T20 WC 2007 Recall: 2007.. టీ20 ప్రపంచకప్ ఆరంభ సీజన్. పోటీలో ఒకవైపు మహామహులతో నిండిన ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ లాంటి జట్లు. మరోవైపు అప్పటికి కొన్ని నెలల ముందు వన్డే ప్రపంచకప్ లో గ్రూపు దశలోనే నిష్క్రమించి ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్న భారత్. సచిన్, గంగూలీ, ద్రవిడ్ లాంటి దిగ్గజ ఆటగాళ్లు లేరు. అప్పటికి అంతగా క్రికెట్ ప్రపంచానికి తెలియని మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలో ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగింది టీమిండియా. అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ.. మేటి జట్లను ఓడిస్తూ.. యువ భారత్ పొట్టి ప్రపంచకప్ ను అందుకుంది. ధోనీ నాయకత్వం, యువీ ఆల్ రౌండ్ షో, కుర్రాళ్ల మెరుపులతో ప్రారంభ సీజన్ లోనే టీ20 ప్రపంచకప్ ను ముద్దాడింది. ఈ అపురూప విజయానికి నేటితో 15 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా పొట్టి కప్ గెలిచిన మన భారత క్రికెట్ హీరోల గురించి ప్రత్యేక కథనం మీకోసం. 


చిరకాల ప్రత్యర్థితో ప్రారంభ మ్యాచ్


భారత్- పాకిస్థాన్ మ్యాచ్ అంటేనే ఉత్కంఠకు మారుపేరు. అలాంటిది టీ20 లాంటి ప్రపంచకప్ లాంటి మెగా టోర్నీలో ఈ రెండు దేశాలు తలపడుతున్నాయంటే ఆ ఉత్కంఠ తారస్థాయికి చేరుతుంది. స్కాట్లాండ్ తో మ్యాచ్ రద్దవటంతో.. మెగా టోర్నీలో టీమిండియా ఆరంభ మ్యాచే పాకిస్థాన్ తో ఆడింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్.. పాక్ బౌలర్ల ధాటికి విలవిల్లాడింది. ఆదిలోనే గంభీర్, సెహ్వాగ్, యువరాజ్ లాంటి అగ్రశ్రేణి ఆటగాళ్ల వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే రాబిన్ ఊతప్ప అద్భుత అర్థశతకంతో 141 పరుగుల లక్ష్యాన్ని పాక్ ముందు ఉంచింది. దాయాది దేశం కూడా అన్నే పరుగులు చేయటంతో.. ఫలితాన్ని బాలౌట్ ద్వారా నిర్ణయించారు. బాలౌట్ లో భారత్ మూడు బంతుల్లో 3 వికెట్లు పడగొట్టగా.. పాక్ బౌలర్లు ఒక్కరు కూడా వికెట్ తీయలేకపోయారు. దీంతో అద్భుత విజయం భారత్ సొంతమైంది. 


యువీ.. సిక్స్ బై సిక్స్


ఇంగ్లండ్ తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా అదిరే విజయాన్ని అందుకుంది. ఆ మ్యాచ్ లో బ్రాడ్ బౌలింగ్ లో 6 బంతుల్లో 6 సిక్సులు కొట్టిన యువరాజ్ సింగ్ ఇన్నింగ్స్ ను ఎవరూ మర్చిపోలేరు. ఆండ్రూ ఫ్లింటాఫ్ కవ్వించటంతో రెచ్చిపోయిన యువీ.. బ్రాడ్ బౌలింగ్ ను ఉతికి ఆరేశాడు. స్డేడియంలో సిక్సర్ల వర్షం కురిపించాడు. 6 బంతులకు 6 సిక్సర్లు బాది రికార్డు నెలకొల్పాడు. ఈ క్రమంలో 12 బంతుల్లోనే అర్థశతకం సాధించి.. అతి తక్కువ బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించిన ఆటగాడిగా మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. 


