Sourav Ganguly Birthday Today: 2002లో ఇంగ్లాం(England)డ్‌లో జరిగిన నాట్‌వెస్ట్ సిరీస్ ఫైనల్లో భారత్ గెలిచాక అప్పటి కెప్టెన్ సౌరవ్ గంగూలీ(Sourav Ganguly) ప్రతిష్టాత్మక లార్డ్ బాల్కనీలో షర్ట్ విప్పి చేసుకున్న సంబురాలను అంత తేలిగ్గా క్రికెట్ ప్రపంచం మర్చిపోతుందా...
2003లో టీమిండియా(India) ప్రపంచకప్(World Cup Final) ఫైనల్‌కు చేరినప్పుడు దేశమంతా ఏకమై చేసిన సంబరాలను సగటు భారత అభిమాని మర్చిపోతాడా...
ధోనీ నుంచి యువరాజ్ దాకా...జహీర్ ఖాన్ నుంచి హర్భజన్ దాకా దిగ్గజ ఆటగాళ్లుగా పేరున్న వీళ్లంతా దాదా సారథ్యంలోనే భారత జట్టుకు ఎంపికై తర్వాత అద్భుతాలు సృష్టించారన్న విషయాన్ని మర్చిపోగలమా ? సౌరవ్ గంగూలీ. భారత క్రికెట్ దశను దిశను మార్చిన కెప్టెన్. జూలై 8, 1972న కోల్‌కతాలో జన్మించిన సౌరవ్ గంగూలీ... ఇవాళ 52వ పడిలోకి అడుగుపెట్టాడు. టీమిండియాకు క్రికెట్‌లో దాదాగిరి ఎలా చేయాలో నేర్పి... విశ్వ విజేతలుగా నిలిపేందుకు కావాల్సిన బలమైన పునాది వేశాడు. అందుకే క్రికెట్‌లో ఏ ఇతర ఆటగాడికి లేనన్ని పేర్లు గంగూలీకి ఉన్నాయి. ప్రిన్స్ ఆఫ్ కోల్‌కతా', గాడ్ ఆఫ్ ది ఆఫ్‌సైడ్, మహారాజ్, 'బెంగాల్ టైగర్, దాదా ఇలా సౌరవ్‌ను అభిమానులు ముద్దు పేర్లతో పిలుచుకుంటారు.
సంక్షోభం నుంచి స్వర్ణ శకం దిశగా...
అవి టీమిండియా క్రికెట్ తీవ్ర సంక్షోభంలో చిక్కుకున్న రోజులు. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో భారత జట్టులో అల్లకల్లోల వాతావరణం నెలకొన్న సంక్లిష్ట రోజులవి. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో దిగ్గజ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్‌పై వేటు పడింది. ఇక తదుపరి కెప్టెన్ ఎవరన్న చర్చలు జరుగుతున్నాయి. ఈ క్లిష్ట స్థితిలో సీనియర్లు కూడా సారధ్య బాధ్యతలు తీసుకునేందుకు వెనకడుగు వేస్తున్న వేళ..ఆ పగ్గాలు అందుకున్నాడు దాదా.
ఆ ఒక్క నిర్ణయం... భారత క్రికెట్‌ను సమూలంగా మార్చేసింది. అప్పటివరకూ అవతలి జట్టు ఆటగాళ్లు స్లెడ్జింగ్ చేస్తే విని.... దూకుడుగా మీదికి దూసుకొస్తే కిందకు చూసి పక్కకు వెళ్లే ఆటగాళ్ల ధోరణిని గంగూలీ సమూలంగా మార్చేశాడు. ఇప్పటివరకూ ఆడిన డిఫెన్సీఫ్ క్రికెట్ చాలని.. జట్టు అంతటినీ అటాకింగ్ మోడ్‌లోకి తీసుకెళ్లాడు. ఆటకు ఆట.. మాటకు మాట బదులు చెప్పాల్సిందేనని ధైర్యం నూరిపోశాడు. ఆ ధైర్యమే కొండంత బలమైంది. ఆ తర్వాత
కెరిరీ ఇలా...
1989-90 దేశవాళీ సీజన్‌లో బెంగాల్ తరఫున గంగూలీ తొలి ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడాడు. ఇక ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు. 1992లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన గంగూలీ 1996లో లార్డ్స్ క్రికెట్ స్టేడియంలో ఇంగ్లండ్‌పై తొలి టెస్ట్‌లోనే సెంచరీ చేసి సత్తా చాటాడు. భారత క్రికెట్ మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణంలో చిక్కుకున్న సమయంలో.. క్రికెట్‌కు మళ్లీ స్వచ్ఛతను తీసుకురావడంలో సౌరవ్ గంగూలీ టీమిండియా కెప్టెన్‌గా కీలక పాత్ర పోషించాడు. 2002 ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను గెలిచిన గంగూలీ... 2003 ప్రపంచ కప్ ఫైనల్‌కు కూడా జట్టును చేర్చి విజయవంతమైన సారధిగా గుర్తింపు పొందాడు. వన్డే ప్రపంచకప్‌లో భారత్‌కు అత్యధిక భాగస్వామ్యం అందించిన రికార్డు గంగూలీ- ద్రావిడ్ పేరుపై ఉంది. వీరిద్దరూ 1999 ప్రపంచకప్‌లో శ్రీలంకపై సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్ రెండో వికెట్‌కు 318 పరుగులు జోడించారు.
2008లో గంగూలీ చివరి టెస్ట్ ఆడాడు. గంగూలీ 2012 వరకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఆడాడు. భారత్ తరపున 113 టెస్టులు, 311 వన్డేలు ఆడాడు, అంతర్జాతీయ క్రికెట్‌లో 18,575 పరుగులు చేశాడు. క్రికెట్ నుంచి తప్పుకున్నాక దాదా.. బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పనిచేశాడు. 2020లో బీసీసీఐని రెండేండ్ల పాటు అధ్యక్షుడిగా విజయవంతంగా నడిపించాడు. దాదా హయాంలోనే ఐపీఎల్ మీడియా రైట్స్ ద్వారా బీసీసీఐ రూ. 47వేల కోట్ల ఆర్జన చేసింది.