T20 World Cup 2024 ambassador Usain Bolt : క్రికెట్ ప్రేమికులు ఆసక్తిగా ఎదురు చూస్తోన్న టీ20 ప్రపంచకప్ 2024 (T 20 World Cup 2024) జూన్ 1 నుంచి ప్రారంభం కానుంది. ఈ వరల్డ్ కప్‌కు యూఎస్, వెస్టిండీస్ ఆతిథ్యం ఇవ్వనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం దాదాపు అన్ని దేశాలు తమ వరల్డ్ కప్ టీమ్‌ల ఎంపికలో బిజీగా ఉన్నాయి. ఈ సమయంలో ఐసీసీ నుంచి టీ20 వరల్డ్ కప్‌కి సంబంధించి బుధవారం కీలక అప్‌డేట్ రిలీజ్ అయింది. టీ20 ప్రపంచకప్ 2024 ప్రచారకర్తగా జమైకన్ పరుగుల చిరుత, ఒంలంపిక్ గోల్డ్ మెడలిస్ట్ ఉసెన్ బోల్ట్( Usain Bolt)ను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ICC) నియమించింది. అమెరికాలో క్రికెట్ సామ్రాజ్యాన్ని స్థాపించేందుకు ఐసీసీ అనేక కార్యక్రమాలు చేపట్టింది. దీంతో తన స్పీడ్‌తో ఒలింపిక్స్‌లో 8 సార్లు బంగారు పతకాలు సాధించిన జమైకా స్పీడ్‌స్టర్ ఉసేన్ బోల్ట్‌ను టీ20 ప్రపంచకప్ అంబాసిడర్‌గా నియమించారు. బోల్డ్‌ను అంబాసిడర్‌గా ఎంపిక చేయడం వల్ల, టీ20 వరల్డ్‌కప్ మరిన్ని దేశాలకు పరిచయం అవుతుందని భావిస్తున్నట్లు తెలిపారు టోర్నీ నిర్వాహకులు. విభిన్న రకాల స్పోర్ట్స్ ఫ్యాన్స్‌ను టీ20 క్రికెట్ వరల్డ్ కప్ ఆకర్షిస్తుందని వారు భావిస్తున్నారు.
స్ప్రింటర్‌గా ఉసెన్ బోల్ట్ సంచలన రికార్డులు నమోదు చేశాడు. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌తో కెరీర్ ప్రారంభించిన ఉసెన్ బోల్ట్.. 100 మీటర్లు, 200 మీటర్లు, 4x100 మీటర్ల రిలే విభాగాల్లో బంగారు పతకాలు సాధించాడు. 9.58 సెకన్లలోనే 100 మీటర్లు, 19.19 సెకన్లలోనే 200 మీటర్లు, 36.84 సెకన్లలోనే 4x100 మీటర్ల రేసును పూర్తి చేసి ఛాంపియన్‌గా నిలిచాడు. 2016 రియో ఓలింపిక్స్‌లో మూడు విభాగాల్లో గోల్డ్ మెడల్స్ సాధించి.. ట్రిపుల్ రికార్డు నమోదు చేశాడు.
జూన్ 1 నుంచి ప్రారంభం కానుండగా తొలి మ్యాచ్‌లో ఆతిథ్య అమెరికా(USA)తో కెనడా తలపడబోతోంది. జూన్ 1న ప్రారంభంకానున్న టీ 20 ప్రపంచకప్ జూన్ 29న ముగుస్తుంది. ఈ టోర్నీలో మొత్తం 20 జట్లు నాలుగు గ్రూపుల్లో పోటీ పడతాయి. తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు నాకౌట్‌కు చేరుకుంటాయి. ఈ మెగా టోర్నీలో గ్రూప్ ఏ లో భారత్(Team India), పాకిస్థాన్(Pakistan) జట్లు ఉన్నాయి. అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూసే దాయాదుల సమరం న్యూయార్క్ వేదికగా జూన్ 9న జరగనుంది. టీమిండియా గ్రూప్ దశలో జూన్ అయిదున ఐర్లాండ్‌తో 12న అమెరికాతో 15న కెనడాతో తలపడనుంది. అయితే ఈ టీ 20 ప్రపంచకప్‌నకు ఐసీసీ రిజర్వ్ డేలను ప్రకటించింది.
టీమిండియా కోసం స్పెషల్ ప్రోమో
ఈ క్రమంలో ప్రముఖ బ్రాడ్ కాస్టింగ్ ఛానెల్ స్టార్ స్పోర్ట్స్ తాజాగా టీమిండియా కోసం స్పెషల్ ప్రోమో వీడియోను రిలీజ్ చేసింది. 'రోహిత్ సేన టీ20 వరల్డ్ కప్ కు సిద్ధమవుతోంది. వాళ్ల యాక్షన్ చూడడానికి మీరు సిద్ధమా?' అనే క్యాప్షన్‌తో ఎక్స్ వేదికగా ఈ వీడియోను పంచుకుంది. వీడియో బ్యాక్ గ్రౌండ్ లో భారత జాతీయ గేయం 'వందేమాతరం'ను ప్లే చేయడం జరిగింది. వీడియోలో భారత జట్టు కీలక ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజాలను చూపించింది.