Rohit Sharma On SKY:  గురువారం ఇంగ్లండ్ తో జరగబోయే సెమీఫైనల్ మ్యాచుకు భారత ఆటగాళ్లు సన్నద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే ప్రాక్టీసు చేస్తుండగా సారథి రోహిత్ శర్మ చేతికి గాయమైంది. వెంటనే బ్యాటింగ్ ఆపేసిన రోహిత్ కాసేపు కూర్చుని విశ్రాంతి తీసుకున్నాడు. అనంతరం మళ్లీ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. ప్రాక్టీస్ అనంతరం రోహిత్ శర్మ మీడియాతో మాట్లాడాడు. 'నాకు అయిన గాయం చిన్నదే అనిపిస్తోంది. ఇప్పుడు బాగానే ఉన్నాను' అని తెలిపాడు. 


అతనికి ఆకాశమే హద్దు


సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ గురించి కూడా రోహిత్ స్పందించాడు. స్కై (సూర్యకుమార్) ఆటలో చాలా పరిణతి కనబరుస్తున్నాడని ప్రశంసించాడు. నిలకడగా ఆడుతూ భారీ స్కోర్లు చేస్తున్నాడని.. జట్టు విజయాల్లో భాగం అవుతున్నాడని కొనియాడాడు. 'తనతో కలిసి బ్యాటింగ్ చేసేవాళ్లపై సూర్య ప్రభావం చూపిస్తాడు. అతనికి చిన్న మైదానాల్లో ఆడడం నచ్చదు. ఎప్పుడూ పెద్ద స్టేడియాల్లో ఆడడానికి ఇష్టపడతాడు. ఎందుకంటే అతనికి ఆకాశమే హద్దుగా ఉంటుంది.' అని రోహిత్ అన్నాడు. 


మాపై నమ్మకముంచండి


ఇంగ్లండ్ తో మ్యాచ్ గురించి మాట్లాడుతూ.. 'ఇంగ్లిష్ జట్టును వారి సొంత మైదానాల్లో ఓడించడం అంత తేలిక కాదు. అయితే గతంలో మేం ఆ పని చేశాం. అదే ఇప్పుడు మాకు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. మేం కోరుకున్నది చేయడానికి ఈ సెమీస్ మాకు ఒక అవకాశం' అని రోహిత్ శర్మ అన్నాడు. ఇప్పటివరకు మెగా టోర్నీలో తాము రాణించిన తీరు చూసి తమపై నమ్మకముంచాలని కోరాడు. నాకౌట్ దశల్లోనూ అలానే ఆడతామని స్పష్టంచేశాడు. ఇంగ్లండ్ పై గెలిచి ఫైనల్ కు దూసుకెళ్లాలని టీమిండియా భావిస్తోంది. ఒకవేళ ఫైనల్ కు చేరితే మొదటి సెమీఫైనల్ విజేతతో కప్పు కోసం పోటీపడుతుంది. 


టీమ్‌ఇండియా టీ20 వరల్డ్‌ కప్‌ గెలవాలంటే కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఎంతో కీలకం. ఇప్పటి వరకు అతడు 89 పరుగులే చేసినప్పటికీ తన ఫీల్డింగ్‌, కెప్టెన్సీ, వ్యూహాలతో ఆకట్టుకున్నాడు. తీవ్ర ఉత్కంఠ రేపిన మ్యాచుల్లో ఫీల్డర్లు, బౌలర్లను మారుస్తూ ప్రత్యర్థులను దెబ్బకొట్టాడు. పరుగుల పరంగా వెనకే ఉన్నా అతడు నిలబడితే ఎంత విధ్వంసకరంగా ఆడతాడో తెలిసిందే. ఇంగ్లాండ్‌ వంటి భీకరమైన జట్టుపై సెమీస్‌ గెలవాలంటే హిట్‌మ్యాన్‌ నాయకత్వం అత్యవసరం.