Team India's T20 World Cup 2024 Victory Celebration Highlights: లక్షలాది మంది అభిమానుల జన సందోహం... ఎగురుతున్న త్రివర్ణ పతాకాలు.... అభిమానుల జయజయ ధ్వానాల మధ్య టీమిండియాకు ముంబైలో ఘన స్వాగతం లభించింది. చరిత్ర గతంలో ఎన్నడూ చూడని విధంగా విశ్వ విజేతలుగా నిలిచిన రోహిత్ సేనకు భారత అభిమానులు కనీవినీ ఎరుగని స్వాగతం పలికారు. ముంబై వీధులు కిక్కిరిసిన వేళ... ఎక్కడచూసిన అభిమానులే కనిపించిన వేళ... సముద్రమే అసూయ పడేలా జనం తరలివచ్చిన వేళ... భారత క్రికెట్ జట్టుకు ఘన స్వాగతం లభించింది. ఢిల్లీ నుంచి నేరుగా ముంబై చేరుకున్న టీమిండియా స్టార్లకు చరిత్ర గతంలో చూడని.. భవిష్యత్తులో చూడబోని స్వాగతం పలికారు అభిమానులు. తర్వాత వాంఖడే స్టేడియంలో క్రికెటర్లు, అభిమానుల సంబరాలు అంబరాన్నంటాయి. మైదానం చుట్టూ తిరిగిన ఆటగాళ్లు డాన్సులు చేస్తూ సంబరాలు చేసుకున్నారు. తొలుత రోహిత్ శర్మ, కోహ్లీ డ్యాన్స్‌లు చేయగా ఆ తర్వాత మిగిలిన క్రికెటర్లు పాదం కలిపారు. అదిరిపోయే ఆ డ్యాన్సులు అభిమానులకు మధురానుభూతులు మిగిల్చాయి.
విశ్వ విజేతలకు నిలిచిన తమకు లభించిన ఆతిథ్యంపై క్రికెటర్లు కాస్త భావోద్వేగానికి కూడా గురయ్యారు. వాంఖడేలో జగజ్జేతలుగా నిలిచిన క్రికెటర్లను సన్మానించిన బీసీసీఐ... ఆ తర్వాత నజరానాగా ప్రకటించిన రూ.125 కోట్ల చెక్కును అందించింది. బీసీసీఐ సెక్రటరీ జై షా ఈ చెక్కును అందించారు. టీమిండియా రోహిత్ శర్మ మాట్లాడుతున్నప్పుడు వాంఖడే దద్దరిల్లిపోయింది. రోహిత్ శర్మ తల్లిదండ్రులు కూడా తన కుమారుడు సాధించిన ఘనతను వాంఖడేలో ప్రత్యక్షంగా చూసి భావోద్వేగానికి గురయ్యారు.
ప్రత్యేక ఆకర్షణ పాండ్యా
ముంబై కెప్టెన్‌గా రోహిత్‌ను తొలగించి పాండ్యాకు కెప్టెన్సీ ఇవ్వడంపై విమర్శలు చేసిన ముంబైకర్లు.. అదే వాంఖడే స్టేడియంలో పాండ్యా పాండ్యా అంటూ నినాదాలు చేశారు. ఐపీఎల్ సమయంలో పాండ్యా కెప్టెన్సీని తీవ్రంగా విమర్శించిన వారే ఇప్పుడు అదే మైదానంలో పాండ్యా పాండ్యా అని నినదించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భారత ఆటగాళ్లు నిర్వహించిన విక్టరీ పరేడ్ నభూతో న భవిష్యత్‌గా సాగింది. ఆటగాళ్ల సన్మాన కార్యక్రమంలో భారత క్రికెట్ జట్టుకు బీసీసీఐ రూ.125 కోట్ల ప్రైజ్ మనీని అందజేసింది. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, రాహుల్ ద్రవిడ్, జస్ప్రీత్ బుమ్రా స్టేడియంలోని పోడియంపైకి వచ్చి తమ భావోద్వేగాలను వ్యక్తం చేశారు. సన్మానం తర్వాత భారతఆటగాళ్లు అభిమానుల వైపునకు తాము వెళ్లి సంతకం చేసిన బంతులను వారికి అందజేశారు. కొంతమంది అభిమానులు ఆటగాళ్లతో సెల్ఫీలు దిగారు. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, రాహుల్ ద్రవిడ్ భావోద్వేగాలను అదుపు చేసుకోలేకపోయారు. భావోద్వేగాలతో ఆటగాళ్లు అశేష అభిమాన జనాన్ని అలానే చూస్తూ ఉండిపోయారు. చాలామంది ఆటగాళ్లు భావోద్వేగంతో వస్తున్న కన్నీళ్లను అదుపు చేసుకుని సంబరాల్లో పాల్గొన్నారు.