వచ్చే సీజన్‌లో రంజీ ట్రోఫీ( Ranji Trophy)లో ఆడే హైదరాబాద్‌ జట్టు(Team Hyderabad )ను టీమిండియా ఆటగాడు తిలక్‌ వర్మ(N Thakur Tilak Varma) నడిపించనున్నాడు. నాగాలాండ్‌, మేఘాలయ( Nagaland and Meghalaya) వేదికలుగా జరిగే తొలి రెండు రంజీ మ్యాచుల్లో తలపడే 15 మంది సభ్యుల హైదరాబాద్‌ జట్టును ఎంపికచేశారు. ఈ జట్టుకు కెప్టెన్‌(Captain)గా తిలక్‌వర్మను నియమించారు. రాహుల్‌సింగ్‌ వైస్‌(Vice-Captain)గా వ్యవహరిస్తాడు. తన్మయ్‌ అగర్వాల్‌, సీవీ మిలింద్‌, రోహిత్‌ రాయుడు, రవితేజ, త్యాగరాజన్‌, చందన్‌ సహానీ, కార్తికేయ, నితీష్‌, సాయి ప్రజ్ఞయ్‌ రెడ్డి(WK), సాకేత్‌ సాయిరామ్‌, అభిరత్‌ రెడ్డి, సాగర్‌ చౌరాసియా(WK), సంకేత్‌ జట్టులోని మిగతా సభ్యులు. వీరితోపాటు ఆరుగురు స్టాండ్‌బైలను ఎంపికచేశారు. 

 

హైదరాబాద్‌ జట్టు: తిలక్‌వర్మ (కెప్టెన్‌), రాహుల్‌ సింగ్‌ (వైస్‌ కెప్టెన్‌), తన్మయ్‌ అగర్వాల్‌, సీవీ మిలింద్‌, రోహిత్‌ రాయుడు, రవితేజ, తనయ్‌ త్యాగరాజన్‌, చందన్‌ సహాని, కార్తికేయ, నితీష్‌ కన్నాల, ప్రజ్ఞయ్‌రెడ్డి, సాకేత్‌ సాయిరామ్‌, అభిరథ్‌రెడ్డి, సాగర్‌ చౌరాసియా, సంకేత్‌

 

కుదురుకుంటున్న తిలక్‌ వర్మ

దక్షిణాఫ్రికా(South Africa) గడ్డపై జరిగిన వన్డే సిరీస్‌లో తిలక్ వర్మ పర్వాలేదనిపించాడు. కీలకమైన మూడో వన్డేలో  77 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్స్‌తో 52 పరుగులు చేసి అవుటయ్యాడు. తిలక్‌ వర్మను మహరాజ్‌ అవుట్‌ చేశాడు. మూడో వన్డేలో విజయంతో సఫారీ గడ్డపై టీమిండియా చరిత్ర సృష్టించింది. 2018 తర్వాత దక్షిణాఫ్రికా గడ్డపై వన్డే సిరీస్‌ గెలిచి రికార్డు సృష్టించింది. నిర్ణయాత్మకమైన మూడో వన్డేలో ఘన విజయంతో భారత జట్టు సిరీస్‌ను కైవసం చేసుకుంది. సిరీస్‌ దక్కాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో సంజు శాంసన్‌... సూపర్‌ సెంచరీతో అదరగొట్టాడు. తిలక్‌ వర్మ కూడా అర్ధ శతకంతో సత్తా చాటడంతో భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసింది. అనంతరం 297 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా.. 45.5 ఓవర్లలో 218 పరుగులకు ఆలౌట్‌ అయింది. దీంతో 78 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించి... వన్డే సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. 

 

రింకూ సింగ్‌ నుంచి టెక్నిక్స్‌ నేర్చుకుంటున్నానని తిలక్‌వర్మ(Tilak Varma) తెలిపాడు. ఆట ఆఖరి ఓవర్లలో ఎలా ఆడాలో రింకూ నుంచి నేర్చుకుంటున్నాని... జాతీయ జట్టు కోసం నిలకడైన ప్రదర్శనే చేయడమే తన లక్ష్యమని తిలక్‌ వర్మ తెలిపాడు. రింకూ దగ్గరి నుంచి నేర్చుకున్న మెళకువలు రానున్న మ్యాచ్‌ల్లో ఆచరణలో పెట్టి తీరుతానని తిలక్‌ తెలిపాడు. తనపై అసలు ఎలాంటి ఒత్తిడి లేదని.. గత మ్యాచ్‌లో లెగ్‌ స్పిన్నర్‌ను లక్ష్యంగా చేసుకొని భారీ షాట్లు ఆడాలనుకున్నాని తిలక్‌ వెల్లడించాడు. సూర్య కుమార్‌ యాదవ్‌ కెప్టెన్సీపై తనకు నమ్మకముందున్నాడు. తిలక్‌ వర్మ ఐపీఎల్లో ముంబై తరఫున కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడు. జాతీయ జట్టుకు ఎంపికైన తొలి టోర్నీలోనే తిలక్‌ సత్తా చాటాడు.