India vs England T20 WC 2024 Semi-Final: టీ 20 ప్రపంచకప్‌(T20 WC 2024)ను ఒడిసి పట్టేందుకు టీమిండియా(Team India) కేవలం రెండడుగుల దూరంలో ఉంది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌(Pakistan), ప్రపంచ ఛాంపియన్‌ ఆస్ట్రేలియా(Austrelia)ను మట్టికరిపించిన టీమిండియా ఒక్క మ్యాచ్‌ ఓడిపోకుండా పూర్తి ఆత్మ విశ్వాసంతో సెమీస్‌లో అడుగు పెట్టింది. ఇప్పటివరకూ ఒక్క బ్యాటర్‌ శతక నినాదం చేయకపోయినా భారత్‌ సెమీస్‌లో అడుగుపెట్టిందంటే బ్యాటర్లు సమష్టిగా రాణించడమే కారణం. విరాట్ కోహ్లీ వరుసగా విఫలమవుతున్నా... తర్వాత వచ్చే బ్యాటర్లందరూ మంచి ఇన్నింగ్స్‌లు ఆడుతుండడంతో బ్యాటింగ్‌లో టీమిండియాకు ఎదురు లేకుండా పోయింది. బుమ్రా సారధ్యంలోని బౌలింగ్‌లోనూ పటిష్టంగా కనిపిస్తోంది. స్వల్ప లక్ష్యాలను కూడా కాపాడుకుని టీమిండియా బౌలర్లు సత్తా చాటారు. ఇక మిగిలింది ఇంగ్లాండ్ పని పట్టడమే. ఆ పని కూడా సంపూర్ణం చేస్తే టీమిండియా ఘనంగా ఫైనల్లో అడుగుపెట్టినట్లే. 


గుర్తుందా ఆ పరాభవం  
 2023 వన్డే వరల్డ్‌కప్ ఫైనల్లో తమను ఓడించిన ఆస్ట్రేలియాను ఓడించిన భారత్‌.. వారిపై ప్రతీకారం తీర్చుకుంది. అది అలా ఇలా కాదు. టీమిండియా కొట్టిన దెబ్బకు కంగారులు సెమీస్‌ కూడా చేరకుండానే ఇంటిదారి పట్టింది. ఆస్ట్రేలియాపై ప్రతీకారం తీర్చుకున్న రోహిత్‌ సేన దృష్టి... ఇక ఇంగ్లాండ్‌పై పడింది. ఇక 2022లో సెమీఫైనల్లో తమను దెబ్బ కొట్టిన బ్రిటీష్‌ జట్టు పని కూడా పట్టేస్తే బదులు తీర్చుకోవడంతో పాటు భారత జట్టు ఫైనల్‌లో అడుగుపెట్టేస్తోంది. 2022 టీ ప్రపంచకప్‌ రెండో సెమీఫైనల్లో టీమిండియా 169 పరుగులు చేసింది. హార్దిక్ పాండ్యా 63, విరాట్ కోహ్లి 50 పరుగులు చేసినా భారీ స్కోరు చేయలేకపోయింది.  ఈ లక్ష్యాన్ని జోస్ బట్లర్ సేన ఊదేసింది. అలెక్స్ హేల్స్, జోస్ బట్లర్ భారత బౌలర్లను కకావికలం చేశారు. ఇంగ్లాండ్ కేవలం 16 ఓవర్లలో 170 పరుగులు చేసి 10 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ పరాభవానికి ప్రతీకారం తీర్చుకునే సువర్ణావకాశం భారత్‌ ముందుంది. జూన్ 27 గురువారం గయానాలో భారత్, ఇంగ్లండ్ జట్లు తలపడనున్నాయి. 


రెండు జట్లు బలంగానే..
టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా వరుస విజయాలతో జోరు మీదుంది. భారత్‌ గ్రూప్ 1 లో అగ్రస్థానంలో ఉంది. ఇంగ్లాండ్‌ మాత్రం పోరాడి సెమీస్‌ చేరింది. గ్రూప్‌ దశలో తొలి మ్యాచ్‌లో స్కాట్లాండ్‌పై జరగాల్సిన మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దైంది. రెండో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఇంగ్లాండ్‌ ఓడింది. ఇక ఇంగ్లాండ్‌ సెమీస్‌ చేరుతుందన్న ఆశలు ఎవరికీ లేకుండా పోయాయి. కానీ ఒమన్‌పై బ్రిటీష్‌ జట్టు భారీ విజయం సాధించింది. ఒమన్‌ను 47 పరుగులకే ఆలౌట్‌ చేసి... 3.1 ఓవర్లోనే ఆ లక్ష్యాన్ని ఛేదించి నెట్‌రన్ రేట్‌ను భారీగా పెంచుకుంది. ఇక సూపర్‌ ఎయిట్‌లో విండీస్‌పై ఘన విజయం సాధించి శుభారంభం చేసిన ఇంగ్లాండ్‌... ఆ తర్వాత సౌతాఫ్రికాపై పరాజయం పాలైంది. ఆ తర్వాత సెమీస్‌ చేరాలంటే భారీ తేడాతో గెలవాల్సిన చోట అమెరికాపై ఇంగ్లాండ్‌ ఘన విజయం సాధించింది. అమెరికా నిర్దేశించిన 115 పరుగుల లక్ష్యాన్ని 9.4 ఓవర్లలోనే వికెట్‌ నష్టపోకుండా ఛేదించి విజయం సాధించింది. దీంతో సెమీస్‌లో స్థానం దక్కించుకుంది. ఈ మ్యాచ్‌లో జోస్‌ బట్లర్‌ చెలరేగిపోయాడు. ఇక భారత్‌తో సెమీస్‌ పోరుకు సిద్ధమైన ఇంగ్లాండ్‌ ఏం చేస్తుందో చూడాలి. కానీ అందివచ్చిన అవకాశాన్ని భారత్‌ వదిలిపెట్టదు.