ప్రపంచకప్ ముందు భారత క్రికెట్ జట్టు అరుదైన రికార్డు సాధించింది. ఆసియా కప్ గెలిచిన జోష్ లో ఉన్న టీమిండియా...ఆస్ట్రేలియాతో జరుగుతున్న సిరీస్ లోనూ ముందంజ వేసింది. మొహాలిలో జరిగిన తొలి వన్డేలో ఘన విజయం సాధించింది. వన్డేలు, టెస్టులు, టీ20 ఫార్మాట్లలో టీమిండియా, ర్యాంకింగ్స్ లో నంబర్ వన్ స్థానానికి కైవసం చేసుకుంది.  115 పాయింట్లతో మొదటి స్థానంలో ఉన్న పాకిస్థాన్‌ను వెనక్కి నెట్టి...భారత్‌ అగ్రస్థానానికి చేరుకుంది.  111 పాయింట్లతో ఆస్ట్రేలియా మూడో స్థానంలో కొనసాగుతోంది. టెస్టుల్లో రెండో స్థానంలో ఆస్ట్రేలియా, మూడో స్థానంలో ఇంగ్లాండ్‌ నిలిచాయి. 


వరల్డ్‌ కప్ ముందు వన్డే సిరీస్‌ ఆడుతున్న భారత్‌, తొలి మ్యాచ్ లో ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించింది. మొదటి వన్డే మ్యాచ్‌లో ఆసీస్‌పై టీమ్‌ఇండియా ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన కంగారూ జట్టు, 50 ఓవర్లలో 276 పరుగులకు ఆలౌటైంది. లక్ష్య ఛేదనలో భారత్ 48.4 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 281 పరుగులు చేసి విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌లో భారత్‌ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఐదు వికెట్లు పడగొట్టి...భారత్ విజయంలో కీలకపాత్ర పోషించిన మహ్మద్ షమీకి ‘ప్లేయర్‌ ఆఫ్ ది మ్యాచ్‌’ అవార్డు దక్కింది. రెండో వన్డే  ఆదివారం ఇండోర్  వేదికగా జరగనుంది. 


ఐసీసీ వన్డే బ్యాటింగ్ లో సెకండ్ ప్లేస్ లో  శుబ్ మన్ గిల్.. బౌలింగ్ లో నెంబర్ వన్ స్థానంలో  సిరాజ్ ఉన్నాడు. టీ 20 బ్యాటింగ్ లో నెంబర్ వన్ ర్యాంక్ లో సూర్యకుమార్ యాదవ్. టెస్టుల్లో  నెంబర్ వన్ బౌలర్ గా అశ్విన్...నెంబర్ వన్ ఆల్ రౌండర్ గా  రవీంద్ర జడేజా ఉన్నారు. మూడు ఫార్మాట్‍లలో ప్రస్తుతం టీమిండియా ప్రపంచ నంబర్ వన్ జట్టుగా అవతరించడంతో, టీమిండియాను అభినందించారు బీసీసీఐ కార్యదర్శి జై షా.వన్డే ప్రపంచకప్ టోర్నీకి ముందు ఇది అద్భుతమని భారత జట్టును ప్రశంసించారు.


ఇప్పటికే భారత్ టెస్టు, టీ20 ఫార్మాట్‌లో తొలి ర్యాంకులో నిలిచింది. ఆసీస్‌తో బోర్డర్‌- గావస్కర్‌ సిరీస్‌ను గెలుచుకోవడం, ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు చేరుకోవడం, విండీస్‌తో టెస్టు సిరీస్‌ నెగ్గడంతో టెస్టుల్లో అగ్రస్థానానికి చేరుకుంది.  118 పాయింట్లతో భారత్ మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. టీమ్‌ఇండియా తర్వాత టెస్టుల్లో ఆస్ట్రేలియా 118 పాయింట్లు, ఇంగ్లాండ్‌ 115 పాయింట్లతో తర్వాత స్థానాల్లో కొనసాగుతున్నాయి. టీమ్ ఇండియా  గతేడాది టీ20 సెమీ ఫైనల్‌కు చేరుకోవడం, ద్వైపాక్షిక సిరీసుల్లోనూ ఉత్తమ ప్రదర్శన చేయడంతో టీ20ల్లోనూ భారత్‌ అగ్రస్థానానికి చేరుకుంది. టీ20 ప్రపంచ కప్‌ 2021 నుంచి ఇప్పటి వరకు మొత్త 14 సిరీసుల్లో కేవలం ఒక్క సిరీస్‌ను మాత్రమే కోల్పోయింది. దీంతో భారత్ 264 పాయింట్లతో అగ్రస్థానానికి చేరుకుంది.  ఆ తర్వాతి స్థానంలో ఇంగ్లాండ్ 261 పాయింట్లు, పాకిస్థాన్ 254 పాయింట్లతో టాప్‌ -3లో నిలిచాయి. మూడు ఫార్మాట్లలో భారత్‌ అగ్రస్థానం చేరుకోవడం ఇదే తొలిసారి. భారత్‌ కంటే ముందు 2012లో దక్షిణాఫ్రికా ఈ ఘనతను సొంతం చేసుకుంది. ఇప్పుడు భారత్‌ ఆ జాబితాలో చేరింది.