Sunil Gavaskar: భారత్ - వెస్టిండీస్ మధ్య సోమవారంతో రెండు మ్యాచ్‌ల  టెస్టు సిరీస్ ముగిసింది. ఆట ఐదో రోజు వర్షార్పణమై డ్రా గా ముగియనగా తొలి టెస్టులో గెలిచిన  భారత జట్టు సిరీస్‌ను 1-0తో గెలుచుకుంది. కాగా ఈ సిరీస్ ముగిసిన తర్వాత భారత  దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్.. సెలక్టర్లకు కీలక సూచనలు చేశాడు.  గతంలో మాదిరిగానే ఈ సిరీస్‌లో కూడా  జట్టుకు  రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రూపంలో పరుగులు భారీగా వచ్చాయని, ఈ పాత చింతకాయ పచ్చడి కథను ఇకనైనా ముగిస్తే బెటర్ అన్న  అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. 


‘మిడ్-డే’కు రాసిన వ్యాసంలో  గవాస్కర్.. ‘విండీస్‌తో సిరీస్‌లో ఎప్పటిమాదిరిగానే  రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు  పరుగులు చేశారు.    కానీ దీనినుంచి సెలక్టర్లు ఏం నేర్చుకున్నారు..? ఇంతకంటే బెటర్ ఆప్షన్స్ మీకు కనిపించలేదా..?  అంతగా  ప్రాధాన్యత లేని ఈ సిరీస్‌లో ఈ ఇద్దరినీ పక్కనబెట్టి కొత్తవాళ్లను  ట్రై చేయాలని అనిపించలేదా..?  వాళ్లు ఎలా ఆడతారు..? పరిస్థితులకు తగ్గట్టు ఆడగలరా లేదా అన్నది  పరీక్షిస్తే బాగుండేది. కానీ  సెలక్టర్లు ఆ ప్రయోగాలు చేయడానికి ఇష్టపడలేదు..’ అని  పేర్కొన్నాడు. 


భారత మాజీ క్రికెటర్ అజిత్ అగార్కర్  టీమిండియా చీఫ్ సెలక్టర్‌గా ఎంపికైన నేపథ్యంలో ఇకనైనా సీనియర్లకు విశ్రాంతినిచ్చి కొత్త ఆటగాళ్లను తయారుచేస్తారన్న విశ్వాసం ఉందని రాసుకొచ్చారు. ‘ఇప్పుడు సెలక్షన్ కమిటీకి అజత్ అగార్కర్ ఛైర్మన్‌గా వచ్చాడు.  ఇప్పటికైనా  భారత జట్టు ఎంపిక విధానంలో ఏమైనా మార్పులు వస్తాయా..? లేక అదే పాత కథను రిపీట్ చేస్తారా..? అనేది త్వరలోనే తేలనుంది..’అని  వెల్లడించాడు. 


కాగా  ఈ సిరీస్ కంటే ముందే విండీస్‌తో టెస్టు సిరీస్‌కు రోహిత్, విరాట్‌కు విశ్రాంతినిచ్చి   ఆ స్థానంలో  సర్ఫరాజ్ ఖాన్, రుతురాజ్ గైక్వాడ్ వంటి ఆటగాళ్లను  ఆడించాలని వాదనలు వెల్లువెత్తాయి.  రుతురాజ్ టీమ్‌లో చోటు దక్కించుకున్నాఅతడికి రెండు టెస్టులలోనూ ఆడే అవకాశమే రాలేదు.   సర్ఫరాజ్ ఖాన్‌ను పక్కనబెట్టిన సెలక్టర్లు.. యశస్వి జైస్వాల్‌కు మాత్రం ఛాన్స్ ఇచ్చారు. ఆడిన తొలి టెస్టులోనే సెంచరీ చేసిన జైస్వాల్..   రెండో టెస్టులో కూడా  నిలకడగా ఆడాడు. యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్‌కు రెండు టెస్టులలో ఆడే ఛాన్స్ ఇచ్చినా తొలి టెస్టులో అతడికి ఆడే అవకాశం రాలేదు. రెండో టెస్టు సెకండ్ ఇన్నింగ్స్‌లో   మాత్రం సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు.


 






ఇక  వెస్టిండీస్‌తో సిరీస్‌లో  ఓ సెంచరీ, రెండు అర్థ సెంచరీల సాయంతో   రోహిత్ 240 పరుగులు చేయగా  కోహ్లీ కూడా ఓ సెంచరీతో 197 పరుగులు చేశాడు.  అయితే ఈ ఇద్దరితో పాటు జైస్వాల్  కూడా రాణించాడు. కానీ భారత్ భారీ ఆశలు పెట్టుకున్న శుభ్‌మన్ గిల్, అజింక్యా రహానేలు అట్టర్ ఫ్లాఫ్ అయ్యారు.





























ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial