T20 World Cup: ఐసీసీ టీ20 ప్రపంచకప్ కోసం ఎంపిక చేసే భారత జట్టులో ఫాస్ట్ బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, హర్షల్ పటేల్ లకు చోటు దక్కే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. గాయాల నుంచి కోలుకున్న వీరిద్దరూ ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. వీరు ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) లో శిక్షణ పొందుతున్నారు. 


ఎంపిక లాంఛనమే!


ఏఎన్ ఐ సమాచారం ప్రకారం.. బుమ్రా ఎన్సీఏలో క్రమం తప్పకుండా బౌలింగ్ చేస్తున్నట్లు తెలిసింది. వైద్య బృందం అతనిని నిశితంగా పరిశీలిస్తోందని.. బాగానే ఆడుతున్నట్లు ఏఎన్ ఐ తెలిపింది. తుది పరీక్ష అయితే ఇంకా పూర్తి కాలేదని.. అయితే బుమ్రా అందుబాటులోకి రావడం ఖాయమేనని చెప్పింది. మరోవైపు హర్షల్ పటేల్ కూడా బాాగా రాణిస్తున్నాడని.. అతను ఎంపికకు అందుబాటులో ఉండనున్నట్లు తెలిపింది. అయితే తుది పరీక్ష పైనే వారి ఎంపిక ఆధారపడి ఉండనున్నట్లు ఏఎన్ ఐ తెలిపింది. టీ20 ప్రపంచకప్ కు జట్టు ఎంపిక కోసం సెలెక్టర్లు త్వరలో సమావేశం అయ్యే అవకాశం ఉంది. ఈ మెగా టోర్నీ అక్టోబర్ 16 నుంచి నవంబర్ 13 వరకు జరగనుంది. 


ఆసియా కప్ కు దూరం


బుమ్రా, హర్షల్ పటేల్ లు గాయాల కారణంగా ఆసియా కప్ లో చోటు దక్కించుకోలేకపోయారు. ఈ ఏడాది టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్ గా హర్షల్ పటేల్ నిలిచాడు. సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ 31 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. బుమ్రా ఈ ఏడాది కేవలం మూడు టీ20లు మాత్రమే ఆడి 3 వికెట్లు తీశాడు. 


ఫైనల్ కు చేరని భారత్


ఆసియా కప్ 2022 టోర్నీలో సూపర్- 4 లో భారత్ మూడో స్థానంలో నిలిచింది. దాంతో ఫైనల్ కు అర్హత సాధించలేకపోయింది. గ్రూప్ దశలో పాకిస్థాన్, హాంకాంగ్ లను ఓడించిన టీమిండియా.. కీలకమైన సూపర్- 4 మ్యాచుల్లో వరుసగా పాక్, శ్రీలంక చేతుల్లో పరాజయం పాలైంది. సూపర్- 4 లో తన చివరి మ్యాచులో అఫ్ఘనిస్థాన్ పై భారీ విజయం సాధించినా.. అప్పటికే ఆలస్యం అయ్యింది. దీంతో ఈసారి ఫైనల్ కు చేరకుండానే టీమిండియా టోర్నీ నుంచి నిష్క్రమించింది.