Gavaskar On Kohli:  ఈ ఏడాది టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సూపర్ ఫాంలో ఉన్నాడు. ఆడిన 4 వన్డేల్లో 3 శతకాలు సాధించాడు. దాదాపు నాలుగేళ్ల పేలవ ఫాం తర్వాత గతేడాది సెప్టెంబర్ లో ఆసియా కప్ లో బంగ్లాదేశ్ పై టీ20 టన్నుతో తన సెంచరీల కరవును తీర్చుకున్నాడు. అప్పటి నుంచి కేవలం 22 ఇన్నింగ్సుల్లో 4 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు. అందులో 3 వన్డే శతకాలు ఉన్నాయి. అవి కేవలం 4 ఇన్నింగ్సుల్లో చేశాడు. 


ఆదివారం జరిగిన శ్రీలంక- భారత్ మూడో వన్డేలో కోహ్లీ అద్భుత శతకం అందుకున్నాడు. ఇది అతనికి 46వ వన్డే సెంచరీ.  ఈ క్రమంలోనే స్వదేశంలో సచిన్ టెండూల్కర్ సాధించిన 49 శతకాలకు విరాట్ కోహ్లీ చేరువగా వచ్చాడు.  ఇంకో 3 శతకాలు బాదితే మాస్టర్ బ్లాస్టర్ రికార్డును విరాట్ సమం చేస్తాడు. అయితే అది ఎప్పుడు అందుకుంటాడనే చర్చ మొదలైంది. ఎందుకంటే గత నాలుగేళ్లలో ఒక్క సెంచరీ చేయని కోహ్లీ... ఇప్పుడు 3 శతకాలను తక్కువ ఇన్నింగ్సుల్లోనే అందుకున్నాడు. అందుకే ఇప్పుడు సచిన్ రికార్డును కోహ్లీ ఎప్పుడు అందుకుంటాడనే చర్చ నడుస్తోంది. దీనిపై టీమిండియా లెజెండ్ సునీల్ గావస్కర్ స్పందించాడు. ఈ ఏడాది ఐపీఎల్ మొదలవడానికి ముందే కోహ్లీ వన్డేల్లో సచిన్ 49 సెంచరీల రికార్డును అందుకుంటాడని గావస్కర్ జోస్యం చెప్పారు. 


ఐపీఎల్ కన్నా ముందే


ఐపీఎల్ కు ముందు భారత్ మొత్తం 6 వన్డేలు ఆడనుంది. న్యూజిలాండ్ తో 3, ఆ తర్వాత ఆస్ట్రేలియాతో 3 ఉన్నాయి. ప్రస్తుతం కోహ్లీ ఉన్న ఫాంను బట్టి చూస్తే ఈ 6 ఇన్నింగ్సుల్లో మరో 3 శతకాలు బాదడం కష్టమేమీ కాదని సునీల్ గావస్కర్ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం కోహ్లీ ఉన్న ఫాం, అతను ఆడుతున్న విధానాన్ని బట్టి 3 సెంచరీలు కష్టమేం కాదు. ఐపీఎల్ కు ముందు టీమిండియాకు 6 వన్డేలు ఉన్నాయి. సచిన్ రికార్డును చేరుకోవాలంటే కోహ్లీకి 3 శతకాలు కావాలి. ప్రస్తుతం అతను బ్యాటింగ్ చేస్తున్న విధానం చూస్తే ఐపీఎల్ ప్రారంభానికి ముందే ఆ 3 సెంచరీలు చేస్తాడని నాకనిపిస్తోంది అని గావస్కర్ అన్నాడు. 


జనవరి 18 నుంచి భారత్ లో న్యూజిలాండ్ పర్యటన ప్రారంభం కానుంది. ఈ పర్యటనలో రెండు జట్లు 3 వన్డేలు, 3 టీ20లు ఆడనున్నాయి.