2022 టీ20 ప్రపంచకప్‌లో మరో సంచలనం నమోదైంది. థ్రిల్లర్‌లా సాగిన సూపర్ 12 గ్రూప్-2 మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను జింబాబ్వే ఒక్క పరుగు తేడాతో ఓడించింది. మొదట బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. అనంతరం పాకిస్తాన్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 129 పరుగులకే పరిమితం అయింది. ఈ ఓటమితో పాకిస్తాన్ సెమీస్ అవకాశాలు క్లిష్టంగా మారాయి. ఇక నుంచి ప్రతి మ్యాచ్ గెలవడంతో పాటు మిగతా జట్ల ఫలితాలపై కూడా ఆధార పడాల్సి ఉంటుంది.


టాస్ గెలిచిన జింబాబ్వే కెప్టెన్ క్రెయిగ్ ఎర్విన్ మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఓపెనర్లు మదెవెరె (17: 13 బంతుల్లో, మూడు ఫోర్లు), క్రెయిగ్ ఎర్విన్ (19: 19 బంతుల్లో, రెండు ఫోర్లు) మంచి ఆరంభాన్నే అందించినా పాకిస్తాన్ బౌలర్లు తర్వాత కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. మిగతా బ్యాటర్లలో షాన్ విలియమ్సన్ (31: 28 బంతుల్లో, మూడు ఫోర్లు) మినహా ఎవరూ వేగంగా ఆడలేకపోయారు. దీంతో జింబాబ్వే 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 130 పరుగులకే పరిమితం అయింది. పాకిస్తాన్ బౌలర్లలో మహ్మద్ వసీం జూనియర్ నాలుగు వికెట్లు తీయగా, షాదబ్ ఖాన్ మూడు వికెట్లు తీసుకున్నాడు. హరీస్ రౌఫ్‌కు ఒక వికెట్ దక్కింది.


అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పాకిస్తాన్ మొదటి నుంచే తడబడింది. జింబాబ్వే బౌలర్లు కచ్చితత్వంతో బౌలింగ్ చేసి పాక్ బ్యాటర్లను కట్టడి చేశారు. మొత్తం జట్టులో ముగ్గురు మినహా మిగతా వారి స్ట్రైక్ రేట్ 100 కూడా దాటలేదంటే జింబాబ్వే బౌలింగ్ ఎంత కట్టుదిట్టంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.


వన్ డౌన్ బ్యాటర్ షాన్ మసూద్ (44: 38 బంతుల్లో, మూడు ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. పాకిస్తాన్ విజయానికి చివరి ఓవర్లో 11 పరుగులు అవసరం కాగా, కేవలం తొమ్మిది పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో ఒక్క పరుగుతో ఓటమి పాలైంది. జింబాబ్వే బౌలర్లలో సికందర్ రాజ్ అత్యధికంగా మూడు వికెట్లు తీసుకున్నాడు.