IND vs PAK Match today: టీ 20 ప్రపంచకప్‌(T20 World Cup)లో హై ఓల్టేజ్‌ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. గ్రూప్‌ ఏలో దాయాదుల  పోరు జరగనుంది. తొలి మ్యాచ్‌లో ఘన విజయం సాధించిన టీమిండియా(India(తో అమెరికా చేతిలో కంగుతిన్న పాకిస్థాన్‌(Pakistan) తలపడనుంది. న్యూయార్క్‌లోని  నాసావు కౌంటీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం(Nassau County International Cricket Stadium )లో  జరగనున్న ఈ మ్యాచ్‌లో పిచ్‌పైనే అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది. ఈ పిచ్‌పై ఇప్పటివరకూ మూడు మ్యాచులు జరగగా ఆరు ఇన్నింగ్సుల్లో రెండుసార్లు మాత్రమే వందకుపైగా పరుగులు నమోదయ్యాయి. బౌలర్లు చెలరేగిపోతున్న ఈ పిచ్‌పై భారత్‌-పాక్‌ బ్యాటర్లు ఎలా రాణిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. రోహిత్‌, కోహ్లీ, జైస్వాల్‌, పంత్‌, హార్దిక్‌ పాండ్యా, సూర్యలతో కూడిన... భారత బ్యాటింగ్‌ లైనప్‌ చాలా బలంగా కనిపిస్తోంది. బుమ్రా సారథ్యంలోని బౌలింగ్‌ దళం కూడా మెరుగ్గానే ఉంది. తొలి మ్యాచ్‌లో అమెరికా చేతిలో సూపర్‌ ఓవర్‌లో ఓటమి పాలైన పాకిస్థాన్‌... ఈ మ్యాచ్‌లో గెలిచి ముందడుగు వేయాలని చూస్తోంది. అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో కెప్టెన్‌ బాబర్ రాణించినా మిగిలిన బ్యాటర్లు... విఫలమయ్యారు. 


 

బ్యాటింగ్‌లో తిరుగేలేదు

ఈ ప్రపంచకప్‌లో ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఘన విజయం సాధించి మంచి ఊపు మీదున్న భారత్‌ అదే ఊపులో పాక్‌ను చిత్తు చేయాలని చూస్తోంది. ఓపెనర్లుగా బరిలోకి దిగిన రోహిత్‌- విరాట్‌ తొలి మ్యాచ్‌లో పెద్దగా రాణించలేదు. కానీ స్వల్ప లక్ష్యం కావడంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా విజయం సాధించింది. అయితే పాక్‌తో జరిగే ఈ హై ఓల్టేజ్‌ మ్యాచ్‌లో రోహిత్‌శర్మ(Rohit Sharma) -విరాట్‌ కోహ్లీ(Virat Kohli)జోడీ మంచి ఆరంభాన్ని ఇస్తే పాకిస్థాన్‌కు ఇబ్బందులు తప్పవు. ఈ మ్యాచ్‌లో రోహిత్‌కు జోడీగా విరాట్‌ వస్తాడా లేక యశస్వి జైస్వాల్‌ను బరిలో దింపుతారా అన్నది చూడాలి. ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్‌ త్వరగానే అవుటైనా రోహిత్‌ శర్మ మాత్రం ఉన్నంతవరకూ దూకుడుగానే ఆడాడు. హిట్‌ మ్యాన్‌ 37 బంతుల్లో 52 పరుగులు చేసి విజయంలో కీలకపాత్ర పోషించాడు. వన్‌ డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన రిషబ్‌ పంత్‌ కూడా సత్తా చాటాడు. 26 బంతులు మాత్రమే ఎదుర్కొన్న పంత్‌ 36 పరుగులు చేసి రాణించాడు. ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ, ప్రపంచ నెంబర్ వన్‌ టీ 20 బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ తక్కువ పరుగులకే అవుటయ్యారు. ఈ మ్యాచ్‌లో రాణించి మళ్లీ ఫామ్‌ను అందిపుచ్చుకోవాలని విరాట్‌, సూర్య గట్టి పట్టుదలతో ఉన్నారు. వీళ్లతో పాటు మిగిలిన బ్యాటర్లు కూడా సత్తా చాటితే పాక్‌కు తిప్పలు తప్పవు. మరోవైపు ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో బౌలర్లు సత్తా చాటారు. హార్దిక్‌ పాండ్యా మూడు వికెట్లతో చెలరేగాడు. పాక్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బుమ్రా, పాండ్యాలతో కూడిన భారత బౌలింగ్‌ దళం రాణిస్తో దాయాదుల పోరులో భారత్‌ విజయం సాధించడం ఖాయం.

 

పాక్‌ గాడినపడుతుందా..?

టీ 20 ప్రపంచకప్‌లో అమెరికాతో జరిగిన తొలి మ్యాచ్‌లో పాక్‌ చావుదెబ్బతింది. సూపర్‌ ఓవర్‌లో పాక్‌ పరాజయం పాలైంది. అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో బాబర్‌ ఆజమ్‌ షాదాబ్ ఖాన్ 25 బంతుల్లో 40.. కెప్టెన్ బాబర్ అజామ్ 43 బంతుల్లో 44 పరుగులు చేసి పర్వాలేదనపించారు. మిగిలిన బ్యాటర్లు చేతులెత్తేశారు. బౌలర్లు కూడా స్థాయికి తగ్గట్లు రాణించలేదు. సూపర్‌ ఓవర్‌లో సీనియర్‌ బౌలర్ మహ్మద్‌ అమీర్ ఒత్తిడికి గురై ఎక్స్‌ట్రాలు ఇవ్వడం పాక్‌ను ఆందోళన పరుస్తోంది. మిగిలిన బౌలర్లు కూడా తేలిపోయారు. భారత్‌తో జరిగే ఈ హై ఓల్టేజ్‌ మ్యాచ్‌లో పాక్‌ ఆటగాళ్లు ఏం చేస్తారో చూడాలి.