టీ20 వరల్డ్ కప్‌లో ఇంగ్లండ్‌కు మొదటి విజయం లభించింది. సూపర్-12 మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌పై ఐదు వికెట్లతో గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ 19.4 ఓవర్లలో 112 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం ఇంగ్లండ్ 18.1 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.


టాస్ గెలిచిన ఇంగ్లండ్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్‌కు దిగిన ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్ మందకొడిగా ప్రారంభం అయింది. ఇంగ్లండ్ బౌలర్లు మూడో ఓవర్ నుంచే వరుస విరామాల్లో వికెట్లు తీస్తూ ఆఫ్ఘన్ బ్యాటర్లను క్రీజులో కుదురుకోనివ్వలేదు. ఇబ్రహీం జద్రాన్ (32: 32 బంతుల్లో, మూడు ఫోర్లు, ఒక సిక్సర్), ఉస్మాన్ గని (30: 30 బంతుల్లో, మూడు ఫోర్లు) మినహా మరెవ్వరూ కనీసం 15 పరుగులు కూడా చేయలేకపోయారు.


ఆఖర్లో శామ్ కరన్ ఐదు వికెట్లు తీసి ఆఫ్ఘన్ టెయిలెండర్ల పని పట్టాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఇంగ్లండ్ తరఫున ఒక టీ20 ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసిన మొదటి బౌలర్ శామ్ కరనే. మార్క్ వుడ్, బెన్ స్టోక్స్ రెండేసి వికెట్లు దక్కించుకున్నారు. క్రిస్ వోక్స్ ఒక వికెట్ పడగొట్టాడు.


అనంతరం ఇంగ్లండ్ ఇన్నింగ్స్ కూడా నిదానంగానే ప్రారంభం అయింది. టాప్-4 బౌలర్లలో ఒక్కరి స్ట్రైక్ రేట్ కూడా 100 దాటలేదు. డేవిడ్ మలన్ (18: 30 బంతుల్లో) అయితే మరీ నిదానంగా ఆడాడు. ఐదు ఓవర్లు ఆడినా ఒక్క బౌండరీ కూడా కొట్టలేకపోయాడు. ఫాంలో ఉన్న జోస్ బట్లర్ (18: 18 బంతుల్లో, మూడు ఫోర్లు), అలెక్స్ హేల్స్ (19: 20 బంతుల్లో, ఒక సిక్సర్), బెన్ స్టోక్స్ (2: 4 బంతుల్లో) కూడా విఫలం కావడంతో ఇంగ్లండ్ కష్టాల్లో పడింది.


కేవలం లియాం లివింగ్‌స్టోన్ (29: 21 బంతుల్లో, మూడు ఫోర్లు) మాత్రమే కొంచెం వేగంగా ఆడాడు. కొట్టాల్సిన స్కోరు చాలా తక్కువగా ఉండటం, ఆఫ్ఘన్ బౌలర్లు ఏకంగా 12 వైడ్లు వేయడంతో ఇంగ్లండ్ పని మరింత సులభం అయింది. ఆఫ్ఘన్ బౌలర్లలో ఫజల్‌హక్ ఫరూకీ, ముజీబ్ ఉర్ రహమాన్, రషీద్ ఖాన్, ఫరీద్ అహ్మద్ మాలిక్, మహ్మద్ నబీ తలో వికెట్ తీసుకున్నారు.