Ind Vs Sa final: పంత్‌ ఏమిటా ఆట, ఫైనల్లో మరీ ఇంత నిర్లక్ష్యమా?

IND vs SA: అత్యంత కీలక మ్యాచ్ లో రిషభ్‌ పంత్‌ అవుట్ అయిన విధానం విమర్శలకు తావిచ్చింది. అటు సెమీ ఫైనల్స్ లోను ఇటు ఫైనల్ లోను పేలవ ప్రదర్శన అభిమానులను బాధ పెట్టింది.

Continues below advertisement

 Pant Duck out in Final with SA : జరుగుతోంది ఫైనల్‌. అలాంటి ఇలాంటి ఫైనల్‌ కాదు. విశ్వ విజేతలుగా నిలిచే సువ‌ర్ణ అవకాశం ఉన్న తుది సమరం. ఈ సమరంలో ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్న దానికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. అంతటి కీలకమైన మ్యాచ్‌లో ప్రతీ బ్యాటర్‌ పర్ఫార్మెన్స్‌ చాలా కీలకం. ఏ మాత్రం తప్పు చేసినా చేజారేది వికెట్‌ కాదు. మ్యాచ్‌. అలాంటి కీలక మ్యాచ్‌లో రిషభ్‌ పంత్‌(Rishab Panth) నిర్లక్ష్యంగా వికెట్‌ ఇవ్వడం విమర్శలకు తావిచ్చింది. కీలకమైన సెమీఫైనల్లోనూ తక్కువ పరుగులకే వికెట్‌ పారేసుకున్న పంత్‌... ఇప్పుడు అదే విధంగా వికెట్‌ ఇచ్చేసి టీమిండియాను(India) కష్టాల్లోకి నెట్టాడు. టీమిండియా అప్పటికే మంచి ఫామ్‌లో ఉన్న రోహిత్ శర్మ(Rohi Sharma) వికెట్‌ కోల్పోయింది. అలాంటి దశలో కాస్త ఆచితూచి ఆడాల్సిన పంత్‌ రివర్స్‌ స్వీప్‌ ఆడి కీపర్‌ డికాక్‌కు తేలికైన క్యాచ్‌ ఇచ్చి అవుటయ్యాడు. 

Continues below advertisement

పంత్ ఇదేనా నీ బెస్ట్...?
కీలకమైన మ్యాచ్‌లో అప్పటికే ఒక వికెట్‌ పడిపోయిన దశలో పంత్‌ తేలిగ్గా అవుట్‌ కావడం అందరినీ విస్మయానికి గురి చేసింది. నాకౌట్‌ మ్యాచుల్లో ఇలాగేనా బ్యాటింగ్ చేసేదంటూ విమర్శలు చెలరేగుతున్నాయి. ఇంగ్లాండ్‌తో జరిగిన సెమీస్‌లోనూ కీపింగ్‌లో విఫలమై విమర్శలు ఎదుర్కొన్న పంత్‌ ఈసారి బ్యాటింగ్‌లో మరోసారి అదే తప్పు చేశాడు. సెమీస్‌లో కేవలం ఆరు పరుగులకే వెనుదిరిగిన పంత్‌... ఫైనల్లో రెండు బంతులు ఆడి ఒక్క పరుగు కూడా చేయకుండా పెవిలియన్‌ చేరాడు. దీంతో 23 పరుగుల వద్ద తొలి వికెట్‌ కోల్పోయిన టీమిండియా.. అదే స్కోరు వద్ద రెండో వికెట్‌ కోల్పోవడంతో కాస్త ఆత్మ రక్షణలో పడింది. అదే పంత్‌ కాసేపు వికెట్‌ ఆపి ఆ తర్వాత బ్యాట్‌ ఝుళిపించి ఉంటే తర్వాత వచ్చే  బ్యాటర్‌కు కాస్త  స్వేచ్ఛగా బ్యాటింగ్ చేసే అవకాశం లభించేది. కానీ పంత్‌, రోహిత్‌ శర్మ  ఒకే ఓవర్లో అవుట్‌ కావడంతో భారత జట్టుకు పెద్ద షాక్‌ తగిలింది.  
 
కోహ్లీ నిలబడకపోతే...
ఈ ఫైనల్లో కోహ్లీ కీలక ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. విరాట్‌ ఫైనల్‌ కోసం తన శక్తినంత దాచుకుంటున్నాడండూ కెప్టెన్ రోహిత్ శర్మ చేసిన వ్యాఖ్యలు నిజమేనని నిరూపిస్తూ విరాట్‌ విశ్వరూపం చూపాడు. ఈ మెగా టోర్నీలో వరుసగా విఫలమవుతున్న కోహ్లీ ఈ ఫైనల్లో మాత్రం సాధికారికంగా బ్యాటింగ్ చేశాడు. ఆరంభంలో ఆచితూచి ఆడిన కోహ్లీ.... చివర్లో మాత్రం చెలరేగాడు. 34 పరుగులకే కీలకమైన మూడు వికెట్లు నేలకూలి ఎటు పాలుపోని స్థితిలో ఉన్న భారత్‌ను ఆపద్భాందుడిలా కాపాడాడు. అక్షర్‌ పటేల్‌తో కలిసి కోహ్లీ నెలకొల్పిన పార్ట్‌నర్‌షిప్‌ మ్యాచ్‌లోకి మళ్లీ భారత జట్టును తీసుకొచ్చింది. పూర్తిగా సమయోచితంగా బ్యాటింగ్‌ చేసిన కోహ్లీ ఒక్కో పరుగు జోడిస్తూ టీమిండియా స్కోరు బోర్డును ముందుకు నడిపాడు. ఒక్కో పరుగు తీస్తూ ఒత్తిడి పెరగకుండా చూశాడు. కీలకమైన 76 పరుగులు చేసి భారత్‌కుకు గెలిచే అవకాశాలను సృష్టించాడు.
Continues below advertisement