Suryakumar Yadav: రెండేండ్ల క్రితం భారత జట్టులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ ఆనతికాలంలోనే అద్భుతమైన ఇన్నింగ్స్‌తో  టీ20 జట్టులో స్థానాన్ని   సుస్థిరం చేసుకోవడంతో పాటు  ఈ ఫార్మాట్‌లో వరల్డ్ నెంబర్ వన్ బ్యాటర్‌గా ఎదిగాడు.  టీ20లలో నిలకడగా రాణించడంతో  సూర్యకు వన్డే జట్టులో కూడా  చోటు దక్కింది. అయితే టీ20లలో ప్రభావం చూపినంతగా సూర్య.. వన్డేలలో  ఆడటం లేదు.  వన్డేలలో అతడి  గణాంకాలు ఆందోళనకరంగా ఉన్నాయి. అయితే తాను వన్డేలలో అనుకున్న స్థాయిలో రాణించడం లేదని చెప్పుకునేందుకు తానేం సిగ్గుపడనని అంటున్నాడు సూర్య.. 


వెస్టిండీస్‌తో మూడో టీ20 ముగిశాక సూర్య మాట్లాడుతూ.. ‘అవును.. నిజాయితీగా చెప్పాలంటే నా వన్డే ఫామ్, గణాంకాలు ఏమంత గొప్పగా లేవు. ఆ విషయాన్ని అంగీకరించడానికి నేను సిగ్గుపడను. దాని గురించి అందరికీ తెలుసు. అది దాచాల్సిన విషయం కూడా కాదు.. ’అని వ్యాఖ్యానించాడు.  


తాను టీ20 ఫార్మాట్‌లోనే ఎక్కువ మ్యాచ్‌లు ఆడానని,  వన్డేలలో   సరిగ్గా రాణించకున్నా రాబోయే రోజుల్లో  ఇంప్రూవ్ అవుతానని చెప్పుకొచ్చాడు. ‘నేను   వన్డే ఫార్మాట్‌లో ఎలా మెరుగుపడాలనేదానిపై కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్‌తో  చర్చించా.   వాల్లు కూడా  ఈ ఫార్మాట్‌లో నేనేమీ ఎక్కువ మ్యాచ్ ఆడలేదు కావున  దాని గురించి చింతించాల్సిన పన్లేదని నాతో చెప్పారు.  ఆఖర్లో  10 - 15 ఓవర్లు బ్యాటింగ్ చేయాల్సి వచ్చినప్పుడు ఎలా ఆడాలనేదానిపై  దృష్టి సారించాలని సూచించారు.  నాకు ఇచ్చిన బాధ్యతలను  ఎలా సద్వినియోగం చేసుకోవాలనేది నా చేతుల్లోనే ఉంది..’ అని  సూర్య వెల్లడించాడు. 


 






కాగా  సూర్య ఇపప్పటివరకూ 51 టీ20లలో  మూడు శతకాల సాయంతో  1,780 పరుగులు చేయగా  26 వన్డేలలో 24 ఇన్నింగ్స్‌లలో బ్యాటింగ్ చేసి 511 పరుగులు మాత్రమే చేయగలిగాడు.  టీ20లలో విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడే సూర్య.. వన్డేలలో మాత్రం తేలిపోతాడు. ఈ ఏడాది  ఆరంభంలో న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో భాగంగా మూడు మ్యాచ్‌లలో 45 (31, 0, 14) పరుగులే చేసిన సూర్య.. ఆ తర్వత ఆస్ట్రేలియా సిరీస్‌లో అయితే  మూడు మ్యాచ్‌లలో మూడుసార్లూ ఎదుర్కున్న తొలి బంతికే డకౌట్ అయ్యాడు.  ఇక వెండీస్ టూర్‌లో కూడా వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌లో మూడు మ్యాచ్‌లు ఆడిన సూర్య.. 19, 24, 35 పరుగులు చేసి నిరాశపరిచాడు. 


 






వన్డే వరల్డ్ కప్ ప్రాబబుల్స్‌లో ఉన్న సూర్య.. ఈ మాసాంతంలో జరిగే ఆసియా కప్‌లో ఎలా ఆడతాడు..? అనేదానిపై అతడిని వరల్డ్ కప్‌లో ఆడించాలా..? లేదా..? అన్నది ఆధారపడి ఉంటుంది. ఇవే వైఫల్యాలు కొనసాగితే మాత్రం  ప్రపంచకప్ కోసం ఎంపిక చేసే జట్టులో సూర్య ఉన్నా తుది జట్టులో అయితే అవకాశం రావడం గగనమే అవుతుంది.
































ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial