AUS VS SA WTC Final Match Updates: ఆస్ట్రేలియా, ద‌క్షిణాఫ్రికా జ‌ట్ల మ‌ధ్య జ‌రుగుతున్న ప్ర‌పంచ టెస్టు చాంపియ‌న్షిప్ ఫైన‌ల్ మ్యాచ్ ఉత్కంఠ‌భ‌రితంగా సాగుతోంది. బుధ‌వారం ఇంగ్లాండ్ లోని క్రికెట్ మ‌క్కా లార్డ్స్ మైదానంలో ప్రారంభ‌మైన ఈ మ్యాచ్ లో పేస‌ర్లు స‌త్తా చాటారు. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆసీస్.. కేవ‌లం 56.4 ఓవ‌ర్ల‌లో 212 ప‌రుగుల‌కు ఆలౌటైంది. ఆల్ రౌండ‌ర్ బ్యూ వెబ‌స్టర్ స్ట‌న్నింగ్ ఫిఫ్టీ (92 బంతుల్లో 72, 11 ఫోర్లు) తో టాప్ స్కోర‌ర్ గా నిలిచాడు. క‌గిసో ర‌బాడా ఈ మైదానంలో రెండోసారి ఐదు వికెట్ల ప్ర‌ద‌ర్శ‌న (5/51) తో ఆక‌ట్టుకున్నాడు. అనంత‌రం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌతాఫ్రికా తొలి రోజు ఆట‌ముగిసే స‌రికి 22 ఓవ‌ర్ల‌లో నాలుగు వికెట్ల న‌ష్టానికి 43 ప‌రుగులు చేసింది. ఓపెన‌ర్ ర్యాన్ రికెల్ట‌న్ (16) టాప్ స్కోర‌ర్ గా నిలిచాడు. మిషెల్ స్టార్క్ రెండు వికెట్ల‌తో ఆక‌ట్టుకున్నాడు. 

ఆదుకున్న స్మిత్, వెబ్ స్ట‌ర్ భాగ‌స్వామ్యం..పేస‌ర్ల‌కు అనుకూలించే పిచ్ పై టాస్ ఓడి ఫ‌స్ట్ బ్యాటింగ్ చేసిన ఆసీస్ కు ఏదీ క‌లిసి రాలేదు. ఉస్మాన్ ఖ‌వాజా డ‌కౌట్ కాగా, కామెరాన్ గ్రీన్ (4) త్వ‌ర‌గానే ఔట‌య్యాడు. కాసేప‌టికే మార్న‌స్ ల‌బుషేన్ (17), డేంజ‌ర‌స్ ట్రావిస్ హెడ్ (11) కూడా ఔట్ కావ‌డంతో 67/4 తో క‌ష్టాల్లో ప‌డింది. ఈ ద‌శ‌లో వెట‌ర‌న్ స్టీవ్ స్మిత్ అద్భుత ఫిఫ్టీ (112 బంతుల్లో 66, 10 ఫోర్లు)తో ఆక‌ట్టుకున్నాడు. త‌న అనుభ‌వ‌న్నంతా రంగ‌రించి, వెబ్ స్ట‌ర్ తో క‌లిసి గేమ్ చేంజింగ్ భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పాడు. మ‌ధ్య‌లో ఎల్బీ ఔట్ నుంచి త‌ప్పించుకున్న వెబ్ స్ట‌ర్ వన్డే త‌ర‌హాలో ఆడాడు. వీరిద్ద‌రూ ఐదో వికెట్ కు 79 ప‌రుగులు జోడించ‌డంతో ఆసీస్ కోలుకుంది. ఫిఫ్టీ త‌ర్వాత స్మిత్ ఔట్ కాగా, ఆ త‌ర్వాత వ‌చ్చిన బ్యాట‌ర్లను ప్రొటీస్ పేస‌ర్లు పెవిలియ‌న్ కు పంపారు. చివ‌ర్లో వెబ్ స్ట‌ర్ ఔట్ కావ‌డంతో ఆసీస్ ఇన్నింగ్స్ త్వ‌ర‌గానే ముగిసింది. మిగ‌తా బౌల‌ర్ల‌లో మార్కో య‌న్సెన్ కు మూడు వికెట్లు ద‌క్కాయి. ప్ర‌స్తుతం ఆసీస్ కంటే 169 ప‌రుగుల వెనుకంజ‌లో స‌ఫారీలు నిలిచారు.

వికెట్లు ట‌పాట‌పా..ఆసీస్ ని త‌క్కువ స్కోరుకే ఆలౌట్ చేశామ‌న్న ఆనందం సౌతాఫ్రికాకు ఎక్కువ సేపు మిగ‌లలేదు. ఫ‌స్ట్ ఓవ‌ర్ ఆఖ‌రి బంతికి ఐడెన్ మార్క్ర‌మ్ డ‌కౌట్ అవ‌డంతో ప్రొటీస్ వికెట్ల ప‌త‌నం ప్రారంభ‌మైంది. మూడు ఫోర్ల‌తో కాస్త ధాటిగా ఆడిన రికెల్ట‌న్ కూడా స్టార్క్ కే చిక్కాడు. దీంతో 19 ప‌రుగుల‌కే ఓపెన‌ర్ల వికెట్ల‌ను కోల్పోయింది. ఆ త‌ర్వాత కాసేప‌టికే వియాన్ మ‌ల్డ‌ర్ (6),, ట్రిస్ట‌న్ స్ట‌బ్స్ (2) ఔట్ కావ‌డంతో ప్రొటీస్ 30/4 తో చిక్కుల్లో ప‌డింది. ఇక మ‌రో ఎండ్ లో చాలా ఓపిక‌గా ఆడిన కెప్టెన్ టెంబా బ‌వుమా (37 బంతుల్లో 3 బ్యాటింగ్), డేవిడ్ బెడింగ్ హామ్ (8 బ్యాటింగ్) మ‌రో వికెట్ ప‌డ‌కుండా రోజును ముగించారు. ఇక ఇప్ప‌టివ‌ర‌కు రెండుసార్లు డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్ మ్యాచ్ లు జ‌రుగ‌గా, 2021లో న్యూజిలాండ్, 2023లో ఆసీస్ విజేత‌గా నిలిచాయి. ఈ రెండుసార్లు భార‌తే ర‌న్న‌ర‌ప్ గా నిలిచింది. ఇక ఈ సారి డిఫెండింగ్ చాంపియ‌న్ గా బ‌రిలోకి దిగుతున్న ఆసీస్.. రెండోసారి విజేత‌గా నిల‌వాల‌ని భావిస్తోంది. ఇక తొలిరోజే 14 వికెట్లు ప‌డ‌టంతో నాలుగు రోజుల్లోపే ఈ మ్యాచ్ ముగుస్తుంద‌ని విశ్లేష‌కులు అభిప్రాయ ప‌డుతున్నారు.