హైదరాబాద్: ఈసారి టీ20  వరల్డ్ కప్ ఆడేందుకు టీమిండియాలో చోటు దక్కించుకోవటం అంటే వాడిలో చాలా మేటర్ ఉండి ఉండాలి. మరి అలాంటి టీమ్ లో ఓపెనర్ గా సెలెక్ట్ అయ్యాడు అంటే యశస్వి జైశ్వాల్ ఎంతటి ప్రతిభావంతుడో అర్థం చేసుకోవచ్చు. క్రికెట్ మీద పిచ్చి ప్రేమతో 10 ఏళ్ల వయస్సులో ముంబైకి వచ్చిన జైశ్వాల్ చేతికి దొరికిన పనల్లా చేశాడు. 
స్టేడియం బయట పానీ పూరీ అమ్మిన జైస్వాల్
తన దూరపు చుట్టమైన వ్యక్తి ముస్లిం యునైటెడ్ క్లబ్ లో పనిచేస్తుంటే అతని ద్వారా ఆ గ్రౌండ్ లో ఒక టెంట్ లో బతికే అవకాశాన్ని దక్కించుకున్నాడు. తను క్రికెటర్ గా ఎదిగేందుకు వచ్చిన ఏ అవకాశాన్ని యశస్వి జారవిడుచుకోలేదు. అందరూ క్రికెట్ ఆడుతుంటే తను మాత్రం బతకటం కోసం అదే ఆజాద్ మైదానం బయట పానీపూరీ అమ్మేవాడు. అలా కోచ్ జ్వాలా సింగ్ దృష్టిలో పడి క్రికెట్ లో వడి వడిగా అడుగులు వేశాడు. అండర్ 19 ప్రపంచకప్ లో సత్తా చాటి ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ కు ఎంపికయ్యాడు. అద్భుతమైన ఆట తీరుతో టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన జైశ్వాల్ చాలా తక్కువ ఏజ్ లోనే మూడు ఫార్మాట్లలోనూ అదిరిపోయే ప్రదర్శనలు ఇవ్వటం మొదలుపెట్టాడు. సెంచరీలు, డబుల్ సెంచరీలతో అదరగొడుతున్నాడు. 




టెస్టుల్లోనూ అదరగొట్టిన యువ సంచలనం
రీసెంట్ గా ముగిసిన ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్ లో రెండు డబుల్ సెంచరీలు సాధించటం 700 పైచిలుకు పరుగులతో విరాట్ కొహ్లీ రికార్డులను బద్దలు కొట్టడం అతని ప్రతిభను చాటుకునేలా చేసింది. ఈ ఐపీఎల్ లో ప్రారంభంలో అంతగా ఆకట్టుకోకున్నా ముంబైతో మ్యాచ్ లో సెంచరీ బాదటం ద్వారా టీ20ల్లోనూ తనెంత విలువైన ఆటగాడినో ప్రూవ్ చేసుకున్నాడు. లెఫ్ట్ హ్యాండ్ ఓపెనర్ కావటం..కెప్టెన్ రోహిత్ శర్మ మద్దతు ఉండటంతో ఏకంగా టీ20 ప్రపంచకప్ కు ఎంపికై టాలెంట్ ఉండాలే కానీ పేదరికంగా అడ్డుకాదని తన ఇన్ స్పైరింగ్ జర్నీతో ప్రూవ్ చేశాడు.


జట్టును ప్రకటించిన బీసీసీఐ 
Tట్వంటీ వరల్డ్ కప్ 2024 భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ ప్రకటించింది. రోహిత్ శర్మ నాయకత్వంలో 15మంది సభ్యుల బృందాన్ని, నలుగురు స్టాండ్ బై ఆటగాళ్లను బీసీసీఐ వెస్టిండీస్, అమెరికాకు పంపించనుంది. భారత్ టీమ్ విషయానికి వస్తే ఓపెనర్లుగా అందరూ ఊహించినట్లే రోహిత్ శర్మ, యశస్వి జైశ్వాల్ ఉండనున్నారు. వన్ డౌన్ లో విరాట్ కొహ్లీ, సెకండ్ డౌన్ లో సూర్యకుమార్ యాదవ్ సెలెక్ట్ అయ్యారు. మిడిల్ ఆర్డర్ భారాన్ని దూబే, రిషబ్ పంత్ చూసుకోనున్నారు.


సంజూ శాంసన్ ను బ్యాకప్ వికెట్ కీపర్ గా తీసుకున్నారు. ఆల్ రౌండర్లుగా హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ లను ఎంపిక చేశారు. పాండ్యా వైఎస్ కెప్టెన్ గానూ ఉండనున్నాడు. ఇక బౌలింగ్ విభాగంలో కుల్దీప్ యాదవ్, చాహల్ బాధ్యతలను పంచుకోనున్నారు. పేసర్లుగా సిరాజ్, బుమ్రా, అర్ష్ దీప్ సింగ్ ఉండనున్నారు. వీళ్లు కాకుండా శుభ్ మన్ గిల్, రింకూ సింగ్ ఖలీల్ అహ్మద్, ఆవేశ్ ఖాన్ లు కూడా వరల్డ్ కప్ టీమ్ తో వెళ్లనున్నారు. ఇక టీ2౦ వరల్డ్ కప్ ఆశలు పెట్టుకున్న కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, దినేశ్ కార్తీక్, ఇషాన్ కిషన్ లకు సెలెక్టెర్లు మొండి చెయ్యి చూపించారు.