. మెంటల్ హెల్త్ కారణంతో  క్రికెట్ నుంచి బ్రేక్ తీసుకుంటున్నట్టు ప్రకటించాడు. ఈ ఏడాది  ఫిబ్రవరిలో ఆదిత్యా బిర్లా వారి గ్రాసిమ్ ఇండస్ట్రీస్‌లో గ్రూప్ ఆఫ్ డైరెక్టర్స్‌గా చేరాడు. ఆర్యమన్ పేరిట ఉన్న ఆస్తుల విలువ సుమారు  రూ. 70వేల కోట్లు.


రాజవంశీయుడు సమర్‌జిత్..


సమర్‌జిత్ రంజిత్ సిన్హ్ గైక్వాడ్.. గుజరాత్ లోని బరోడాకు చెందిన రాజవంశానికి చెందిన వ్యక్తి. 1967లో జన్మించిన సమర్‌జిత్.. వడోదర మహారాజు  రంజిత్ సిన్హ్, శుభన్‌గిని రాజేల ఏకైక కుమారుడు. సమర్‌జిత్.. డెహ్రాడూన్ లోని ప్రముఖ డూన్ స్కూల్‌లో చదువుకున్నారు. చదువుకునే రోజుల్లో స్కూల్ క్రికెట్, ఫుట్‌బాల్, టెన్నిస్ టీమ్స్‌కు ఆయన  సారథిగా వ్యవహరించడం విశేషం.  బరోడా తరఫున రంజీ క్రికెట్  (1987 నుంచి 1989 వరకూ ఆరు రంజీ మ్యాచ్‌లు ఆడారు) ఆడిన ఆయన.. 2012లో  తండ్రి మరణించిన తర్వాత ఆటను వదిలేశారు. ఆ ఏడాది ఆయనకు మహారాజుగా పట్టాభిషేకం జరిగింది. సమర్‌జిత్ ఆస్తుల విలువ  రూ. 20 వేల కోట్ల పైమాటే. 


 






ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేట్ నివాసమైన  లక్ష్మీ విలాస్ ప్యాలెస్, బరోడాలో మోతి బాగ్ స్టేడియం, మహారాజా ఫతే సింగ్ మ్యూజియం (ఇందులో  ప్రముఖ చిత్రకారుడు రాజా రవివర్మ  గీసిన చిత్రాలున్నాయి) ఆయన పేరిటే ఉన్నాయి.  గుజరాత్, బనారస్ లలో 17 దేవాలయాలు, ట్రస్ట్ లు కూడా ఆయన సొంతం. లక్ష్మీ విలాస్  ప్యాలెస్  కు సమీపంలోనే 600 ఎకరాలకు పైగా రియల్ ఎస్టేట్ భూములు సమర్‌జిత్ పేరిటే ఉన్నాయి.  2002లో  వంకనేర్ రాజ కుటుంబానికి చెందిన  రాధికారాజేని ఆయన పెళ్లాడారు. వీరికి ఇద్దరు కూతుళ్లు.
























Join Us on Telegram: https://t.me/abpdesamofficial