T20 World cup 2024 Terror Threat :  వెస్టిండీస్‌-అమెరికా సంయుక్తంగా నిర్వహించే టీ 20 ప్రపంచ కప్‌(T20 World cup) 2024 కోసం చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అన్ని జట్లు తమ తమ టీమ్‌లను ప్రకటించాయి.  మెగా ఈవెంట్ కు మరో 25 రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ క్రమంలో తాజాగా ఈ టోర్నీకి ఉగ్రముప్పు పొంచి ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. టోర్నమెంట్ ఆతిథ్య దేశాల్లో ఒకటైన వెస్టిండీస్‌కు ఉత్తర పాకిస్తాన్‌ ప్రాంతం నుంచి బెదిరింపులు వచ్చినట్లు సమాచారం.



టీ20 ప్రపంచకప్‌ ఒక్కటే కాదు దానితో సహా పలు ఇతర క్రీడా కార్యక్రమాలపై దాడులకు పాల్పడాలని ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ఘనిస్తాన్-పాకిస్తాన్ బ్రాంచ్ (IS-Khorasan) పిలునిచ్చినట్లు సమాచారం.  ఐఎస్‌కి చెందిన మీడియా గ్రూప్ ‘నాషీర్ పాకిస్థాన్’ ద్వారా ప్రపంచకప్‌కు ముప్పు పొంచి ఉందన్న నిఘా సమాచారం అందిందని కరీబియన్ మీడియాలో వార్తలు వచ్చాయి.  ప్రో ఇస్లామిక్ స్టేట్  మీడియా వర్గాలు,  హింసను ప్రేరేపించే విధంగా ప్రచారాలు చేస్తూ తమ మద్దతుదారులంతా యుద్ధ రంగంలోకి దిగాలని పిలుపునిస్తున్నాయి. దీంతో  వెస్టిండీస్ క్రికెట్ బోర్డు  అప్రమత్తమైంది.  భద్రతా ఏర్పాట్లను మరింత కట్టుదిట్టం చేసింది. బెదిరింపులపై క్రికెట్‌ ఫ్యాన్స్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదనీ, ఈ టోర్నీ సజావుగా సాగుతుందని క్రికెట్ వెస్టిండీస్ సీఈఓ జానీ గ్రేవ్స్ వెల్లడించారు.


ఈ విషయంపై ఐసీసీ కూడా స్పందింది. తాము  ఆతిథ్య దేశాలు, అక్కడ నగరాల్లోని అధికారులతో మరింత  చేరువగా ఉంటామని,  భద్రతా ఏర్పాట్లపై నిరంతం పర్యవేక్షిస్తుంటామని, ప్రమాదానికి సంబంధించిన సూచనలు ఏవైనా  కనిపించినా వాటిని అధిగమించేలా తమ వద్ద కట్టుదిట్టమైన ప్రణాళికలు ఉన్నాయని  పేర్కొంది.


తొలి పోరు ఎప్పుడంటే..
జూన్‌ 1 నుంచి పొట్టి ప్రపంచకప్‌ ప్రారంభం కానుండగా తొలి మ్యాచ్‌లో ఆతిథ్య అమెరికాతో కెనడా తలపడబోతోంది. జూన్‌ 1న ప్రారంభంకానున్న టీ 20 ప్రపంచకప్‌ జూన్‌ 29న ముగుస్తుంది. ఈ టోర్నీలో మొత్తం 20 జట్లు నాలుగు గ్రూపుల్లో పోటీ పడతాయి. తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు నాకౌట్‌కు చేరుకుంటాయి. ఈ మెగా టోర్నీలో గ్రూప్‌ ఏ లో భారత్‌(Team India), పాకిస్థాన్‌(Pakistan) జట్లు ఉన్నాయి. అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూసే దాయాదుల సమరం న్యూయార్క్‌ వేదికగా జూన్‌ 9న జరగనుంది. టీమిండియా గ్రూప్ దశలో జూన్‌ అయిదున ఐర్లాండ్‌తో 12న అమెరికాతో 15న కెనడాతో తలపడనుంది.  


టీ 20 ప్రపంచకప్‌లో టీం ఇండియా షెడ్యూల్‌
ఇండియా vs ఐర్లాండ్‌ - జూన్‌ 5 (న్యూయార్క్)
ఇండియా vs పాకిస్థాన్‌ - జూన్‌ 9 ( న్యూయార్క్)
ఇండియా vs యూఎస్‌ఏ - జూన్‌ 12 (న్యూయార్క్)
ఇండియా vs కెనడా - జూన్‌ 15 (ఫ్లోరిడా)


ఆ మూడు మ్యాచ్‌లకు రిజర్వ్‌ డేస్ .. 
టీ 20 ప్రపంచకప్‌లో సెమీఫైనల్స్‌తో పాటు ఫైనల్‌కు రిజర్వ్‌ డేను కేటాయిస్తూ ఐసీసీ నిర్ణయం తీసుకుంది. రెండు సెమీస్‌ మ్యాచ్‌లూ జూన్‌ 27నే జరగనుండగా.. ఫైనల్‌ను జూన్‌ 29న నిర్వహిస్తారు. ఈ మూడు మ్యాచ్‌లకు రిజర్వ్‌ డేలను నిర్వహిస్తూ ఐసీసీ నిర్ణయం తీసుకుంది.


టీమిండియా టీ20 వరల్డ్ కప్ ఆటగాళ్లు: రోహిత్ శర్మ (కెప్టెన్ ), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, సంజు శాంసన్ (వికెట్ కీపర్ ), రిషబ్ పంత్ (వికెట్ కీపర్ ), శివమ్‌ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, చాహల్, జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్