Team India's INR 125 Crore Prize Money Distribution : టీ  20 ప్రపంచకప్‌(T20 World Cup) గెలిచిన టీమిండియా(Team India)కు ఇంకా సత్కారాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆటగాళ్ల ప్రదర్శనలు... స్వాగత సత్కారాలను ఇంకా అభిమానులను గుర్తు చేసుకుంటూనే ఉన్నారు. అయితే టీ 20 ప్రపంచకప్‌ గెలిచి విశ్వ విజేతలుగా నిలిచిన  టీమిండియాకు బీసీసీఐ(BCCI) రూ. 125 కోట్ల నజరానా ప్రకటించింది. వాంఖడేలో స్టేడియంలో అశేష అభిమాన గణం ముందు భారత క్రికెట్ జట్టుకు బీసీసీఐ కార్యదర్శి జై షా రూ. 125 కోట్ల చెక్కును అందించారు. అయితే ఇందులో ఏ ఆటగాడికి ఎంత డబ్బు వచ్చింది ? అందరికీ సమానంగా పంచారా లేక స్టార్‌ ఆటగాళ్లకు ఎక్కువ ఇచ్చారా? టీమిండియా హెచ్‌ కోచ్‌ ద్రావిడ్‌కు ఈ 125 కోట్ల రూపాయల్లో ఎంత దక్కింది లాంటి ప్రశ్నలు క్రికెట్‌ అభిమానులకు ఉత్పన్నమవుతున్నాయి. అసలూ ఈ నజరానాలో ఎవరికి ఎంత దక్కిందో తెలుసుకుందామా..?


ఎవరికి ఎంత దక్కిందంటే..?

అమెరికా-వెస్టిండీస్‌ నిర్వహించిన టీ 20 ప్రపంచకప్‌ కోసం మొత్తం 42 మంది సభ్యులతో టీమిండియా వెళ్లింది. ఇందులో 15 మంది భారత జట్టు ఆటగాళ్లుకాగా.. మిగిలిన వారు సహాయ సిబ్బంది. అయితే బీసీసీఐ ప్రకటించిన రూ. 125 కోట్ల నజరాన కేవలం ఆటగాళ్లకు మాత్రమే కాకుండా 42 మంది సభ్యుల బృందానికి పంచనుంది. అయితే ఈ నజరానాలో వాటా వారు పోషించే పాత్రను బట్టి మారింది.

 

భారత జట్టులోని 15 మంది సభ్యులకు ఒక్కొక్కరికి 5 కోట్ల రూపాయలు దక్కనున్నాయి. ప్రధాన కోచ్‌ రాహుల్ ద్రవిడ్‌కు కూడా రూ. 5 కోట్లు దక్కనున్నాయి. ఇక కోచింగ్ స్టాఫ్ విషయానికొస్తే బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్‌, ఫీల్డింగ్ కోచ్ దిలీప్, బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రేలకు ఒక్కొక్కరికి రూ. 2.5 కోట్లు దక్కనున్నాయి. సెలక్షన్‌ కమిటీ చీఫ్ అజిత్ అగార్కర్‌తో సహా సెలక్షన్ కమిటీ సభ్యులకు ఒక్కొక్కరికి కోటీ రూపాయలు ఇవ్వనున్నారు.

 


సహాయక సిబ్బందిలో ముగ్గురు ఫిజియోథెరపిస్ట్‌లు, ముగ్గురు త్రోడౌన్ స్పెషలిస్టులు, ఇద్దరు మసాజర్‌లు, స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్‌లకు ఒక్కొక్కరికి 2 కోట్ల రూపాయలు అందజేస్తారు. బీసీసీఐ నుంచి వచ్చిన నజరానాను ఆటగాళ్లకు, సహాయక సిబ్బందికి పంచుతున్నామని ఎవరికి ఎంత వస్తుందనే దానిపై అందరికీ ఒక స్పష్టత ఇచ్చామని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.

 

బీసీసీఐ సెలక్షన్ కమిటీ టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది సభ్యులతో పాటు నలుగురు రిజర్వ్ ఆటగాళ్లను కూడా టీ 20  ప్రపంచకప్‌నకు పంపింది. రింకూ సింగ్, శుభ్‌మన్ గిల్, అవేష్ ఖాన్, ఖలీల్ అహ్మద్ రిజర్వ్‌ ఆటగాళ్లుగా వెళ్లారు. వీరికి కూడా ఒక్కొక్కరికి కోటి రూపాయల రివార్డ్‌ను అందిస్తారు. రూ. 125 కోట్లకు సంబంధించిన నజరానా ఆటగాళ్లు, సహాయక సిబ్బంది, కోచ్‌లు, సెలెక్టర్లకు అందరికీ అని.. కేవలం ఆటగాళ్లకు మాత్రమే కాదని  బీసీసీఐ కార్యదర్శి జై షా స్పష్టం చేశారు. అయితే టీమ్ ఇండియా స్వదేశానికి వచ్చిన తర్వాత మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే కూడా రూ.11 కోట్ల నగదు బహుమతిని ప్రకటించారు.