Year Ender 2024: గతేడాది వన్డే ప్రపంచకప్ లో భారత్ డామినేషన్ ఎలా ఉందో చూశాం. సొంతగడ్డపై జరిగిన ఈ మెగాటోర్నీలో లీగ్ దశ, సెమీస్ తో సహా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఫైనల్ కు చేరిపోయింది. ఫైనల్లో ఓడిపోయింది, అది వేరే సంగతి అనుకోండి. అయితే ఈ ఏడాది మాత్రం వన్డేల్లో భారత్ కు అస్సలు కలిసి రాలేదు. 1979 తర్వాత ఒక్క వన్డే మ్యాచ్ కూడా గెలవకుండా సంవత్సరాన్ని ముగించడం భారత్ కు ఇది తొలిసారి కావడం విశేషం. 1979 కంటే ముందు 1974, 76లలో కూడా ఒక్క సింగిల్ మ్యాచ్ గెలవకుండా ఉంది. కానీ 79 తర్వాత దాదాపు 45 సంవత్సరాల తర్వాత ఇలా జరగడం భారత అభిమానులకు నిరాశకు గురి చేసింది. నిజానికి ఈ ఏడాది భారత్ అసలు వన్డేలు ఎక్కువగా ఆడలేదు. కేవలం ఒక్క జట్టుతో అది మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ మాత్రమే ఆడింది. 


లంక చేతిలో ఓటమి..
ఈ ఏడాది సెకండ్ హాఫ్ లో లంక పర్యటనకు వెళ్లిన భారత్ అక్కడ మూడేసి టీ20ల, వన్డేల సిరీస్ ను ఆడింది. అయితే టీ20 సిరీస్ ని కంఫర్టబుల్ గా గెలుచుకున్న భారత్ , వన్డేలలో మాత్రం తేలిపోయింది. కోచ్ గా గౌతం గంభీర్ కిదే తొలి వన్డే సిరిస్ అసైన్మెంట్. కొలంబోలో జరిగిన మ్యాచ్ ను భారత్ టై చేసుకుంది. ఒక దశలో 14 బంతుల్లో 1 పరుగు చేస్తే గెలుస్తుందనే స్థితిలో ఆలౌట్ అయ్యింది. దీంతో మ్యాచ్ టై అయిపోయింది. 
ఆ తర్వాత రెండు వన్డేల్లోనూ భారత్ తేలిపోయింది. కోచ్ సనత్ జయసూర్య సారథ్యంలో సొంతగడ్డ అనుకూలతను బాగా వంటబట్టించుకున్న లంక.. భారత్ ను మట్టికరిపించి సిరీస్ ను కైవసం చేసుకుంది. రెండో వన్డేలో 32 పరుగులతో ఓడిన టీమిండియా.. మూడో వన్డేలోనైతే 110 పరుగులతో ఘోరంగా ఓడిపోయింది. దీంతో 1997 తర్వాత లంక చేతిలో వన్డే సిరీస్ కోల్పోయిన బ్యాడ్ నేమ్ మూటగట్టుకుంది. 






న్యూజిలాండ్ చేతిలో మరో ఘోరం..
సొంతగడ్డపై టెస్టు సిరీస్ కోల్పోకుండా రికార్డు మెయింటేన్ చేసిన భారత్ జోరుకు ఈ ఏడాదే కళ్లెం పడింది. అండర్ డాగ్స్ గా బరిలోకి దిగిన కివీస్.. మూడు మ్యాచ్ ల టెస్టు సిరీస్ ను 3-0తో కైవసం చేసుకుంది. దాదాపు 12 సంవత్సరాల తర్వాత సొంతగడ్డపై భారత్.. టెస్టు సిరీస్ ఓడిపోయింది. ఇది కూడా భారత అభిమానులను కలిచి వేసింది. అయితే టీ20లో మాత్రం అద్భుతాలు చేసింది. 2007 తర్వాత టీ20 ప్రపంచకప్ను భారత్ సాధించింది.



దాదాపు 17 సంవత్సరాల తర్వాత కప్పును సాధించి, ఈ కప్పును గెలుపొందిన రెండో జట్టుగా వెస్టిండీస్, ఇంగ్లాండ్ సరసన చేరింది. అయతే టీ20ల నుంచి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించి ఫ్యాన్స్ కు షాకిచ్చారు. ఏదేమైనా 2024 క్రికెట్లో భారత అభిమానులకు ఉగాది పచ్చడిలా తీపి, చేదు కలయికగా మారిందనడంలో ఎలాంటి సందేహం లేదు. 


Aslo Read : Ind Vs Aus Test Series: తప్పదు, రోహిత్ త్యాగం చేయాల్సిందే- బ్యాటింగ్ ఆర్డర్ లో స్థానంపై పుజారా సూచన


Also Read : Rohit Sharma: ఐసీసీ ర్యాంకింగ్స్ లో కోహ్లి, రోహిత్ కు షాక్- పంత్ కు కూడా తగిలిన సెగ