Sri Lanka cricket team made history:  బంగ్లాదేశ్‌(Bangladesh)తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో శ్రీలంక (Srilanka)అదరగొట్టింది. 48 ఏళ్ల రికార్డు(48YearOld Massive Record)ను తిరగ రాసింది. అద్భుతమైన ఆటతో  సరికొత్త చరిత్ర సృష్టించింది.  ఓవర్‌నైట్‌ స్కోరు 314/4తో ఆదివారం తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన లంక. బంగ్లాదేశ్‌ బౌలర్లకు పీడకలను మిగిలిస్తూ శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 531 పరుగుల భారీ స్కోరు చేసింది.


 ఇన్నింగ్స్‌లో ఒక్క సెంచరీ కూడా లేకుండా అత్యధిక స్కోర్‌ చేసిన జట్టుగా చరిత్ర సృష్టించింది.  ఒక్క బ్యాటర్ కూడా సెంచరీ చేయకుండా శ్రీలంక 531 పరుగులు చేసింది.  ఈ ఇన్నింగ్స్ లో ఏడుగురు టాప్ బ్యాటర్లు అర్ధ శతకాలతో మెరిశారు. కుశాల్ మెండిస్ 93 పరుగులతో అత్యధిక స్కోరు చేయగా... కమిందు మెండిస్ 92 పరుగులతో అజేయంగా నిలిచాడు.  ఒక్కరూ శతకం పూర్తి చేయలేదు. కాని మొత్తానికి  టెస్టు క్రికెట్ చరిత్రలో బ్యాటర్లు ఎవరూ శతకం సాధించకుండా అత్యధిక పరుగులు చేసిన జట్టుగా లంక చరిత్ర సృష్టించింది. 


గతంలో ఈ రికార్డు టీం ఇండియా(Team India) పేరిట ఉండేది. 1976లో కాన్పూర్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో బ్యాటర్లు ఒక్కరూ కూడా సెంచరీ చేయకపోయినా భారత్‌ 524/9 స్కోరు చేసి ఈ రికార్డును సృష్టించింది. ఇప్పుడు ఈ రికార్డునే శ్రీ లంక బద్దలు కొట్టింది.  రెండు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌లో భాగంగా చట్టోగ్రామ్‌ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో మ్యాచ్‌లో పర్యాటక శ్రీలంక పటిష్ట స్థితిలో ఉంది. ఓవర్‌నైట్‌ స్కోరు 314/4తో ఆదివారం తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన లంక తరువాత దినేశ్‌ చండిమాల్‌ (59), ధనంజయ డిసిల్వా (70;), కమిందు మెండిస్‌ (92 నాటౌట్‌ అర్ధసెంచరీలు సాధించడంతో 531 పరుగులు చేసి ఆలౌటైంది. తరువాత రెండో టెస్టు రెండో రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ మొదటి ఇన్నింగ్స్‌లో ఒక వికెట్ నష్టానికి 55 పరుగులు చేసింది.   తైజుల్ ఇస్లాం పరుగులేమీ లేకుండా 28 పరుగులతో ఉన్న బంగ్లా ఓపెనర్ జకీర్ హసన్ తో కలిసి క్రీజులో ఉన్నారు. దీంతో  బంగ్లాదేశ్‌.. శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌ స్కోర్‌కు   476 పరుగులు వెనుకంజలో ఉంది.  ఇప్పటికే ఈ సిరీస్‌లో తొలి టెస్ట్‌ మ్యాచ్‌లో గెలిచి శ్రీలంక 1-0 కొనసాగుతున్న విషయం తెలిసిందే. 


మరోసారి అదరగొట్టిన కమిందు 
 ఈ మ్యాచ్‌లో కమిందు మెండిస్‌ మరోసారి మెరిశాడు. లంక చివరి బ్యాటర్‌ అసిత ఫెర్నాండో డకౌట్ అయినప్పుడు మెండిస్ 92 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు. కమిందు మెండిస్‌ తొలి టెస్టులో 102, 164 పరుగులతో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ శతకాలు చేశాడు. కానీ ఈ సారి కాస్తలో సెంచరీ కోల్పోయాడు. గతంలో శ్రీలంక ఆటగాడు కమిందు మెండిస్ 147 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యంత అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. ఏడో స్థానంలో వచ్చి రెండు ఇన్నింగ్స్‌లలోనూ సెంచరీలు సాధించిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు.