Sunil Gavaskar Comments on Sanju: భారత్ (India) - దక్షిణాఫ్రికా (South Africa) మధ్య జరిగిన సిరీస్‌ డిసైడర్‌ మ్యాచ్‌లో సంజు శాంసన్‌ శతకంతో చెలరేగడంతో టీమిండియా ఘన విజయం సాధించింది. ఇది సంజు శాంసన్‌కు తొలి అంతర్జాతీయ సెంచరీ. సంజుకు కెరీర్‌లో ఇదే తొలి సెంచరీ. వన్డే శతకం సాధించిన తొలి కేరళ బ్యాటర్‌ కూడా సంజు శాంసనే. అయితే ఈ శతకం చేసేందుకు సంజు శాంసన్‌కు 8 సంవత్సరాల కంటే ఎక్కువ సమయం పట్టింది. సంజు తన మొదటి అంతర్జాతీయ మ్యాచ్‌ను 19 జూలై 2015న ఆడాడు. 21 డిసెంబర్ 2023న తన మొదటి సెంచరీని సాధించగలిగాడు. ఈ సెంచరీపై సంజు శాంసన్‌ స్పందించాడు. ఈ శతకం తనకు చాలా భావోద్వేగంతో కూడుకున్నదని... నిజంగా చాలా సంతోషంగా ఉందని సంజు తెలిపాడు. శారీరకంగా, మానసికంగా ఎంతో కష్టపడిన తనకు ఇప్పుడు ఫలితాలు అనుకూలంగా రావడం సంతోషంగా ఉందని అన్నాడు. సంజు శాంసన్‌ సెంచరీపై దిగ్గజ ఆటగాడు సునీల్ గావస్కర్ ప్రశంసలు గుప్పించాడు. ఈ సెంచరీ సంజూ కెరీర్‌ను మారుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. సంజూ శతకం చాలా కాలం పాటు గుర్తుండిపోతుందని అన్నాడు. ఇలాంటి ఇన్నింగ్స్ ఆడే సత్తా సంజు శాంసన్‌కు ఉందన్న గావస్కర్.. అతడి ప్రతిభ గురించి మనందరికీ తెలుసన్నారు. అతడిలో ఉన్న టాలెంట్‌ను శాంసన్ ఇన్నేళ్లకు బయటకు తెచ్చాడని గవాస్కర్‌ కొనియాడాడు.

 

సెంచరీతో అదరగొట్టిన సంజూ

సిరీస్‌ దక్కాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో సంజు శాంసన్‌... సూపర్‌ సెంచరీతో అదరగొట్టాడు.  తొలి రెండు మ్యాచుల్లో నిరాశ పరిచిన సంజు శాంసన్‌ కీలకమైన ఈ మ్యాచ్‌లో శతకంతో చెలరేగాడు. సంజు శాంసన్‌.. సమయోచితంగా బ్యాటింగ్‌ చేశాడు. సంజు శాంసన్‌ సాధికారికంగా బ్యాటింగ్‌ చేశాడు. 110 బంతుల్లో ఆరు ఫోర్లు, రెండు సిక్సులతో సెంచరీ సాధించాడు. అనంతరం 114 బంతుల్లో 108 పరుగులు చేసి సంజు శాంసన్ అవుటయ్యాడు. ఇక తిలక్‌ వర్మ కూడా అర్ధ శతకంతో సత్తా చాటడంతో భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసింది. అనంతరం 297 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా.. 45.5 ఓవర్లలో 218 పరుగులకు ఆలౌట్‌ అయింది. దీంతో 78 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించి... వన్డే సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది.

 

సిరీస్ కైవసం

297 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా.. 45.5 ఓవర్లలో 218 పరుగులకు ఆలౌట్‌ అయింది. మరోసారి ప్రొటీస్‌కు మంచి ఆరంభమే దక్కింది. హెండ్రిక్స్‌, జోర్జీ తొలి వికెట్‌కు 59 పరుగులు జోడించారు. ఈ జోడిని అర్ష్‌దీప్‌సింగ్‌ విడదీశాడు. రెండో వన్డేలో శతకంతో చెలరేగిన జోర్జీ ఈ మ్యాచ్‌లోనూ భారత్‌ను భయపెట్టాడు. 87 బంతుల్లో 81 పరుగులు చేసి సౌతాఫ్రికాను విజయం దిశగా నడిపించాడు. కానీ జోర్జీ మినహా సఫారీ బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. దీంతో సఫారీ జట్టు 218 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో అర్ష్‌దీప్‌ నాలుగు వికెట్లతో సత్తా చాటాడు. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా సంజు శాంసన్‌... సిరీస్‌లో మొత్తం 10 వికెట్లు తీసిన అర్ష్‌దీప్‌ సింగ్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌ దక్కింది.