ICC Champions Trophy News: దేశవాళీల్లో టన్నుల కొద్దీ పరుగులు సాధిస్తున్న కరుణ్ నాయర్.. ఇటీవల ప్రకటించిన ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీతోపాటు ఇంగ్లాండ్ వన్డే సిరీస్ కు ఎంపిక కాలేకపోయాడు. ఒకవైపు భారత క్రికెటర్లందరూ డొమెస్టిక్ క్రికెట్ ఆడాలని ఒత్తిడి చేస్తున్న బీసీసీఐ, దేశవాళీల్లో పరుగులు సాధిస్తున్న క్రికెటర్లకు మాత్రం అవకాశాలు ఇవ్వడం లేదని విమర్శలు వస్తున్నాయి. విజయ్ హజారే ట్రోఫీలో ఒకదశలో 752 సగటుతో పరుగులు చేసిన కరుణ్ ను పక్కన పెట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. తాజాగా దీనిపై లిటిల్ మాస్టర్ సునీల్ గావస్కర్ సమాధానమిచ్చాడు. వన్డే ఫార్మాట్లో కరుణ్ నాయర్ కు ప్రస్తుతం జట్టులో చోటు లేదని తెలిపాడు. చాంపియన్స్ ట్రోఫీకి కేవలం 15 మందినే ఎంపిక చేయాల్సి ఉంటుందని, ఈ స్థితిలో కరుణ్ ను చోటు ఎక్కడ దొరకుతుందని గావస్కర్ ప్రశ్నించాడు. ఏదేమైనా తన ఫామ్ ను ఇదే రకంగా కొనసాగించాల్సిన అవసరముందని కరుణ్ కు సూచించాడు.


ఎవరి ప్లేస్ లో తీసుకుంటారు..?
వన్డే ఫార్మాట్ లో కరుణ్ కు రెండు స్థానాల్లో మాత్రమే చాన్స్ ఉందని, అవి కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ ప్లేసులు మాత్రమేనని గావస్కర్ వ్యాఖ్యానించాడు. ఐదో నెంబర్లో బ్యాటింగ్ చేయడంతోపాటు అదనపు వికెట్ కీపర్ గా కూడా పని చేస్తాడని సూచించాడు. గత 2023 వన్డే వరల్డ్ కప్పులో వికెట్ కీపర్ బ్యాటర్ గా అద్బుతంగా రాణించిన విషయాన్ని గుర్తు చేశాడు. మరోవైపు శ్రేయస్ కు ఈ ఫార్మాట్ లో మంచి రికార్డు ఉందని తెలిపాడు. నిజానికి ఇండియా ఎక్కువగా వన్డేలు ఆడటం లేదని, అందుచేత ఆటగాళ్ల ఫామ్ పై బేరీజుకు రాలేమని తెలిపాడు. వన్డే ప్రపంచకప్ ముగిశాక భారత్ కేవలం ఆరు వన్డేలు మాత్రమే ఆడింది. సౌతాఫ్రికాతో జరిగిన మూడు వన్డేల సిరీస్ ను గెలుపొందగా, శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్ లో ఓడిపోయింది. ఇంత తక్కువ మ్యాచ్ లతో ఆటగాళ్ల ఫామ్ ను అంచనా వేయలేమని గావస్కర్ పేర్కొన్నాడు. 


ఇంగ్లాండ్ టూర్ వరకు..
రంజీ ట్రోఫీలో నిలకడగా, ఇదే రకం ఆటతీరు ప్రదర్శిస్తే కరుణ్ నాయర్ కు తిరిగి జాతీయ జట్టులో స్థానం దొరికే అవకాశముందని గావస్కర్ తెలిపాడు. అప్పటివరకు తన ఫామ్ ను కంటిన్యూ చేయాల్సిన అవసరముందని సూచించాడు. వచ్చే జూన్ లో ఇంగ్లాండ్ లో పర్యటించనున్న భారత్ అక్కడ ఐదు టెస్టుల సిరీస్ ఆడుతుంది. ఇప్పటికే న్యూజిలాండ్, ఆస్ట్రేలియా చేతుల్లో టెస్టు సిరీస్ లో ఓడిపోవడంతో, ఆ సిరీస్ లో చెత్తగా ఆడితే కఛ్చితంగా ఆటగాళ్లపై వేటు పడవచ్చు. ఈక్రమంలో 33 ఏళ్ల కరుణ్ కు మళ్లీ ఎనిమిదేళ్ల తర్వాత జాతీయ జట్టులో స్థానం దక్కే అవకాశముందని తెలిపాడు.



మరోవైపు కరుణ్ నాయర్ ను వన్డే జట్టులోకి ఎంపిక చేయలేక పోవడంపై చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్క్ విచారం వ్యక్తం చేశాడు. అద్భుతమైన ఆటతీరు ప్రదర్శిస్తున్నా, జట్టులో కేవలం 15 మందికే స్థానం ఉందని, అందుకే కరుణ్ ను పక్కన పెట్టక తప్పని పరిస్థితి నెలకొందని తెలిపాడు. జట్టులో ప్రస్తుతమున్న ఆటగాళ్లు ఈ ఫార్మాట్ కు సరిగ్గా సరిపోతారని, రాబోయే రోజుల్లో అంచనాలకు తగిన ప్రదర్శనను చూడవచ్చని ఆశాభావం వ్యక్తం చేశాడు.  


Read Also; Neeraj Chopra Marriage: ప్రేమించి, పెళ్లి చేసుకున్న నీరజ్ చోప్రా.. వధువెవరో తెలుసా..! వివాహాన్ని రహస్యంగా ఉంచిన స్టార్ అథ్లెట్