Afghanistan accused of cheeting: టీ 20 ప్రపంచకప్‌(T 20 World Cup)లో సూపర్‌ ఎయిట్‌(Super 8) ఆఖరి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌-అఫ్గానిస్థాన్‌(Afg vs Ban) మధ్య జరిగిన మ్యాచ్‌ క్రికెట్‌ అభిమానులను మునివేళ్లపై నిలబెట్టింది. గెలుపు కోసం ఇరు జట్లు చివరి వరకూ పోరాడటంతో మ్యాచ్‌ ఉత్కంఠబరితంగా సాగింది. అయితే చివరికి అప్గాన్‌ అద్భుతం విజయం సాధించి సెమీస్‌ చేరింది. అయితే ఈమ్యాచ్‌కు పలుమార్లు వర్షం అంతరాయం కలిగించింది. దీంతో డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిని అంచనా వేసిన అప్గాన్ జట్టు మైదానంలోనే కొన్ని డ్రామాలు ఆడిందన్న విమర్శలు సోషల్‌ మీడియాలో  చెలరేగుతున్నాయి. ఈ విమర్శలపై టీమిండియా స్టార్‌ స్పిన్నర్‌ అశ్విన్‌ కూడా స్పందించడం ఇప్పుడు ఈ విషయం ప్రాధాన్యం సంతరించుకుంది.


ఇంతకీ  ఏం జరిగింది అంటే ... 


పొట్టి ప్రపంచకప్‌ సూపర్‌ ఎయిట్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్‌ మోసం చేసిందంటూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌లు కనిపిస్తున్నాయి. అఫ్గాన్ కోచ్‌ జోనాథన్ ట్రాట్ సూచనల మేరకు ఆ జట్టు పేసర్‌ గుల్బదీన్‌... తొడ కండరాలు పట్టేసినట్లు నటించాడని సోషల్‌ మీడియాలో పోస్ట్‌లు వైరల్‌గా మారాయి. కోచ్‌ సిగ్నల్ ఇవ్వగానే  గుల్బదీన్‌ గాయమైనట్లు మైదానంలో ఒక్కసారిగా కిందపడిపోయాడు. ఆ తర్వాత మైదానంలోకి ఫిజియో రావడం... ఆ వెంటనే వర్షం కురవడం చకచకా జరిగిపోయాయి. అప్పటికీ డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో అఫ్గానిస్థాన్‌ విజయానికి చేరువలో ఉంది. దీంతో ట్రాట్‌ సూచించిన వెంటనే గుల్బదీన్‌ మైదానంలో పడిపోయాడని నెటిజన్లు పోస్ట్‌లు చేస్తున్నారు. ఆఫ్ఘన్‌ మోసం చేసిందని ఆరోపణలు వచ్చాయి. స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న గుల్బదీన్‌కు ఉన్నట్లుండి ఒక్కసారిగా పడిపోవడం ఇప్పుడు వైరల్‌గా మారింది. గుల్బదీన్‌ గాయం అసలు నిజమే కాదని కూడా విమర్శలు వస్తున్నాయి. గుల్బదీన్‌ చర్యతో బంగ్లాదేశ్ జట్టు మాత్రమే కాకుండా ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ కూడా అసంతృప్తి వ్యక్తం చేసినట్లు వైరల్‌ అవుతున్న వీడియోలో ఉంది.  ఇక మనవాళ్ళయితే గుల్బదీన్‌కు ఏకంగా బాస్కర్ అవార్డ్ ఇచ్చేశారు.  అన్నట్టు విజయం ఖారారైన తరువాత పరిగెత్తిన వాళ్ళలో కూడా మన భాసర్ అవార్డ్ గ్రహీత గుల్బదీన్‌ ముందున్నాడు. 










సెటైర్లు వేసిన మాజీలు .. 


ఈ సీన్ చూసిన  టీమిండియా స్టార్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్ అశ్విన్, ఇంగ్లాండ్‌ మాజీ కెప్టెన్‌ మైఖేల్ వాన్, కామెంట్రీ చెబుతున్న సైమన్‌ డౌల్‌ కూడా సరదాగా స్పందించారు.  గాయమైన తరువాత కూడా అలా ఎలా ఆడగలిగాడు అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇక మైఖేల్ వాన్ అయితే గాయం అయిన 25 నిమిషాల్లోనే వికెట్టు తీసిన తొలి క్రికెటర్ అని ట్వీట్ చేశాడు.  ఇక మరో కామెంటేటర్ ఇయాన్ స్మిత్  అయితే తనకి కొన్ని నెలలుగా మోకాలి నొప్పి ఉందని, గుల్బదిన్‌కు ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టర్ ఎవరో చెబితే తాను కూడా అక్కడికే వెళతానంటూ వ్యాఖ్యానించాడు.