Asia Cup 2022 Final: ఆసియా కప్ పైనల్ సమరానికి సమయం వచ్చేసింది. శ్రీలంక- పాకిస్థాన్ ల మధ్య టైటిల్ పోరు నేడు జరగనుంది. రాత్రి 7.30 గంటల నుంచి ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఆసియా కప్ లో ఆడుతున్న ఆరు జట్లలో హాంకాంగ్ ను మినహాయిస్తే అత్యంత తక్కువ అంచనాలున్న జట్టు శ్రీలంక. దేశంలో ఆర్థిక సంక్షోభం కారణంగా.. టోర్నీని నిర్వహించలేని పరిస్థితిలో యూఏఈకి ఆసియా కప్ ఆతిథ్యాన్ని అప్పగించింది. ఆటగాళ్లలో అనిశ్చితితో ఇటీవల కాలంలో ఆటలోనూ సరిగ్గా రాణించట్లేదు. అందుకు తగ్గట్లే లీగ్ దశలో అఫ్ఘనిస్థాన్ చేతిలో ఓటమితో టోర్నీని మొదలుపెట్టింది. అయితే ఆ తర్వాత నుంచి లంక ఆటతీరు మారిపోయింది.
సూపర్- 4కు చేరుకోవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో బంగ్లాపై 184 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి రేసులోకి వచ్చింది. అక్కడినుంచి ఓటమన్నదే లేకుండా ఫైనల్ కు చేరుకుంది. సూపర్- 4 మ్యాచుల్లో బలమైన భారత్, పాక్ లను ఓడించింది.
సమష్టిగా ఆడడమే లంక బలం
సమష్టిగా ఆడడమే శ్రీలంక బలం. జట్టులో స్టార్లు లేకపోయినా ఆటగాళ్లందరూ తలో చేయి వేసి జట్టును గెలిపిస్తున్నారు. బ్యాట్స్ మెన్ ఎదురుదాడి చేస్తూ భారీ స్కోర్లు చేస్తున్నారు. కుశాల్ మెండిస్, నిశాంక, రాజపక్స, కెప్టెన్ శనక అద్భుతంగా పరుగులు చేస్తున్నారు. బౌలింగ్ లోనూ తీక్షణ, హసరంగ, మధుశంక లాంటి వాళ్లు ఆకట్టుకుంటున్నారు. ఫీల్డింగ్ లోనూ శ్రీలంక మెరుగ్గా ఉంది. ఇదే ఆల్ రౌండ్ ప్రదర్శనను ఫైనల్లోనూ చూపిస్తే లంక కప్పు కొట్టినట్లే
పాక్ మెరుగ్గానే
మరోవైపు పాకిస్థాన్ జట్టు మెరుగ్గానే కనిపిస్తోంది. లీగ్ దశలో భారత్ పై ఓటమి తర్వాత ఆ జట్టు పుంజుకుంది. సూపర్- 4 లో టీమిండియా సహా అఫ్ఘనిస్థాన్ ను ఓడించి ఫైనల్ బెర్తు దక్కించుకుంది. ఎప్పట్లాగే బౌలింగ్ ఆ జట్టు జలం. నసీం షా, రవూఫ్, హస్నైన్ పేస్ బౌలంగ్ లో రాణిస్తుండగా.. షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్ అదరగొడుతున్నారు. అయితే అస్థిరమైన బ్యాటింగే పాక్ బలహీనతగా కనిపిస్తోంది. కెప్టెన్ బాబర్ ఈ టోర్నీలో విఫలమయ్యాడు. సూపర్- 4 లో లంకపై మినహా పెద్దగా పరుగులు చేయలేదు. అయితే మరో ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ సూపర్ ఫామ్ లో ఉన్నాడు. అతనితోపాటు ఫకార్ జమాన్, ఖుష్ దిల్ షా, ఆసిఫ్ అలీ, నవాజ్ రాణిస్తున్నారు.
పాకిస్థాన్, శ్రీలంక 3 సార్లు ఆసియా కప్ ఫైనల్స్ ఆడాయి. ఇందులో లంక 2 సార్లు కప్ గెలవగా.. పాక్ ఒకసారి విజయం సాధించింది.
పిచ్ పరిస్థితి
దుబాయ్ పిచ్ బౌలర్లకు అనుకూలంగా ఉంటుంది. స్పిన్నర్లు ఆధిపత్యం చెలాయించే అవకాశం ఉంది. బ్యాటింగ్ మరీ కష్టమేమీ కాదు. టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్ ఎంచుకునే అవకాశముంది.
పాకిస్థాన్ జట్టు (అంచనా)
బాబర్ అజాం(కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్, ఫకార్ జమాన్, ఇఫ్తికార్ అహ్మద్, ఖుష్ దిల్ షా, ఆసిఫ్ అలీ, షాదాబ్ ఖాన్, నవాజ్, నసీం షా, రవూఫ్, హస్నైన్.
శ్రీలంక జట్టు (అంచనా)
కుశాల్ మెండిస్, నిశాంక, ధనుంజయ డిసిల్వా, గుణతిలక, రాజపక్స, శనక (కెప్టెన్), హసరంగ, చమిక కరుణరత్నె, తీక్షణ, మధుశంక, మధుశాన్.