దాయాదితో ఫైనల్


సూపర్- 8లో మంచి విజయాలతో భారత్ ఫైనల్ చేరింది. పాక్ కూడా తుది పోరుకు అర్హత సాధించటంతో దాయాది దేశాల మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఫైనల్ మ్యాచ్ మరింత ఉత్కంఠగా సాగింది. ఈ పోరులో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా తడబడింది. సెహ్వాగ్ దూరం కావటంతో యూసుఫ్ పఠాన్, గంభీర్ ఓపెనర్లుగా వచ్చారు. యూసుఫ్, ఊతప్ప త్వరత్వరగా ఔటవటంతో భారత్ కష్టాల్లో పడింది. అయితే గంభీర్, రోహిత్ శర్మ రాణించటంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 157 పరుగుల ఓ మోస్తరు స్కోరు చేసింది. 


ఛేదనలో పాకిస్థాన్ కూడా తడబడింది. మహ్మద్ హఫీజ్, కమ్రాన్ అక్మల్ ల వికెట్లు పడగొట్టిన ఆర్పీ సింగ్ ఆరంభంలోనే దాయాది దేశాన్ని దెబ్బతీశాడు.  అయితే ఇమ్రాన్ నజీర్ (33) దూకుడుగా ఆడటంతో పాక్ రేసులోకి వచ్చింది. అయితే స్వల్ప వ్యవధిలో వికెట్లు తీసిన భారత్ పాక్ పై ఒత్తిడి పెంచింది.


ఉత్కంఠగా చివరి ఓవర్


పాకిస్థాన్ గెలవాలంటే చివరి ఓవర్ కు 13 పరుగులు అవసరం. భారత్ ఒక్క వికెట్ తీస్తే గెలుపు సొంతమవుతుంది. ఇలాంటి సమయంలో టీమిండియా కెప్టెన్ ధోనీ.. అనూహ్యంగా మీడియం పేసర్ జోగిందర్ శర్మకు బంతి ఇచ్చాడు. క్రీజులో మిస్బావుల్ హక్ ఉన్నాడు. జోగిందర్ మొదటి బంతినే వైడ్ గా వేశాడు. తర్వాతి బంతికి పరుగులేమీ రాలేదు. రెండో బంతిని మిస్బా సిక్సర్ గా మలిచాడు. దీంతో భారత శిబిరంలో ఆందోళన నెలకొంది. 4 బంతుల్లో 6 పరుగులు అవసరమైన స్థితిలో.. జోగిందర్ శర్మ విసిరిన బంతిని మిస్బా స్కూప్ షాట్ ఆడాడు. అంతే గాల్లో లేచిన బంతిని షార్ట్ ఫైన్ లెగ్ లో శ్రీశాంత్ ఒడిసి పట్టాడు. దీంతో అద్భుత విజయంతో పాటు పొట్టి కప్ భారత్ సొంతమైంది. ప్రతి అభిమాని మనసు సంతోషంతో నిండిపోయింది. 


మైదానంలో భారత్ అభిమానుల కేరింతల నడుమ మొదటి టీ20 ప్రపంచకప్ ను సగర్వంగా ఎత్తుకుంది టీమిండియా. ఈ మ్యాచ్ జరిగి నేటితో సరిగ్గా 15 ఏళ్లు పూర్తయ్యాయి. సీనియర్లు అందుబాటులో లేని జట్టును అద్భుతంగా నడిపిన ధోనీ తర్వాతి ప్రయాణం అందరికీ తెలిసిందే. ఆ కప్ కు ప్రాతినిథ్యం వహించిన యువరాజ్ సింగ్, రోహిత్ శర్మ, ఇర్ఫాన్ పఠాన్ లాంటి ఆటగాళ్లు తర్వాత అద్భుత ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. ఈ విజయమే 2011 వన్డే ప్రపంచకప్ గెలవడానికి కావల్సిన ప్రేరణను అందించిదనడంలో అతిశయోక్తి లేదు.