Jay Shah about new coach : టీ 20 ప్రపంచకప్‌లో భారత్‌ను విశ్వ విజేతగా నిలపడంతో టీమిండియా హెచ్‌ కోచ్‌గా మిస్టర్‌ డిపెండబుల్‌ రాహుల్‌ ద్రావిడ్‌(Rahul Dravid) పదవీ కాలం ముగిసింది. ఇక తదుపరి భారత జట్టు ప్రధాన కోచ్‌గా ఎవరుంటారన్న దానిపై జోరుగా ఊహాగానాలు చెలరేగుతున్నాయి. టీమిండియా(India) తదుపరి హెడ్‌ కోచ్‌గా గౌతం గంభీర్‌(Gautim Gambhir) పేరు దాదాపు ఖరారైందన్న వార్తలు కూడా వస్తున్నాయి. రాహుల్‌ ద్రావిడ్ పదవీ కాలం ముగియడం... ఈ నెలాఖరులోనే శ్రీలంకతో సిరీస్‌కు టీమిండియా వెళ్లాల్సి ఉండడంతో బీసీసీఐ కొత్త కోచ్‌ ఎంపికపై కసరత్తు ను వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలో భారత జట్టు హెడ్‌ కోచ్‌ పదవిపై బీసీసీఐ కార్యదర్శి జై షా(BCCI  Secretary Jay Shah) కీలక వ్యాఖ్యలు చేశారు. 

 

జై షా ఏమన్నారంటే..?

శ్రీలంకలో ఈ నెలాఖరులో ప్రారంభమయ్యే పరిమిత ఓవర్ల సిరీస్‌ నాటికి భారత క్రికెట్ జట్టుకు కొత్త ప్రధాన కోచ్ వచ్చేస్తాడని బీసీసీఐ సెక్రటరీ జయ్ షా వెల్లడించారు. రాహుల్ ద్రవిడ్ తర్వాత ప్రధాన కోచ్‌గా ఎవరు ఎంపిక అయ్యారనే విషయాన్ని మాత్రం జై షా వెల్లడించలేదు. ద్రవిడ్ తర్వాత భారత ప్రధాన కోచ్‌గా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ బాధ్యతలు చేపట్టనున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడిస్తున్నాయి. టీమిండియా ప్రధాన కోచ్‌ పదవికి గౌతం గంభీర్,  WV రామన్‌లను క్రికెట్ అడ్వైజరీ కమిటీ ఇప్పటికే ఇంటర్వ్యూ చేసింది. కోచ్‌ పదవీతో పాటు సెలెక్టర్ నియామకం కూడా త్వరలో జరుగుతుందని జై షా వెల్లడించారు. టీమిండియాకు హెడ్‌ కోచ్, సెలెక్టర్ నియామకం త్వరలో జరుగుతుందని... క్రికెట్‌ అడ్వైజరీ కమిటీ ఇప్పటికే ఇంటర్వ్యూ పూర్తి చేసి ఇద్దరి పేర్లను షార్ట్‌లిస్ట్ చేసిందని.. తాము ముంబైకి చేరుకున్న తర్వాత దానిపై ఓ నిర్ణయం తీసుకుంటామని... టీ 20 ప్రపంచ కప్‌ గెలిచిన తర్వాత వెస్టిండీస్‌లో జై షా తెలిపాడు. జూలై 6 నుంచి ప్రారంభమయ్యే జింబాబ్వే పర్యటనను టీమిండియా చకోచ్‌గా VVS లక్ష్మణ్ వెళ్తారని...  జూలై 27 నుంచి మూడు టీ20లు, వన్డే సిరీస్‌ కోసం శ్రీలంకలో పర్యటించాల్సి ఉందని అప్పటికల్లా కొత్త కోచ్ భారత జట్టులో జాయిన్ అవుతాడని షా తెలిపాడు.

 

దిగ్గజాలపై ప్రశంసలు

టీ 20 ప్రపంచకప్‌ అందించిన సీనియర్‌ ఆటగాళ్లను జైషా పొగడ్తలతో ముంచేశాడు. మ్యాచ్‌ విన్నింగ్ నాక్ ఆడిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలపై ప్రశంసల జల్లు కురిపించాడు. 2023లో ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్లో తాము ప్రపంచకప్‌ గెలవలేకపోయామని... కానీ ఈసారి విశ్వ విజేతలుగా నిలిచామని జై షా తెలిపాడు. మంచి ఆటగాడికి ఎప్పుడు ఆటకు వీడ్కోలు చెప్పాలో తెలుసని... రోహిత్‌ శర్మ, కోహ్లీ, రవీంద్ర జడేడా అదే చేశారని జైషా తెలిపాడు. రోహిత్, కోహ్లి, జడేజాల రిటైర్మెంట్‌తో ముగ్గురు దిగ్గజాలు ఒకేసారి ఆటకు వీడ్కోలు పలికారని జై షా వెల్లడించాడు. 

 

సీనియర్లు ఉంటారు

 ఇక తమ లక్ష్యం ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్, ఛాంపియన్స్ ట్రోఫీని గెలవడమే అని జై షా తెలిపాడు. ఈ రెండు జట్లలో సీనియర్లు ఉంటారని జై షా స్పష్టం చేశాడు. రోహిత్‌, విరాట్ శకం ముగిసిందన్న వార్తల నేపథ్యంలో జై షా వ్యాఖ్యలు ప్రాధన్యం సంతరించుకున్నాయి. ప్రపంచ కప్‌లో హార్దిక్ పాండ్యా ఆల్‌రౌండ్ ప్రదర్శన, రోహిత్ కెప్టెన్సీ ఆకట్టుకున్నాయన్నాడు. రోహిత్‌ స్థానంలో హార్దిక్‌ పాండ్యాను కెప్టెన్‌గా చేస్తారా అన్న ప్రశ్నకు అది సెలెక్టర్ల పనని... సెలెక్టర్లతో చర్చించిన తర్వాత దానిపై ప్రకటన చేస్తామని జై షా తెలిపాడు.