విజయ్ హజారే ట్రోఫీలో సోమవారం తమిళనాడు, అరుణాచల్ ప్రదేశ్‌ల మధ్య జరిగిన మ్యాచ్‌లో రికార్డుల వరద పారింది. టాస్ గెలిచిన అరుణాచల్ ప్రదేశ్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. అదే వారి పాలిట శాపం అయింది. మొదట బ్యాటింగ్ చేసిన తమిళనాడు ఆకాశమే హద్దుగా చెలరేగింది. 50 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి ఏకంగా 506 పరుగులు చేసింది. లిస్ట్-ఏ క్రికెట్ చరిత్రలోనే ఇది అత్యధిక స్కోరు కావడం విశేషం. నెదర్లాండ్స్‌పై ఇంగ్లండ్ సాధించిన 498 పరుగులు లిస్ట్-ఏ చరిత్రలో అత్యధికం.


తమిళనాడు ఓపెనర్లు నారాయణ్ జగదీశన్ (277: 141 బంతుల్లో, 25 ఫోర్లు, 15 సిక్సర్లు), సాయి సుదర్శన్ (154: 102 బంతుల్లో, 19 ఫోర్లు, రెండు సిక్సర్లు) మొదటి బంతి నుంచే చెలరేగి ఆడారు. మొదటి వికెట్‌కు వీరిద్దరూ 38.3 ఓవర్లలోనే 416 పరుగులు సాధించారు. లిస్ట్-ఏ క్రికెట్‌లో ఏ వికెట్‌కైనా ఇదే అత్యధిక భాగస్వామ్యం.


ఇక నారాయణ్ జగదీశన్ సాధించిన 277 పరుగులు కూడా లిస్ట్-ఏ క్రికెట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు. 2002లో ఓవల్ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో అలెక్స్ బ్రౌన్ సాధించిన 268 పరుగుల రికార్డును నారాయణ్ జగదీశన్ అధిగమించాడు. ఓపెనర్లు ఇద్దరూ అవుటయ్యాక క్రీజులోకి వచ్చిన బాబా అపరాజిత్, బాబా ఇంద్రజిత్‌లో చెరో 31 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు.


లిస్ట్-ఏ క్రికెట్‌లో వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో సెంచరీలు సాధించి శ్రీలంక లెజెండరీ ఆటగాడు కుమార సంగక్కర రికార్డును నారాయణ్ జగదీశన్ బద్దలు కొట్టారు. లిస్ట్-ఏ క్రికెట్లో అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌లు, దేశవాళీ మ్యాచ్‌లు ఉంటాయి. 40 ఓవర్ల నుంచి 60 ఓవర్ల మధ్య రేంజ్‌లో ఈ ఓవర్లు ఉండనున్నాయి.


విజయ్ హజారే ట్రోఫీలో వరుస సెంచరీల విషయంలో విరాట్ కోహ్లీ, పృథ్వీ షా, రుతురాజ్ గైక్వాడ్, దేవ్‌దత్ పడిక్కల్ వంటి స్టార్ ప్లేయర్ల రికార్డులను కూడా జగదీశన్ దాటేశాడు. వీరందరూ వరుసగా నాలుగు సెంచరీలు సాధించారు. ఇప్పుడు ఐదు సెంచరీలతో జగదీశన్ కొత్త రికార్డు సృష్టించాడు.


ఈ మ్యాచ్‌లో రెండోసారి బ్యాటింగ్ చేసిన అరుణాచల్ ప్రదేశ్ కేవలం 71 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో తమిళనాడు ఏకంగా 435 పరుగులతో విజయం సాధించింది. లిస్ట్-ఏ క్రికెట్ చరిత్రలో పరుగుల పరంగా ఇదే పెద్ద విజయం. 1990లో సోమర్‌సెట్ జట్టు డెవాన్‌పై సాధించిన 346 పరుగుల విజయమే ఇప్పటివరకు అత్యధికం. 32 సంవత్సరాల తర్వాత తమిళనాడు దాన్ని బద్దలు కొట్టడం విశేషం.