IND vs WI T20:  టీమిండియా స్పిన్నర్  కుల్దీప్ యాదవ్ మూడో టీ20 మ్యాచ్‌లో  అద్భుతంగా బౌలింగ్ చేసి విండీస్‌ను కట్టడి చేయడమే గాక ఓ అరుదైన రికార్డును కూడా సొంతం చేసుకున్నాడు. పొట్టి ఫార్మాట్‌లో భారత్ తరఫున  అతి తక్కువ ఇన్నింగ్స్‌లలోనే 50 వికెట్లు తీసిన బౌలర్‌గా అతడు రికార్డులకెక్కాడు.  గతంలో యుజ్వేంద్ర చాహల్ పేరిట ఉన్న రికార్డును   బ్రేక్ చేసిన  కుల్దీప్.. అంతర్జాతీయ స్థాయిలో కూడా పలువురు దిగ్గజ బౌలర్లను వెనక్కినెట్టాడు. 


నిన్నటి  మ్యాచ్‌లో బ్రాండన్ కింగ్, నికోలస్ పూరన్, ఛార్లెస్‌లను ఔట్ చేసిన కుల్దీప్.. తన ఖాతాలో  మరో మైలురాయిని వేసుకున్నాడు. కుల్దీప్ ఈ ఘనతను 30 మ్యాచ్‌లలోనే  అందుకున్నాడు.  అంతకుముందు ఈ రికార్డు  యుజ్వేంద్ర చాహల్ (34 మ్యాచ్‌లు) తరఫున ఉండేది.  యుజీ ఈ ఘనతను 2019లో సాధించాడు.  టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా.. 41 మ్యాచ్‌లలో  ఈ ఘనతను సాధించాడు.  అంతర్జాతీయ స్థాయిలో  ఈ ఘనత సాధించిన బౌలర్లలో.. శ్రీలంకకు చెందిన అజంతా మెండిస్.. 26 మ్యాచ్‌లలోనే ఈ ఘనతను అందుకున్నాడు. 


 






భారత్ తరఫున టీ20లలో అత్యంత వేగంగా 50 వికెట్లు సాధించిన బౌలర్లు: 


- కుల్దీప్ యాదవ్ : 30 మ్యాచ్‌లు
- యుజ్వేంద్ర చాహల్ : 34 
- జస్ప్రిత్ బుమ్రా : 41 
- రవిచంద్రన్ అశ్విన్ - 42 
- భువనేశ్వర్ కుమార్ - 50  


అంతర్జాతీయ స్థాయిలో.. 


అజంతా మెండిస్ - 26 మ్యాచ్‌లు
కుల్దీప్ యాదవ్ - 30
ఇమ్రాన్ తాహిర్ - 31 
రషీద్ ఖాన్ - 31
లుంగి ఎంగిడి - 32 






వెస్టిండీస్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో   నాలుగు ఓవర్లు వేసి  20 పరుగులిచ్చి ఒక వికెట్ తీశాడు. కానీ  రెండో టీ2‌0లో అతడు ఆడలేదు. ఇక నిన్నటి మ్యాచ్‌లో   నాలుగు ఓవర్లు వేసి 28 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు.  ఇక మూడో టీ20 విషయానికొస్తే.. వెస్టిండీస్ నిర్దేశించిన  160 పరుగుల లక్ష్యాన్ని భారత్.. 17.5 ఓవర్లలోనే 3 వికెట్లు  మాత్రమే కోల్పోయి అలవోకగా  ఛేదించింది. టీమిండియా వైస్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్  వీరోచిత ఇన్నింగ్స్ (44 బంతుల్లో 83, 10 ఫోర్లు, 4 సిక్సర్లు)‌కు తోడు  ఆంధ్రా కుర్రాడు తిలక్ వర్మ (37 బంతుల్లో 49 నాటౌట్, 4 ఫోర్లు, 1 సిక్సర్) మరోసారి నిలకడైన ఆటతో  భారత్ మూడో టీ20లో ఏడు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. అంతకుముందు వెస్టిండీస్.. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది.  బ్రాండన్ కింగ్ (42), కెప్టెన్ రోవ్మన్ పావెల్ (40 నాటౌట్) రాణించారు. భారత బౌలర్లలో  కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లు పడగొట్టాడు. ఈ సిరీస్‌లో  నాలుగో టీ20 ఈనెల 12 (శనివారం) ఫ్లోరిడా (అమెరికా)లో జరుగుతుంది. 


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial