రాబోయే మ్యాచుల కోసం ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాను ఎంపిక చేయకపోతే  టీమిండియా జట్టులో సమతుల్యం దెబ్బతింటుందని.. మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డారు. అతను ఇప్పుడు మంచి ఫామ్ లో ఉన్నాడని.. బ్యాటు, బంతితో రాణిస్తున్నాడని తెలిపారు.
 
యూఏఈలో జరగబోతున్న ఆసియా కప్‌లో పాండ్యాకు జట్టులో చోటు లభించింది. 2021 ప్రపంచకప్ హార్దిక్ కేవలం బ్యాటర్ గానే జట్టులో ఉన్నాడు. వెన్నెముకకు శస్త్రచికిత్స చేయించుకుని తిరిగొచ్చిన తర్వాత బౌలింగ్ చేయలేదు. దీంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. ఆ తర్వాత ఆట నుంచి విరామం తీసుకున్నాడు.
 
గుజరాత్ కు టైటిల్


2022 ఐపీఎల్ సీజన్ కు తిరిగొచ్చిన పాండ్యా కొత్త జట్టు గుజరాత్ టైటాన్స్ కు నాయకత్వం వహించాడు. 15 మ్యాచుల్లో 487 పరుగులు, 8 వికెట్లతో ఆల్ రౌండర్ గా సత్తాచాటి తన టీంకు ట్రోఫీని అందించాడు. ఆ తర్వాత భారత జట్టులోనూ కీలక ఆటగాడిగా మారాడు. 


హార్దిక్ చాలా కీలకం


ఈ నేపథ్యంలోనే ఆసియా కప్ 2022 అధికారిక బ్రాడ్ కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రవిశాస్త్రి మాట్లాడారు. టీమిండియాకు సంబంధించి పాండ్య ముఖ్యమైన ఆటగాడని.. అతన్ని ఎంపిక చేయకపోతే జట్టు సమతుల్యం దెబ్బతింటుందని అన్నారు. హార్దిక్ ను ఎంపిక చేయకపోతే మరో బ్యాట్స్ మెన్ లేదా బౌలర్ ను ఎవరిని ఆడించాలో తెలియదని చెప్పారు.
అతని స్థానాన్ని భర్తీ చేయలేం 


గత ఏడాది టీ20 ప్రపంచ కప్ లో హార్దిక్ బౌలింగ్ ను తీవ్రంగా మిస్సయ్యామని రవిశాస్త్రి అన్నారు. అతను ఆడే నంబరులో పాండ్య ముఖ్యమైన ఆటగాడని.. ఆల్ రౌండర్ గా అతనికి  దగ్గరగా మరెవరూ లేరని అభిప్రాయపడ్డారు. ఇప్పటినుంచి భారత్ ఆడే ప్రతి మ్యాచుకు అతడిని ఎంపిక చేయాలని సూచించారు. 


2021 ప్రపంచకప్ తర్వాత విశ్రాంతి తీసుకుని తిరిగొచ్చిన పాండ్యా.. అప్పటినుంచి మైదానంలో బంతితో, బ్యాటుతో సత్తా చాటుతున్నాడు. స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్ లో లోయరార్డర్ లో విలువైన పరుగులు చేశాడు. ఐర్లాండ్ తో జరిగిన రెండు మ్యాచుల సిరీస్ లో భారత్ కు నాయకత్వం వహించాడు. వన్డేల్లోనూ ఇంగ్లండ్ పై సిరీస్ విజయంలో కీలకపాత్ర పోహించాడు.