Abhishek Sharma reveals secret behind Zimbabwe blitz:  జింబాబ్వే(Zim)తో జరిగిన రెండో టీ 20లో తెలుగు కుర్రాడు అభిషేక్ శర్మ(Abhishek Sharma) సంచలన ఇన్నింగ్స్‌తో క్రికెట్‌ ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు. కేవలం 47 బంతుల్లో సెంచరీ కొట్టిన అభిషేక్ శర్మ... భారత్‌ క్రికెట్‌ భవిష్యత్తుపై ఆశలు రేకెత్తించాడు. అభిషేక్‌ నిన్న జరిగిన మ్యాచ్‌లో కేవలం47 బంతుల్లోనే శతక గర్జన చేశాడు. ఈ సెంచరీలో  ఏడు ఫోర్లు, ఎనిమిది సిక్సర్లు ఉన్నాయి. అభిషేక్‌ ఇన్నింగ్స్‌కు తోడు రుతురాజ్‌(Ruturaj), రింకూ కూడా మెరుపులు మెరిపించడంతో జింబాబ్వేను భారత్ చిత్తు చేసింది. అయితే ఈ ఇన్నింగ్స్‌లో అభిషేక్‌ ఆటే హైలెట్‌గా నిలిచింది. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచిన అభిషేక్‌.. ఈ మ్యాచ్‌ తర్వాత ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు.


 





అప్పు తెచ్చిన బ్యాటంట... 

రెండో టీ 20లో తన చిన్ననాటి స్నేహితుడి బ్యాట్‌ను ఉపయోగించి... శతకం బాదినట్లు అభిషేక్‌ శర్మ తెలిపాడు. తన చిన్ననాటి స్నేహితుడు ఇప్పుడు టీమిండియా కెప్టెన్‌ అని అభిషేక్‌ వెల్లడించాడు. శుభ్‌మన్‌ గిల్‌తో కలిసి అండర్ 12 కేటగిరీ నుంచి క్రికెట్‌ ఆడుతున్నట్లు అభిషేక్‌ వెల్లడించాడు. 11, 12 ఏళ్ల పిల్లలుగా ఉన్నప్పుడు గిల్‌-తాను క్రికెట్‌లో ప్రయాణం ప్రారంభించామని... అది ఇప్పటివరకూ నిరంతరాయంగా కొనసాగిందని వివరించాడు. గిల్‌.. తాను అండర్-12 నుంచి కలిసి క్రికెట్‌ ఆడుతున్నామని.. తాను భారత క్రికెట్‌ జట్టుకు ఎంపికైనప్పుడు తొలుత ఫోన్‌ చేసి చెప్పింది గిల్‌ అని అభిషేక్‌ మ్యాచ్ అనంతరం జరిగిన ప్రెస్ మీట్‌లో చెప్పాడు. తాను గిల్‌ బ్యాట్‌తో ఆడడం చిన్నప్పటి నుంచి కొనసాగుతోందని అభిషేక్ తెలిపాడు. అండర్‌ కేటగిరీ విభాగంలో ఆడుతున్నప్పటి నుంచి తాను గిల్‌ బ్యాట్‌తో బ్యాటింగ్‌ చేస్తూ ఉండేవాడనని చెప్పాడు. ఇవాళ కూడా తాను గిల్‌ బ్యాట్‌తోనే బ్యాటింగ్‌ చేశానని... తనకు సెంచరీ అందించిన గిల్‌ బ్యాట్‌కు ప్రత్యేక ధన్యవాదాలంటూ అభిషేక్‌ జోక్‌ చేశాడు. అండర్-12 రోజుల నుంచి తాను ఒత్తిడిలో ఉన్నప్పుడు గిల్‌ బ్యాట్‌ను తీసుకుని బ్యాటింగ్‌ చేసేవాడినని... ఇప్పుడు కూడా అదే జరిగిందని అన్నాడు. ఐపీఎల్‌లోనూ ఇలా గిల్‌ బ్యాట్‌తోనే బ్యాటింగ్ చేశానని... ఈరోజు కూడా అలాగే చేశానని అభిషేక్ అన్నాడు. జింబాబ్వేతో జరిగిన రెండో టీ 20లో తనపై కాస్త ఒత్తిడి ఉన్నట్లు వివరించాడు. గిల్‌తో కలిసి ఓపెనింగ్‌ దిగిన తర్వాత తనపై కాస్త ఒత్తిడి ఉన్నట్లు అనిపించిందని అభిషేక్‌ తెలిపాడు. మొదటి మ్యాచ్‌లో విఫలమైన అభిషేక్‌... రెండో మ్యాచ్‌లో మాత్రం రఫ్పాడించాడు. 

 

 

యువీ సహకారం మర్చిపోలేను

నిర్భయంగా క్రికెట్‌ ఆడమని తనను ప్రోత్సహిస్తూ అండగా నిలిచిన దిగ్గజ ఆటగాడు యువరాజ్ సింగ్, తనను ప్రోత్సహించిన తన తండ్రికి అభిషేక్‌ దన్యవాదాలు తెలిపాడు. యువీ పాజీ తనకు గొప్ప సహకారం అందించాడని వెల్లడించాడు. సాధారణంగా కోచ్‌లు యువ బ్యాటర్‌ను లాఫ్టెడ్ షాట్‌లు కొట్టడానికి అనుమతించరని.. కానీ మా నాన్న దానికి అనుమతి ఇచ్చారని అభిషేక్ నవ్వేశాడు. దురదృష్టవశాత్తు తాము మొదటి మ్యాచ్‌లో సరిగ్గా ఆడలేదని... కానీ ఈ మ్యాచ్‌లో సత్తా చాటాలని మాత్రం అనుకున్నామని అభిషేక్‌ తెలిపాడు. నా ఆట తీరు కాస్త దూకుడుగానే ఉంటుందని.. మొదటి బంతి నుంచే తాను షాట్లకు యత్నిస్తానని తెలిపాడు. రెండో మ్యాచ్‌లో తన గేమ్‌ప్లాన్‌ను మరింత మెరుగ్గా అమలు చేశానని అభిషేక్ చెప్పాడు.