India Vs Australia Test Highlights: బోర్డర్- గవాస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. ఆస్ట్రేలియా గడ్డపై ఆస్ట్రేలియన్లను మట్టికరిపించింది. బ్యాటింగ్. బౌలింగ్ విభాగాల్లో సమష్టిగా రాణించిన భారత జట్టు... కంగారులకు ఎక్కడా పుంజుకునే అవకాశం ఇవ్వలేదు. కంగారులను చిత్తూ చేస్తూ చిరస్మరణీయ విజయం సాధించింది. మొదటి టెస్టు రెండో ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టిన భారత బౌలర్లు... కంగారులకు క్రీజులో నిలదొక్కుకునే అవకాశమే ఇవ్వలేదు. బుమ్రా, సిరాజ్, హర్షిత్ రాణాలతో కూడిన భారత పేస్ దళం ముందు కంగారులు నిలబడలేకపోయారు.
చేతులెత్తేసిన కంగారు బ్యాటర్లు
కళ్ల ముందు భారీ లక్ష్యం కనపడుతుండడంతో ఆస్ట్రేలియాపై ఒత్తిడి పెరిగింది. 534 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కంగారులకు మూడో రోజే దిమ్మతిరిగే షాక్ తగిలింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 12 పరుగులు చేసింది. అనంతరం నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన కంగారులు... 208 పరుగులకే కుప్పకూలారు. నాలుగురోజు ఆట ఆరంభమైన కాసేపటికే కంగారులకు షాక్ తగిలింది. నాలుగో రోజూ ఆట అరంభం కాగానే సిరాజ్ మియా.. ఉస్మాన్ ఖవాజను పెవిలియన్ కు పంపాడు. దీంతో ఆస్ట్రేలియా 48 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. తర్వాత ట్రావిస్ హెడ్ పోరాడాడు.
కంగారు టాప్ ఆర్డర్ బ్యాటర్లంతా చేతులెత్తేసినా హెడ్.. భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటున్నాడు. దీంతో భారత్ విజయం ఆలస్యమైంది. నాలుగురోజు లంచ్ సమయానికి ఆస్ట్రేలియా అయిదు వికెట్ల నష్టానికి 104 పరుగులు చేసింది. తర్వాత కూడా హెడ్, మార్షల్ పర్వాలేదనిపించారు. ట్రావిస్ హెడ్ 89 పరుగులతో రాణించాడు. మిచెల్ మార్ష్ 47 పరుగులతో పర్వాలేదనిపించాడు. వీరిద్దరూ క్రీజులో పాతుకుపోవడంతో ఆస్ట్రేలియా కు ఆశలు పెరిగాయి. అయితే వీరి ఆటలను భారత్ సాగనివ్వలేదు.
89 పరుగులు చేసిన హెడ్ ను కెప్టెన్ బుమ్రా పెవిలియన్ కు చేర్చగా... 47 పరుగులు చేసిన మిచెల్ మార్ష్ ను.. తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి బౌల్డ్ చేశాడు. వీరిద్దరు వెను దిరగడంతో భారత్ విజయం ఖాయమైంది. చివర్లో అలెక్స్ కేరీ 36 పరుగులతో కాసేపు ఆస్ట్రేలియా.. ఓటమిని ఆలస్యం చేశాడు. చివరికి 238 పరుగులకు కంగారులు కుప్పకూలారు. దీంతో 295 పరుగుల భారీ తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. భారత బౌలర్లలో బుమ్రా 3, సిరాజ్ 3 వికెట్లు తీసి రాణించారు.
రెండో ఇన్నింగ్స్ లో...
టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 150 పరుగులకే కుప్పకూలగా... రెండో ఇన్నింగ్స్ లో భారత బ్యాటర్లు సత్తా చాటారు. యశస్వీ జైస్వాల్ 161, విరాట్ కోహ్లీ 100, కేఎల్ రాహుల్ 77 పరుగులతో రాణించడంతో భారత్ రెండో ఇన్నింగ్స్ లో ఆరు వికెట్ల నష్టానికి 487 పరుగులకు డిక్లేర్డ్ చేసింది. తొలి ఇన్నింగ్స్ లో ఆధిక్యాన్ని కలుపుకుని కంగారుల ముందు టీమిండియా 534 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. కళ్ల ముందు భారీ లక్ష్యం ఉండడంతో ఆస్ట్రేలియా కళ్లు తేలేసింది. కేవలం 238 పరుగులకే కుప్పకూలింది. దీంతో 295 పరుగుల భారీ తేడాతో టీమిండియా విజయదుందుబి సాధించింది.
చరిత్ర సృష్టించిన యశస్వి జైస్వాల్
టీమిండియా 22 ఏళ్ల ఓపెనర్ యశస్వి జైస్వాల్ టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. భారత్ తరఫున జైస్వాల్ 15 టెస్టు మ్యాచ్‌ల ఆడి 1,568 పరుగులకు చేశారు. ప్రస్తుతం జరుగుతున్న పెర్త్ టెస్టులో 297 బంతుల్లో 161 పరుగుల చేసి రాణించారు. గతంలో ఈ రికార్డు విజయ్ హజారే (1,420 పరుగులు) పేరిట ఉంది.