South Africa vs Afghanistan T20 WC Clash | దక్షిణాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్. ఈ రెండు జట్లు ఓ ఐసీసీ నాకౌట్ మ్యాచ్‌లో ప్రత్యర్థుగా మారతాయని ఎవరూ ఊహించి ఉండరు. కానీ అనూహ్యంగా ప్రస్తుంట వెస్టిండీస్, అమెరికా వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ 2024లో సెమీఫైనల్స్‌లో తలపడేందుకు సిద్ధంగా ఉన్నాయి. అయితే ఆసియా ఖండపు జట్టు ఆఫ్ఘనిస్తాన్ అగ్ర జట్టకు షాకుల మీద షాకులు ఇచ్చి సెమీ ఫైనల్ కి చేరింది. మరోవైపు చోకర్స్‌గా చెడ్డపేరు తెచ్చుకున్న దక్షిణాఫ్రికా ఓటమి అనేదే లేకుండా పొట్టి ప్రపంచ కప్ సెమీస్ కు చేరుకుంది. కానీ ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది. ఓసారి లిస్ట్ చూస్తే మీకే అర్థమవుతుంది. 


దక్షిణాఫ్రికా జట్టు ఈ వరల్డ్ కప్ లో ఇప్పటివరకూ ఆడిన మ్యాచుల లిస్ట్ చూసిన వాళ్లు కొంచెం షాకవుతారు. నాలుగు సార్లు ఫస్ట్ బ్యాటింగ్ చేసి గెలిచింది, దాంతోపాటు మూడు సార్లు ఛేజింగ్ చేసి సైతం విజయం సాధించింది దక్షిణాఫ్రికా. కానీ ఈ పొట్టి ప్రపంచ కప్‌లో ఏ మ్యాచు కూడా దక్షిణాఫ్రికా స్థాయి విజయం కాదని సగటు క్రికెట్ ప్రేమికులు ఇట్టే చెప్పేస్తారు. మాజీ ఛాంపియన్ శ్రీలంక జట్టు మీద 6 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా గెలిచిన ఫస్ట్ మ్యాచే సాధికారికంగా సాధించిన పెద్ద విజయం అని చెప్పవచ్చు. ఆ తర్వాత నెదర్లాండ్స్ తో తలపడిన సఫారీలు నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించారు. బంగ్లాదేశ్ టీమ్ మీద సైతం కేవలం నాలుగంటే నాలుగు పరుగుల తేడాతో గెలిచి హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుంది. నేపాల్ తో మ్యాచ్ అయితే ఆల్మోస్ట్ ఓడిపోయేది. కానీ గతంలో ఎన్నడూ లేనట్లుగా, దేవుడి స్క్రిప్ట్ రాశాడా అన్న తరహాలో అదృష్టం కలిసొచ్చి ఒక్క పరుగు తేడాతో గెలిచింది దక్షిణాఫ్రికా.  


ఇక టీ20 వరల్డ్ కప్ సూపర్ 8లో అమెరికా (USA Team) మీద 18 పరుగులతో సఫారీలు నెగ్గారు. ఇక డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ మీద 7 రన్స్ తేడాతో నెగ్గిన దక్షిణాఫ్రికా టీమ్..  వెస్టిండీస్ మీద 3 వికెట్ల తేడాతో విజయం సాధించి సెమీఫైనల్స్‌కు చేరింది. ఓ రకంగా చెప్పాలంటే ఇప్పటివరకూ దక్షిణాఫ్రికా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. అలా అని ఒక్క ఘన విజయం  లేదు. బతుకు జీవుగా అన్నట్లు లీగ్ స్టేజీలో గెలిచిన మ్యాచ్‌లు సాక్ష్యాలుగా ఉన్నాయి. క్లైమాక్స్ లో పోరాడి మ్యాచ్ గెలిచింది అని చెప్పవచ్చు. 



మరోవైపు ఆసియా టీమ్ ఆఫ్ఘనిస్తాన్ అలా కాదు. తన కంటే ఎంతో బలమైన న్యూజిలాండ్ జట్టుతో పాటు మాజీ ఛాంపియన్ ఆస్ట్రేలియాను సైతం మట్టికరిపించింది. 18౦ పైగా స్కోరు చేసిన ఆఫ్ఘనిస్తాన్.. ఛేజింగ్ చేసిన న్యూజిలాండ్ ను 75 పరుగులకే ఆలౌట్ చేసింది. నెక్ట్స్ ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో 140 ప్లస్ స్కోరే కొట్టింది. కానీ పటిష్ట ఆసీస్ జట్టును కేవలం 120 రన్స్‌కే కుప్పకూల్చారు అఫ్గాన్ బౌలర్లు. చివరి మ్యాచ్‌లో బంగ్లా దేశ్‌పై 115 పరుగులే కొట్టారు ఆఫ్గాన్ బ్యాటర్లు. కానీ బంగ్లాదేశ్ ను 105 పరుగులకే కట్టడి చేసి నెగ్గారు. 


ఆఫ్ఘనిస్తాన్ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే, ఎంత పెద్ద టీమ్ నైనా మడతపెట్టేస్తానని నిరూపించింది. దక్షిణాఫ్రికా పరిస్థితి అలాకాదు. బంగ్లాదేశ్, నేపాల్ లాంటి జట్లే దక్షిణాఫ్రికా టార్గెట్ కు దాదాపు చేరుకున్నాయి. కేవలం నాలుగు పరుగులు, ఒక్క పరుగు తేడాతో ఓడిపోయాయి. అగ్ర జట్లకే షాకులు ఇచ్చి సెమీస్ కు వచ్చిన ఆఫ్ఘనిస్తాన్ జట్టును సఫారీలు సీరియస్‌గా తీసుకోవాలి. సెమీఫైనల్స్‌కు అప్రతిహతంగా దూసుకొచ్చినా, తర్వాత కప్పు లేకుండానే ఇంటి దారి పట్టడం దక్షిణాఫ్రికాకు షరా మాములే. జాగ్రత్తగా ఆడకపోతే అఫ్గాన్ బౌలర్లు, బ్యాటర్లు దక్షిణాఫ్రికాకు కు కాబూలీ పలావ్ తినిపించేయటం ఖాయమని క్రికెట్ ప్రేమికులు భావిస్తున్నారు.