T20 WC 2022, IND vs BAN: టీ20 వరల్డ్ కప్ 2022లో టీమిండియా ఇప్పటి వరకు మూడు మ్యాచ్లు ఆడింది. భారత జట్టు పాకిస్తాన్, నెదర్లాండ్స్‌పై విజయం సాధించింది. దక్షిణాఫ్రికాపై ఓటమిని ఎదుర్కోవాల్సి వచ్చింది. ప్రస్తుతం టీమ్ఇండియా గ్రూప్-2 పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. సెమీ ఫైనల్‌కు వెళ్లేందుకు సూపర్-12 రౌండ్‌లో చివరి రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించాల్సి ఉంది. బంగ్లాదేశ్, జింబాబ్వేతో టీమిండియా ఆడనుంది.
టీమిండియా ఇప్పుడు తన తదుపరి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో తలపడనుంది. నవంబర్ 2న మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. అడిలైడ్ ఓవల్ మైదానంలో జరిగే ఈ మ్యాచ్ భారత్, బంగ్లాదేశ్ జట్లకు ఎంతో కీలకం కానుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు సెమీ-ఫైనల్‌కు వెళ్లే దారి సునాయాసమవుతుంది.
బంగ్లాదేశ్, భారత్ సేమ్ టు సేమ్
బంగ్లాదేశ్ ఇప్పటి వరకు సాధించిన రెండు విజయాలు చిన్న టీమ్‌లపై చేసినవే. నెదర్లాండ్స్, జింబాబ్వేను ఓడించడం ద్వారా బంగ్లాదేశ్ రెండు విజయాలను తన అకౌంట్‌లో వేసుకుంది. దక్షిణాఫ్రికాపై 104 పరుగుల తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.
భారత్‌కు ఎడ్జ్
బంగ్లాదేశ్‌లో ఆడే మ్యాచ్‌లో భారత్‌కు కాస్త విజయావకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వాస్తవానికి బంగ్లా జట్టు ఈ ఏడాది కొన్ని టీ20 మ్యాచ్‌లలో విజయం సాధించింది. భారత్ మాత్రం టీ20 సిరీస్‌లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ వంటి పెద్ద జట్లను ఓడించింది. ఈ ఏడాది జరిగిన టీ20 సిరీస్‌లో శ్రీలంక, వెస్టిండీస్‌ను కూడా భారత్ ఓడించింది. టీమ్ఇండియా ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉంది. బంగ్లాదేశ్ జట్టు మాత్రం బ్యాటింగ్, బౌలింగ్‌లో కాస్త తడబాటు కనిపిస్తోంది.
లైవ్ మ్యాచ్ లను ఎక్కడ చూడాలి?
భారత్-బంగ్లాదేశ్ మధ్య జరిగే ఈ ముఖ్యమైన మ్యాచ్ ను స్టార్ స్పోర్ట్స్ కు చెందిన వివిధ ఛానెళ్లలో ప్రత్యక్ష ప్రసారం కానుంది. మ్యాచ్ లైవ్ స్ట్రీమింగ్‌ను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ యాప్ లో చూడవచ్చు.
భారత్ ఫీల్డింగ్ లోపాలు
ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం జరిగిన గ్రూప్ 2 మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా చేతిలో భారత్ ఐదు వికెట్ల తేడాతో ఓడిపోయింది. పాకిస్థాన్, నెదర్లాండ్స్‌ను ఓడించిన తర్వాత టోర్నీలో భారత్‌కు ఇదే తొలి ఓటమి. ఒక దశలో భారత్‌ను 49/5 స్కోరుకు పరిమితం చేసింది. అయితే సూర్యకుమార్ యాదవ్ మెరుపు ఇన్నింగ్స్‌తో భారత్ 133/9 స్కోరుకు చేరుకుంది.
ప్రారంభంలో అర్ష్‌దీప్ సింగ్ డబుల్ స్ట్రైక్ భారత్‌కు సరైన ప్రారంభాన్ని అందించింది. టీమిండియా మెరుగ్గా ఫీల్డింగ్ చేసి ఉంటే పరిస్థితులు మెరుగ్గా ఉండేవి. విరాట్ కోహ్లి ఒక క్యాచ్ డ్రాప్ చేయడం, కెప్టెన్ రోహిత్ శర్మ రనౌట్ మిస్ చేయడంతో ఎయిడెన్ మార్క్రమ్‌కు రెండు లైఫ్‌లు వచ్చాయి.
మార్క్రమ్, డేవిడ్ మిల్లర్ ద్వయం ఎన్నో డబుల్స్‌ను సింపుల్‌గా తీశాయి. మ్యాచ్ ముగిసిన తర్వాత రోహిత్ శర్మ మాట్లాడుతూ ఫీల్డ్‌లో తాము స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదని అంగీకరించారు. ‘మేం సరిగ్గా ఫీల్డింగ్ చేయలేదు. మేము అలాంటి పరిస్థితుల్లో గతంలో కూడా ఆడాం కాబట్టి పరిస్థితులను నిందించలేం. మేం ఫీల్డింగ్‌లో నిలకడగా ఉండాలనుకుంటున్నాం. కొన్ని క్యాచ్‌లు వదిలేశాం, రనౌట్‌లు చేయలేకపోయాం.’ అని రోహిత్ చెప్పాడు.
ఇన్నింగ్స్ 18వ ఓవర్ అశ్విన్ ఎందుకు వేశాడో కూడా వివరించాడు. ‘స్పిన్నర్‌లతో చివరి ఓవర్ వేయిస్తే గతంలో ఏం జరిగిందో చూశాం. కాబట్టి నేను చివరి ఓవర్‌కి ముందే అశ్విన్ కోటా ముగించాలనుకున్నాను. సీమర్లు సరైన ఓవర్లు వేయాలని కోరుకున్నాను. కొత్త బ్యాటర్ వచ్చినందున అశ్విన్ బౌలింగ్ చేయడానికి ఇది సరైన సమయం.’ అని రోహిత్ వివరించాడు. దక్షిణాఫ్రికా ఇప్పుడు ఐదు పాయింట్లతో గ్రూప్ 2లో అగ్రస్థానంలో ఉంది. భారత్, బంగ్లాదేశ్ వరుసగా రెండు, మూడో స్థానాల్లో ఉన్నాయి. భారత్ నెట్ రన్‌రేట్ మెరుగ్గా ఉంది.
Also Read: కోహ్లీ హోటల్ గదిలోకి అభిమానులు- సోషల్ మీడియాలో అసహనం వ్యక్తం చేసిన విరాట్
Also Read: మా ఫీల్డింగ్ ఆశించిన స్థాయిలో లేదు - భారత కెప్టెన్ రోహిత్ శర్మ!