AUS VS SA WTC Final Match - Steve Smith surpassed Sachin Tendulkar: ఆస్ట్రేలియా లెజెండరీ బ్యాటర్ స్టీవ్ స్మిత్ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. ఐసీసీ ఈవెంట్లకు సంబంధించి భారత మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ను దాటేశాడు. బుధవారం క్రికెట్ మక్కా లార్డ్స్ లో ప్రారంభమైన ప్రపంచటెస్టు చాంపియన్ షిప్ ఫైనల్లో అర్థ సెంచరీతో సత్తా చాటాడు. 112 బంతుల్లో 10 ఫోర్లతో 66 పరుగులు చేసిన స్మిత్.. ఐసీసీ నాకౌట్ మ్యాచ్ ల్లో అత్యధిక 50+ స్కోర్లను చేసిన ప్లేయర్ గా టెండూల్కర్ ను దాటేసి, ఓవరాల్ గా రెండో స్థానంలోకి వచ్చాడు. తాజా ఫిఫ్టీ స్మిత్.. ఐసీసీ నాకౌట్ మ్యాచ్ ల్లో చేసిన ఆరోది కావడం విశేషం. ఓవరాల్ గా 13 మ్యాచ్ లు ఆడిన స్మిత్.. 59కిపైగా సగటుతో రెండు సెంచరీలు, ఆరు ఫిఫ్టీలు చేశాడు. ఇక టెండూల్కర్ 15 నాకౌట్ మ్యాచ్ లు ఆడి, 48కిపైగా సగటుతో 682 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, ఐదు ఫిఫ్టీలు ఉన్నాయి.
టాప్ లో విరాట్..ఇక ఐసీసీ నాకౌట్ మ్యాచ్ లలో వెయ్యికి పైగా పరుగులు చేసిన ఏకైక ప్లేయర్ గా భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రికార్డుల్లో నిలిచాడు. తను ఓవరాల్ గా 22 నాకౌట్ మ్యాచ్ లు ఆడి, 51కిపైగా సగటుతో 1024 పరుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచరీ, తొమ్మిది ఫిఫ్టీలు ఉన్నాయి. ఓవరాల్ గా పది ఫిఫ్టీ ప్లస్ స్కోర్లతో అగ్రస్థానంలో నిలిచాడు. ఇక 2023 వన్డే ప్రపంచకప్ లో న్యూజిలాండ్ తో జరిగిన సెమీ ఫైనల్లో తను సెంచరీ సాధించాడు. 117 పరుగుల ఆ ఇన్నింగ్స్ ద్వారా భారత్ సెమీస్ లో విజయం సాధించి, ఫైనల్లోకి దూసుకెళ్లిన సంగతి తెలిసిందే.
ఆసక్తికరంగా ఫైనల్ మ్యాచ్..అందరూ ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా జట్ల మధ్య ప్రారంభమైన డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ తొలిరోజే థ్రిల్లింగ్ గా సాగింది. ఫస్ట్ డేనే 14 వికెట్లు నేలకూలడంతో ఈ మ్యాచ్ పై టెన్షన్ నెలకొంది. బుధవారం ఇంగ్లాండ్ లోని క్రికెట్ మక్కా లార్డ్స్ మైదానంలో ప్రారంభమైన ఈ మ్యాచ్ లో పేసర్లు సత్తా చాటారు. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆసీస్.. కేవలం 56.4 ఓవర్లలో 212 పరుగులకు ఆలౌటైంది. ఆల్ రౌండర్ బ్యూ వెబస్టర్ స్టన్నింగ్ ఫిఫ్టీ (92 బంతుల్లో 72, 11 ఫోర్లు) తో టాప్ స్కోరర్ గా నిలిచాడు. కగిసో రబాడా ఈ మైదానంలో రెండోసారి ఐదు వికెట్ల ప్రదర్శన (5/51) తో ఆకట్టుకున్నాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌతాఫ్రికా తొలి రోజు ఆటముగిసే సరికి 22 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 43 పరుగులు చేసింది. ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ (16) టాప్ స్కోరర్ గా నిలిచాడు. మిషెల్ స్టార్క్ రెండు వికెట్లతో ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం ఆసీస్ కంటే 169 పరుగుల వెనుకంజలో సఫారీలు నిలిచారు.