Greatest Catch Ever in History by Suryakumar Yadav: టీ 20 ప్రపంచకప్(T20 World Cup) ను   కైవసం చేసుకోవాలంటే సఫారీలకు చివరి ఓవర్‌లో 16 పరుగులు అవసరం. బంతితో హార్దిక్... బ్యాట్‌తో డేవిడ్‌ మిల్లర్‌ సిద్ధంగా ఉన్నారు. మ్యాచ్‌ భారత్‌(India) వైపు వచ్చిందని అనుకోడానికి లేదు. ఎందుకంటే అక్కడున్నది జెయింట్‌ కిల్లర్‌గా పేరున్న డేవిడ్‌ మిల్లర్‌. కాబట్టి ఏదైనా సాధ్యమే. అనుకున్నట్లే హార్దిక్‌ పాండ్యా వేసిన తొలిబంతిని మిల్లర్‌ అలవోకగా బౌండరీ అవతలికి కొట్టేశాడు. అందరూ ఆ బంతిని సిక్సర్‌ అనే భావించారు. కానీ మెరుపు తీగలా దూసుకొచ్చిన సూర్యకుమార్‌ యాదవ్‌... అద్భుతమైన క్యాచ్‌ను అందుకున్నాడు.

అసాధ్యంలా కనిపించిన క్యాచ్‌ను బౌండరీ లైన్‌కు ఇవతల అందుకుని... అవతలికి వెళ్తూనే బంతిని మైదానంలోకి విసరేసి.. మళ్లీ చాలా ఒడుపుగా క్యాచ్‌ పట్టేశాడు. రన్నింగ్‌ చేస్తూ పూర్తి బ్యాలెన్సింగ్‌తో బౌండరీ లైన్‌ను తాకకుండా సూర్య పట్టిన ఈ అద్భుతమైన క్యాచ్‌.... టీమిండియాకు ప్రపంచకప్‌ను అందించిందంటే అతిశయోక్తి కాదు. ఈ బంతి కనకు సిక్స్‌ వెళ్తే సమీకరణం అయిదు బంతుల్లో 10 పరుగులుగా మారిపోయేది. అక్కడ విధ్వంసకర బ్యాటర్‌ మిల్లర్‌...ఈ లక్ష్యాన్ని తేలిగ్గానే ముగించేవాడు. అందుకే సూర్య పట్టిన ఈ క్యాచ్చే మ్యాచ్‌ను పూర్తిగా టీమిండియా చేతుల్లోకి వచ్చేలా  చేసింది. అనంతరం చివరి అయిదు బంతుల్లో ఎనిమిది పరుగులే ఇచ్చి భారత్‌కు చిరస్మరణీయమైన విజయాన్ని అందించాడు. 





 





శ్రీశాంత్‌ క్యాచ్‌ గుర్తుందా..?

2007 టీ 20 ప్రపంచకప్‌ పాకిస్థాన్‌తో జరిగిన ఫైనల్లో శ్రీశాంత్‌ పట్టిన క్యాచ్‌ను సూర్యకుమార్‌ ఈ మ్యాచ్‌తో గుర్తు చేశాడు. అప్పుడు కూడా పాకిస్థాన్‌ విజయం ఖాయం అనుకున్న వేళ జోగిందర్‌  శర్మ బౌలింగ్‌లో శ్రీశాంత్‌ క్యాచ్‌ అందుకోవడంతో భారత్ విజయం సాధించింది. అప్పుడు శ్రీశాంత్‌ పట్టంది తేలికైన క్యాచ్చే అయినా అంతటి ఒత్తిడిలో ఆ క్యాచ్‌ను అందుకోవడం అంత తేలిక కాదు. ఇప్పుడు కూడా 140 కోట్ల మంది భారతీయుల అభిమానులను మోస్తూ సూర్యకుమార్‌ యాదవ్‌ కూడా అద్భుతమైన క్యాచ్‌ను అందుకుని భారత్‌కు ప్రపంచకప్‌ రావడంలో కీలకపాత్ర పోషించాడు. 

 

చరిత్ర సృష్టించిన భారత్‌

రోహిత్‌ సేన హృదయాలు తప్ప మ్యాచ్‌ గెలవదని నైరాశ్యంలో కూరుకుపోయిన వేళ భారత జట్టు చరిత్ర సృష్టించింది. ఓటమి అంచుల నుంచి అద్భుతంగా పోరాటం చేసిన భారత జట్టు దక్షిణాఫ్రికాను శోకసంద్రంలో ముంచుతూ పొట్టి ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది. దక్షిణాఫ్రికా గెలుపు ఖాయమైన వేళ అద్భుతంగా పోరాడిన భారత్‌ తమ కలను సాకారం చేసుకుంది.