టీమిండియా మాజీ క్రికెటర్లు గౌతమ్ గంభీర్, శ్రీశాంత్ లెజెండ్స్ లీగ్ క్రికెట్‌లో ఆడుతున్నారు. గౌతమ్ గంభీర్ ఇండియా క్యాపిటల్స్‌కు, శ్రీశాంత్ గుజరాత్ జెయింట్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అయితే ఈ లీగ్‌లో ఈ ఇద్దరి ఆటగాళ్ల మధ్య జరిగిన గొడవ మళ్లీ కలకలం రేపింది. బుధవారం ఇండియా క్యాపిటల్స్, గుజరాత్ జెయింట్స్ జట్ల మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ జరుగుతున్న సమయంలో గౌతమ్ గంభీర్, శ్రీశాంత్‌ల మధ్య గొడవ జరిగింది. గంభీర్ తనను ఫిక్సర్ అని పదే పదే పిలిచి అవమానించాడని, సహచర ఆటగాళ్లతో పాటు సీనియర్ క్రికెటర్లకు గంభీర్ మర్యాద ఇవ్వడని శ్రీశాంత్ సంచలన ఆరోపణలు చేశాడు. ప్రత్యక్ష ప్రసారమవుతున్న మ్యాచ్‌లో గంభీర్ తనను ఫిక్సర్ అంటూనే ఉన్నాడని... ఏమంటున్నావు అని తనని అడిగానని.. కానీ తను మాత్రం అలా అంటూనే ఉన్నాడని శ్రీశాంత్ ఆరోపించాడు. తాను ఒక్క చెడు మాట కూడా అనలేదని.. ఓవర్ అయిపోయిన తర్వాత అతనెందుకు అలా చేశాడో అర్థం కావట్లేదని... గంభీర్ ఎంతో మందితో ఇలాగే ప్రవర్తిస్తున్నాడని ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో శ్రీశాంత్ సంచలన ఆరోపణలు చేశాడు.
పక్కన ఉన్న వాళ్లు అతడిని ఆపుతున్నా కూడా అతడు ఫిక్సర్ అని పిలుస్తూనే ఉన్నట్లు వీడియోలో శ్రీశాంత్ చెప్పుకొచ్చాడు. ఈ విషయంలో తన తప్పేమీ లేదని తెలిపాడు. కానీ గంభీర్ మద్దతుదారులు మాత్రం గంభీర్ అన్నది ఫిక్సర్ కాదని సిక్సర్, సిక్సర్ అన్నాడని చెబుతున్నారని ఇది ఆమోదయోగ్యం కాదని శ్రీశాంత్ తెలిపాడు. అతని మద్దతుదారులు గంభీర్‌ను కాపాడాలని చూస్తున్నారని.. అదనపు జీతానికి ఆశపడే పీఆర్‌ల మాటలు నమ్మొద్దని కోరుతున్నానని ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో శ్రీశాంత్ పేర్కొన్నాడు. దీనిపై పరోక్షంగా స్పందించిన గంభీర్... టీమ్‌ఇండియా జెర్సీలో నవ్వుతూ ఉన్న తన ఫొటోను ఎక్స్‌లో పోస్టు చేసి.. ప్రపంచం మొత్తం దృష్టిని ఆకర్షించాలని చూసినప్పుడు నవ్వుతూ ఉండాలని పోస్ట్‌లో రాశాడు.
అసలేం జరిగిందంటే
బుధవారం ఇండియా క్యాపిటల్స్, గుజరాత్ జెయింట్స్ జట్ల మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో శ్రీశాంత్ వేసిన ఓవర్‌లో గంభీర్ వరుసగా సిక్స్, ఫోర్ కొట్టాడు. దీంతో గంభీర్ వైపు శ్రీశాంత్ సీరియస్‌గా చూడగా గంభీర్ సైతం కోపంగా అతడి వైపు చూశారు. ఆ తరువాత కాసేపటికే వీరిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అంపైర్లు, ఆటగాళ్లు సర్దిజెప్పారు. మ్యాచ్ సజావుగా సాగేలా చూశారు. ఇక మ్యాచ్ అనంతరం దీనిపై సోషల్ మీడియాలో శ్రీశాంత్ మాట్లాడుతూ.. తనను ఫిక్సర్ అని పిలిచాడని ఆవేదన వ్యక్తం చేశాడు.
శ్రీశాంత్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియోపై అతడి భార్య భువనేశ్వరి స్పందించారు. శ్రీశాంత్‌తో కలిసి చాలా కాలం పాటు టీమ్ఇండియాకు ఆడిన ఓ ఆటగాడు ఇలా అన్నాడని తెలిసి షాక్‌కు గురైనట్లు చెప్పారు. యాక్టివ్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ అయిన చాలా సంవత్సరాల తరువాత కూడా మైదానంలో అతడు ఇలా మాట్లాడడం అతడి ప్రవర్తనను తెలియజేస్తుందని తెలిపారు. ఇది పద్దతి కాదని. నిజంగా ఈ ఘటన దిగ్భ్రాంతికరమైనదని భువనేశ్వరీ వీడియో పోస్ట్ పై కామెంట్ చేసింది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 2013 ఐపీఎల్‌లో స్పాట్ ఫిక్సింగ్ కారణంగా శ్రీశాంత్‌పై బీసీసీఐ మొదట జీవిత కాల నిషేధం విధించిన సంగతి తెలిసిందే. కానీ సుప్రీం కోర్టు 2019లో దీన్ని ఏడేళ్లకు తగ్గించడంతో శ్రీశాంత్ నిషేధం నుంచి బయటపడ్డాడు.